ఏపీలో వచ్చే ఎన్నికలలో అధికారం కోసం అధికార వైసీపీ, టీడీపీ పార్టీలు ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు. కులాల ప్రాతిపాదికగా సామాజిక సమీకరణాలకి తెరతీస్తూ రాజకీయాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో అన్ని వర్గాల వారిని టార్గెట్ చేస్తూ ఆకట్టుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు. టీడీపీ బీసీలు అంటే వెంటనే వైసీపీ అలెర్ట్ అయ్యి బీసీ సభలు పెట్టింది. అలాగే ఇప్పుడు కృష్ణా జిల్లాలోనే కాకుండా ఏపీలోని కాపు సామాజిక వర్గ ప్రజలకి ఆరాధ్యంగా భావించే వంగవీటి రంగా పేరుతో రెండు పార్టీలు రాజకీయాన్ని షురూ చేశాయి. వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా కాపు ఓటర్లని ఆకట్టుకునేందుకు టీడీపీ, వైసీపీ పోటాపోటీగా ఆయనకీ నివాళి అర్పించే కార్యకలాపాలు నిర్వహించారు.
ఇక ఈ రాజకీయం గుడివాడలో అయితే మరింత రసవత్తరంగా సాగింది. గుడివాడలో చౌదరి, కాపు కాంబినేషన్ గుడివాడ నానికి బలంగా మారింది. వంగవీటి రంగా కుమారుడు రాదాతో ఉన్న అనుబందాన్ని చూపిస్తూ గుడివాడలో కాపు ఓటుబ్యాంకు కూడా నాని సొంతం చేసుకుంటున్నాడు. గుడివాడలో మెజారిటీ రాదా ఫలోవర్స్ కాపులలో ఉన్నారు. ఇక చౌదరి సామాజిక వర్గం అంతా కొడాలి నానికి అండగా ఉంటూ వచ్చింది. అయితే టీడీపీ నుంచి బయటకి రావడమే కాకుండా ఆ పార్టీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ మీద ఇష్టారీతిలో కొడాలి నాని మాటల దాడి చేస్తూ ఉండటంతో చౌదరి కమ్యూనిటీలో ఎవరికి నచ్చడం లేదు. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
అయితే రంగా తర్వాత కాపులకి పెద్దదిక్కుగా ఉన్న పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగత విమర్శలు చేయడం ఆ వర్గంలో కొడాలి నాని మీద వ్యతిరేకత పెరగడానికి కారణం అయ్యింది. దీంతో ఈ సారి గుడివాడలో ఈ రెండు వర్గాల వారు నానికి ఓటు వేసే అవకాశం లేదనే మాట వినిపిస్తుంది. అయితే కాపులని మచ్చిక చేసుకోవడానికి రంగా వర్ధంతి రోజు రాదాతో కలిసి రంగా విగ్రహానికి నివాళి అర్పించారు. రాదా తనకి తమ్ముడులాంటివాడు అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే టీడీపీ అండతోనే రంగా హత్య జరిగిందని చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే టీడీపీని చంపిన కుటుంబానికి చెందిన దేవినేని అవినాష్ ఇప్పుడు వైసీపీలో ఉండటం తిరిగి ఆ పార్టీకి నష్టం కలిగించే అంశంగా మారిందనేది గుడివాడలో వినిపిస్తున్న మాట.