పార్టీలో మాళవిక వేదని అవమానిస్తుంది. దానికి బదులుగా వేద స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంది. ఆ మాటలకు మాళవిక దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. వేదని టార్గెట్ చేసుకుంటుంది. యశోదర్‌కి దగ్గర కావాలని ప్రయత్నిస్తుంది. దానికి తన ఫ్రెండ్ సాయం తీసుకుంటుంది. ఆ తర్వాత అక్టోబర్ 14 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
ఫోన్ మాట్లాడుతున్న యశోదర్ దగ్గరికి వెళ్తుంది మాళవిక. ‘అక్కడ అందరూ పార్టీ ఎంజాయ్ చేస్తుంటే నువ్ ఇక్కడ ఏం చేస్తున్నావ్’ అంటూ మాటలు కలుపుతుంది. నువ్ ఇచ్చిన ఇయర్ రింగ్స్ గుర్తుకు ఉన్నాయా.. ఈ రోజు ఆదికి స్పెషల్ డే అంటూ చెప్తుంది. ఆది పుట్టిన రోజు యశ్ భద్రపరిచిన స్టెమ్‌సెల్స్‌కు సంబంధించిన గతాన్ని గుర్తు చేస్తుంది. ప్రతి సంవత్సరం ఈ రోజును గుర్తు పెట్టుకునేవాడివి కానీ ఈ సంవత్సరం కొత్త పెళ్లాం మోజులో పడి కన్న కొడుకుని మరిచిపోయావ్ అని నిలదీస్తుంది మాళవిక మాజీ భర్తని. ‘మరిచిపోవడం నా తప్పే కానీ.. బాధ్యత అన్న పదం నీ నోటి నుంచి వింటే చండాలంగా’ ఉందంటూ అవమానిస్తాడు యశ్. ఆది మీద నీ ప్రేమ చచ్చిపోయిందా? అని నిలదీస్తుంది మాళవిక. ‘నువ్ ఎన్ని కుట్రలు చేసినా నేను ఆదిని మర్చిపోను. వాడు నా రక్తం’ అంటాడు యశ్. తప్పు ఒప్పుకోమని రాద్దాంతం చేస్తుంది మాళవిక. అంతేకాకుండా వేదని కూడా అనరాని మాటలు అంటుంది. ఖుషీ, ఆదిత్యలకు తండ్రిని చేసిన తల్లిని నేను. కానీ నన్ను మాత్రం పూజకు పనికిరాని పూవులా తీసి పారేస్తావు నువ్.. అంటూ ఎమోషనల్ అవుతుంది మాళవిక. నేను మాట్లాడిన ప్రతీ మాట నీకోసం కాదు ఆది కోసం అంటూ రెచ్చగొడుతుంది మాజీభర్తని. నేను చచ్చిపోయినా కూడా ఆది మీద ప్రేమ చచ్చిపోదని తేల్చి చెప్తాడు యశ్.
ఆదికి సంబంధించిన గుర్తుల్ని తలుచుకుంటాడు యశోదర్. ఆదికి తండ్రిని చేసిన తల్లిని నేను అన్నావ్ కదా.. కాదని అనగలనా? ఎస్ యూ ఆర్ ద మధర్ ఆఫ్ మై చిల్డ్రెన్స్.. అంటాడు మాజీ భార్యతో. దానికి చాలు యశ్.. ఈ మాత్రం చాలు అంటూ సంబరపడుతుంది మాళవిక. కానీ నాదొక చిన్న రిక్వెస్ట్.. ఇవి తీసేసుకో అంటూ చెవి కమ్మల్ని తీసి ఇస్తుంది. నా మీద ప్రేమ ఉన్నపుడు ఇచ్చావ్ కదా ఇపుడు నీ కొత్త భార్యకు ఇవ్వు అంటుంది. అదెలా మాళవిక.. ఆ రోజు నేనెలా మర్చిపోగలను.. ఆది పుట్టినపుడు నీకు బహుమతిగా ఇచ్చానని గుర్తు చేసుకుంటాడు. ఇది ఆదికి సంబంధించిన తీపి గుర్తు.. నీ దగ్గరే ఉంచుకో. ప్లీజ్ పెట్టుకో మాళవిక అంటూ బతిలాడుతాడు యశ్. అంతటితో ఆగకుండా అవి తీసి మాళవిక చెవులకు పెడతాడు. ఇదంతా దూరం నుంచి చూసి బాధపడుతుంది వేద. ఆదికి సంబంధించిన ఆస్పత్రి బిల్ నేను చూసుకుంటా. ఫైనల్‌గా నీకు ఒకటి చెప్పాలి మాళవిక.. ‘బహుశా నేను లైఫ్‌లో మళ్లీ తండ్రిని కాలేను. ఈ జన్మకు నేను ఇద్దరి పిల్లలకే తండ్రిని’ అని చెప్పి వెళ్లిపోతాడు.
శభాష్ మాళవిక.. యశోదర్ నోటి నుంచి ఏ మాటలైతే వినకూడదనుకున్నానో అవే మాటలు వినిపించేలా చేశాను. ఈ మాటలతో నువ్ క్షణ క్షణం కుమిలి కుమిలి ఏడవాలి అనుకుంటుంది వేదని ఉద్ధేశించి. ఆ తర్వాత వేదని వెతుకుతూ వెళ్తాడు యశ్. ఒంటరిగా కూర్చుని దిగులుపడుతుంది వేద. భర్త మాటల్ని తలుకుని కుమిలిపోతుంది. ‘నేనక్కడ పార్టీలో నీకోసం వెతుకుతుంటే నువ్ ఇక్కడ కూర్చున్నావా’ అంటాడు భార్యతో. అసలు రాకుండానే ఉండాల్సింది.. మీపాత ఫ్రెండ్స్ మధ్యలోకి కొత్త భార్యని నేనెందుకు అంటుంది బాధగా. ఇపుడు అర్థమైంది నేను మాళవికతో మాట్లాడింది విన్నావా? అంటాడు యశ్. గతాన్ని అంత గట్టిగా గుర్తుంచుకున్నపుడు నన్ను పెళ్లిచేసుకోవడం ఎందుకు? అని ప్రశ్నిస్తుంది. అమ్మ అయ్యే రాత దేవుడు నా నుదిటిన రాయలేడు. అది ఓపెన్ సీక్రెట్. అది మీకు తెలుసు అందరికీ తెలుసు. నన్ను అందరూ తిట్టే మాటేంటో తెలుసా.. గొడ్రాలు అని భర్తతో చెప్పుకుంటూ కంటతడి పెడుతుంది వేద. మరి వేదని భర్త ఏవిధంగా ఓదారుస్తాడో తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..