T BJP : తెలంగాణ బీజేపీలో భారీ మార్పులు చేర్పులు చోటు చేసుకోబోతున్నాయని తెలుస్తోంది. సంస్థాగతంగా పార్టీ చాలా బలహీనంగా ఉన్నట్టు గుర్తించారు. మోర్చాలతో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుల పనితీరుపై జాతీయ నాయకత్వం అసంతృప్తితో ఉందని సమాచారం. ఈ క్రమంలోనే నామమాత్రంగా పనిచేస్తున్న మోర్చాలు, పార్టీ జిల్లా సారథుల మార్పు జరిగే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. రానున్న ఎన్నికల నేపథ్యంలో పార్టీ ఎంత స్ట్రాంగ్ అయితే అంత అధికారానికి చేరువ అవుతామని తెలిపారు. ఈ నేపథ్యంలో ముందుగా సంస్థాగతంగా బలోపేతం కావడంపై పార్టీ అగ్ర నాయకత్వం దృష్టి సారిస్తోంది. దీనిలో భాగంగాయూపీ ఎన్నికల్లో కీలకంగా పనిచేసిన సునీల్ బన్సల్‌కు ఇక్కడ సంస్థాగత ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు అప్పగించింది.
తొలిసారిగా ఇద్దరు జాతీయ ప్రధాన కార్యదర్శులు వేర్వేరు అంశాలపై రాష్ట్ర బాధ్యులుగా వ్యవహరించనున్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న తరుణ్‌ఛుగ్.. చేరికలు, పార్టీ కార్యక్రమాలు వంటి రాజకీయ వ్యవహారాలను పర్యవేక్షించనుండగా.. సునీల్ బన్సల్ పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించనున్నారు. రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో పార్టీకి కనీసం పోలింగ్ బూత్ కమిటీలు కూడా లేవు. ఉన్నవాటిలో కొన్ని నామమాత్రంగా ఉన్నాయి. కాగా.. కొంత మంది జిల్లా అధ్యక్షుల పని తీరు సైతం నిరాశాజనకంగా ఉందని పార్టీ జాతీయ నాయకత్వం గుర్తించింది. అలాగే మోర్చాల పనితీరుపైనా జాతీయ నాయకత్వం సంతృప్తిగా లేదు. అందుకే భారీ ప్రక్షాళన జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
T BJP : ఇక్కడి నుంచే అసెంబ్లీ ఎన్నికలకు రాచబాట..
మొత్తానికి రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. దీనికోసం సంస్థాగతంగా.. బూతుల వారీగా పార్టీని బలోపేతం చేస్తోంది. ఇక మునుగోడు ఎన్నికల లోపే నామమాత్రంగా పనిచేసే జిల్లా సారధులను మార్పు చేయనున్నారు. మునుగోడు ఉపఎన్నిక అన్ని పార్టీలకూ కీలకమే కాబట్టి.. అన్ని పార్టీలు ఇక్కడ దృష్టి సారిస్తున్నాయి. బీజేపీకి గెలుపు అవకాశాలు ఎక్కువ కాబట్టి ఇక్కడి నుంచే అసెంబ్లీ ఎన్నికలకు రాచబాట వేసుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. ఈ క్రమంలోనే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ స్థానాన్ని చేజారనివ్వకూడదని నిర్ణియించింది. గెలుస్తామనే ధీమాను పక్కనబెట్టి విజయం కోసం పార్టీ శ్రమిస్తోంది. ఈ క్రమంలోనే మార్పులు, చేర్పులు చేపట్టనుంది. మరి ఈ మార్పులు చేర్పులు పార్టీకి ఎంత మేర లాభిస్తాయో వేచి చూడాలి.