Etela Rajender: మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరింత దూకుడు పెంచుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం విమర్శల దాడి మరింత పెంచారు. కేసీఆర్ పై విరుచుకుపడుతూ విమర్శనస్త్రాలు సంధిస్తున్నారు. రాజకీయంగా మరింత స్పీడ్ పెంచిన ఈటల.. తాజాగా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిపై చేసిన వ్యాఖ్యలు తెలంగాణ పాలిటిక్స్ లో దుమారం రేపుతున్నాయి. పోచారం శ్రీనివాసరెడ్డి ప్రభుత్వం చెప్పినట్లు నిర్ణయాలు తీసుకుంటున్నారని, స్పీకర్ గా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం లేదని ఆరోపించారు. స్పీకర్ మరమనిషిలా మారిపోయారని విమర్శించారు. సీఎం కేసీఆర్ చెప్పినట్లు చేయడం తప్పితే స్పీకర్ పోచారానికి వేరే పనిలేదన్నారు. గతంలో ఒక్క ఎమ్మెల్యే ఉన్నా బీఏసీ మీటింగ్ కు పిలిచేవారని, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ తరపున ఒక్క ఎమ్మెల్యేను కూడా బీఏసీ సమావేశానికి ఆహ్వానించలేదని ఈటల చెప్పారు. సభా సంప్రదాయాలను తుంగలో తొక్కుతున్నారని ఆరోపించారు.
అయితే స్పీకర్ ను మరమనిషిలా అభివర్ణించడంపై టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఈటల వ్యాఖ్యలపై మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్ ను పట్టుకుని మరమనిషి అని కించపర్చడం సరికాదని హెచ్చరించారు. స్పీకర్ ను అవమానపరిచేలా ఈటల వ్యాఖ్యలు ఉన్నాయని, ఆయన క్షమాపణలు చెప్పాలని ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. స్పీకర్ కు ఈటల భేషరతుగా క్షమాపణలు చెప్పాలని, లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Etela Rajender:
ఈ కామెంట్స్ ను బూచిగా చూపి ఈటలపై అనర్హత వేటు వేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతుందనే ప్రచారం సాగుతోంది. అసెంబ్లీ నుంచి ముందు ఆయనను సస్పెండ్ చేసే అవకాశముందని అంటున్నారు. సస్పెండ్ చేసిన తర్వాత అనర్హత వేటు వేసే అవకాశాన్ని పరిశీలిస్తారనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఇప్పటికే ఈటలకు స్పీకర్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. నోటీసులకు వివరణ ఇవ్వాలని గడువు ఇచ్చినట్లు సమాచారం. ఒకవేళ ఈటలపై అనర్హత వేటు వేస్తే తెలంగాణలో రాజకీయ వేడి మరింత పెరిగే అవకాశముంది.