FIFA World Cup: ప్రపంచంలోనే అతి పెద్ద క్రీడా ఈవెంట్ ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఆదివారం నుంచి ప్రారంభం అవుతోంది. ఖతార్ వేదికగా ఈ మెగా టోర్నీ జరగనుంది. దోహాలోని అత్యాధునిక స్టేడియంలో ప్రారంభ మ్యాచ్ జరగనుంది. ఈ సందర్భంగా గ్రూప్-ఎలోని ఖతార్, ఈక్వెడార్ తలపడనున్నాయి. ఇప్పటివరకు ప్రపంచకప్‌లో ఆడేందుకు అర్హత సాధించని ఖతార్ ఆతిథ్య హోదాలో ఈసారి అవకాశం దక్కించుకుంది. సాకర్ ప్రపంచకప్‌లో మొత్తం 32 జట్లు తలపడనుండగా వీటిని 8 గ్రూపులుగా విభజింంచారు. ఒక్కో గ్రూప్‌లో నాలుగు జట్లు ఉంటాయి. ప్రతి జట్టు మిగతా మూడు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది.
అయితే గతంలో ఏ ప్రపంచకప్‌కు లేని వ్యతిరేకత, విమర్శలు ఖతార్‌లో జరుగుతున్న ఫుట్‌బాల్ ప్రపంచకప్ నిర్వహణ విషయంలో ఎదురవుతున్నాయి. వాతావరణ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని జూన్-జూలై నెలల్లో జరిగే టోర్నీని నవంబరు-డిసెంబరు నెలలకు వాయిదా వేయడంపై పలువురు విమర్శలు చేస్తున్నారు. మరోవైపు స్టేడియాల్లో బీర్ల అమ్మకాలపై నిషేధం విధించడం, వస్త్రధారణ విషయంలో ఆంక్షలు పెట్టడం ఫుట్‌బాల్ అభిమానుల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమవుతున్నాయి.
సాకర్ ప్రపంచకప్‌లో విజేతగా అందుకునే జట్టుకు రూ.344 కోట్లు అందనున్నాయి. రన్నరప్‌కు రూ.245 కోట్లు దక్కుతాయి. మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు వరుసగా రూ.220 కోట్లు, రూ.204 కోట్లు సొంతం చేసుకుంటాయి. ఇప్పటివరకు జరిగిన అన్ని ప్రపంచకప్‌లలో ఆడిన ఏకైక దేశంగా బ్రెజిల్ కొనసాగుతోంది. జర్మనీ 19 సార్లు ప్రపంచకప్ ఆడగా.. ఇటలీ 18 సార్లు, అర్జెంటీనా 17 సార్లు మెగా ఈవెంట్‌లో పాల్గొన్నాయి. అయితే పురుషుల ప్రపంచకప్ టోర్నీలో తొలిసారిగా మహిళలు రిఫరీలుగా మైదానాల్లో కనిపించనున్నారు.
FIFA World Cup: క్రిస్టియానో రొనాల్డో కల తీరేనా?
ఈ ప్రపంచకప్‌లో అయినా ఫుట్‌బాల్ స్టార్, పోర్చుగల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో కల నేరవేరుతుందా అని అతని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2003 నుంచి పోర్చుగల్ జాతీయ సీనియర్ జట్టుకు ఆడుతున్న రొనాల్డో తన కెరీర్‌లో ప్రొఫెషనల్ లీగ్స్‌లో ప్రీమియర్ లీగ్, లా లిగా, చాంపియన్స్ లీగ్, సెరియా లీగ్ వంటి అందుబాటులో ఉన్న అన్ని గొప్ప టైటిల్స్ సాధించాడు. కానీ ప్రపంచకప్ ఒక్కటే అతడిని అందని ద్రాక్షగా ఊరిస్తోంది. వరుసగా ఐదో ప్రపంచకప్‌లో ఆడుతున్న రొనాల్డో ఆఖరి ప్రయత్నంగా మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.