God Father Review: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా విడుదలపై ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మోహన్ లాల్ నటించిన మళయాల సినిమా లూసిఫర్ కు రీమేక్ గా ఈ చిత్రం వస్తోంది. గాడ్ ఫాదర్ లో చిరంజీవికి సోదరిగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తోంది. అలాగే హీరోను రక్షించే మాఫియా డాన్ పాత్రలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా కీ రోల్ పోషిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనికితోడు ఫస్ట్ లుక్, టీజర్ విడుదల చేయగానే ఫ్యాన్స్ నుంచి విశేష స్పందన వచ్చింది.
సినీ ఇండస్ట్రీలో చిన్న పాత్రలతో కెరీర్ ను ప్రారంభించి, తన నటన, డ్యాన్స్, హావభావాలతో అంచలంచెలుగా పైకెదిగారు చిరంజీవి. తన కష్టంతో టాలీవుడ్ మెగాస్టార్ అయ్యారు. అలా ఇండస్ట్రీలో అగ్ర కథానాయకుడిగా పేరు తెచ్చుకున్న ఆయన.. ఆ మధ్య కాలంలో దాదాపు దశాబ్ద కాలం పాటు సినిమాలకు విశ్రాంతినిచ్చారు. రాజకీయాల నుంచి వైదొలిగాక ఖైదీ నంబర్ 150 పేరుతో తమిళ సినిమాను రీమేక్ చేసి బంపర్ హిట్ కొట్టారు. తర్వాత సైరా నరసింహారెడ్డి, ఆచార్య సినిమాలతో అలరించారు. ఈ రెండు సినిమాలు పెద్ద హిట్ కాకున్నా.. ఈసారి రెండేళ్ల గ్యాప్ తీసుకొని గాడ్ ఫాదర్ తో హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్నారు.
గాడ్ ఫాదర్ సినిమా ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. తెలుగుతో పాటు హిందీలోనూ అందరి దృష్టినీ ఆకర్షించింది. దీనికి తోడు ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా ఆర్భాటంగా నిర్వహించారు. అభిమానుల్లో సరికొత్త జోష్ నింపింది చిత్ర యూనిట్. భారీ అంచనాల నడుమ ఈ సినిమా రేపు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ సెన్సార్ సభ్యుడు, సినీ క్రిటిక్ ఉమర్ సంధు స్పందన సంచలనంగా మారింది. గాడ్ ఫాదర్ ఫస్ట్ రివ్యూ అని చెబుతూ, తన అభిప్రాయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.
God Father Review:
మెగాస్టార్ చిరంజీవి ఇక రెస్ట్ తీసుకోవాలని ఆ రివ్యూలో పేర్కొనడం గమనార్హం. సెన్సార్ బోర్డు నుంచి మొదటి రివ్యూ అని, బీ, సీ, క్లాస్ ఆడియన్స్ కు ఇది ఒక యావరేజ్ సినిమా అని పేర్కొన్నాడు ఉమర్ సంధు. చిరంజీవి మంచి కంటెంట్ ఉన్న సాలిడ్ స్క్రిప్ట్స్ ఎంచుకోవాలని సూచించాడు. ప్రజల మనిషి అని చెప్పుకొనేవి, మాస్ హీరో వంటి పాత్రల నుంచి బయటపడాలని చెప్పాడు. చెత్త స్క్రిప్ట్స్ లతో మీ సమయం వృధా చేసుకోకండని చెప్పేశాడు. కథల ఎంపికలో మీరు మెగాస్టార్ అనిపించుకోలేదంటూ.. ఈ సినిమాకు 2 రేటింగ్ ఇచ్చాడు.