Chiranjeevi : అలయ్ బలయ్ కార్యక్రమం నేడు బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. తెలంగాణ సంస్కృతి, వారసత్వానికి అద్దం పట్టేలా ఈ కార్యక్రమాన్ని గత కొన్నేళ్లుగా దత్తాత్రేయ నిర్వహిస్తూ వస్తున్నారు. దసరా పండుగ అనంతరం ఆత్మీయులను కలుసుకునేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. ఇక ఏటా దీనికి ఆదరణ పెరుగుతోంది. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ నేతలు మాత్రం దూరంగా ఉన్నారు. గత ఏడాది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కానీ ఈ ఏడాది ఆ పార్టీ నుంచి ఏ ఒక్కరూ హాజరు కాలేదు.
ఇక ఈ కార్యక్రమంలో సినీ ఇండస్ట్రీ నుంచి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. ఇక అన్ని పార్టీల ప్రముఖ నేతలతో పాటు వివిధ రాష్ట్రాల గవర్నర్లు, గరికపాటి నరసింహారావు హాజరయ్యారు. ఇక్కడ జరిగిన కొన్ని సరదా సన్నివేశాలు బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా వేదికపై ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. గరికపాటి నరసింహారావు ప్రసంగం మెదలు పెట్టిన సమయంలో.. అభిమానులతా మెగాస్టార్ చుట్టూ చేరి సెల్ఫీలు తీసుకోవడం మొదలు పెట్టారు.
గరికపాటి ప్రసంగాన్ని వినేందుకు సైతం ఎవరూ ఆసక్తిని కనబరచకపోవడంతో ఆయన చిరు కోపాన్ని ప్రదర్శించారు. చిరంజీవి సెల్ఫీలు ఆపితేనే తాను ప్రసంగిస్తానని గరికపాటి నరసింహారావు మిన్నకుండిపోయారు. అంతేకాదు.. సెల్ఫీలు ఆపకుంటే.. ప్రసంగం ఆపేసి.. వెళ్ళిపోతానంటూ హెచ్చరికలు సైతం జారీ చేశారు. వెంటనే చిరంజీవి సెల్ఫీలు ఆపేసి వెళ్లి తన సీటులో కూర్చొన్నారు. ఇక అనంతరం మెగాస్టార్ మాట్లాడుతూ.. గరికపాటి వారి ప్రసంగాలంటే తనకు చాలా ఇష్టమని.. తాను రెగ్యులర్‌గా ఫాలో అవుతుంటానని వెల్లడించారు. ఇక మెగాస్టార్ ఈ కార్యక్రమంలో డప్పు కొట్టి అందరిలోనూ హుషారు నింపారు.