తెలుగు సినిమా కీర్తిని అంతర్జాతీయంగా మరోసారి చాటిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’. టాలీవుడ్ నుండి వచ్చిన ఈ సినిమా ఎల్లలుదాటి ఏకంగా అంతర్జాతీయ వేదిక మీద అదరగొట్టేసింది. ఈ సినిమాను చూసిన అంతర్జాతీయ ప్రేక్షకులు సైతం నివ్వెరబోయేలా ఈ సినిమాను ఆ స్థాయిలో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించాడు.
తాజాగా ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు గాను ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కింది. ఒరిజినల్ సాంగ్ క్యాటగిరీలో ఈ సినిమాకు ఈ అవార్డు దక్కింది. మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకోగా.. తెలుగు వారి కీర్తి మరింత రెట్టింపు అయింది. గోల్డెన్ గ్లోబ్ లాంటి ఎంతో గుర్తింపు, పేరు, ప్రతిష్టాత్మకమైన అవార్డును అందుకోవడంతో ‘ఆర్ఆర్ఆర్’ టీం మీద అందరి నుండి అభినందనల వెల్లువ కురిసింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైత ‘ఆర్ఆర్ఆర్’ టీంను మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు. ఈమేరకు ప్రధాని.. ‘ఇదొక విశేషమైన విజయం! కీరవాణి, ప్రేమ్ రక్షిత్, కాలభైరవ, చంద్రబోస్ లతో పాటు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, ఇతర చిత్రబృందానికి నా అభినందనలు. ఈ ప్రతిష్టాత్మక విజయంతో ప్రతి ఒక్క భారతీయుడు గర్వపడేలా చేశారు’ అని ట్వీట్ చేశారు.
అటు తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సైతం ‘ఆర్ఆర్ఆర్’టీంను మెచ్చుకున్నారు. చంద్రబాబు ట్వీట్ చేస్తూ.. ‘ఆర్ఆర్ఆర్ మూవీ ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకుందని తెలుసుకొని సంతోషిస్తున్నాను. ఎంఎం కీరవాణి, రాజమౌళి మరియు మొత్తం చిత్ర బృందానికి అభినందనలు. ఇది గర్వించదగ్గ విషయం. నేను ముందే చెప్పినట్లుగానే తెలుగు భాష ఇప్పుడు శక్తివంతంగా మారింది’ అని పేర్కొన్నారు.