నిన్నటి ఎపిసోడ్‌లో వసంత్ యశోధర్‌ని నిలదీస్తాడు. ఎందుకిలా చేస్తున్నావని, వదినకు అన్యాయం చేయొద్దని వేడుకుంటాడు. మరోపక్క చిత్ర కూడా వేదని ప్రశ్నిస్తుంది. ఆ తర్వాత సీన్‌లో సులోచన వేద భవిష్యత్తు గురించి బాధపడుతుంది. తల్లికి ధైర్యం చెబుతుంది వేద. ఆ తర్వాత నవంబర్ 25 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
మాళిని పూజ చేసిన తర్వాత వేదకు హారతిస్తుంది. ఆ దేవుడి దయ వల్ల నీకంతా మంచే జరగాలని కోరుకుంటుంది. ఏ ఆడదానికి రాకూడని సమస్య వచ్చింది. తప్పు ఎవరు చేసిన తప్పే.. నేరస్థులకు న్యాయ స్థానంలో శిక్ష పడి తీరాలి. దానికి మీ సపోర్ట్ కావాలి అంటుంది వేద అత్తతో. మా ఇద్దరి సపోర్ట్ నీకే వేద అని మాళిని ధైర్యం చెబుతుంది. అపుడే యశోధర్ కూడా వచ్చి నా జీవితంలో చాలా కీలకమైన రోజు. నన్ను ఆశీర్వదించమ్మా అంటూ మాళినిని అడుగుతాడు. దాంతో భగవంతుడా ఏంటి నాకు ఈ పరీక్ష అని మాళిని మదనపడుతుంది. యుద్ధానికి వెళ్లే ప్రతి సైనికుడిని తల్లి ఆశీర్వదించి పంపుతుంది. కొడుకు, కోడలు మనకు ఇద్దరూ సమానమే. న్యాయం ఎవరివైపు ఉంటే వాళ్లే గెలుస్తారంటూ భార్యని ప్రోత్సాహిస్తాడు రత్నం. మీరిద్దరూ కలిసి మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించండని అడుగుతుంది వేద. న్యాయం, ధర్మం గెలవాలంటూ దీవిస్తారు మాళిని, రత్నం.
సీన్ కట్ చేస్తే.. యశోధర్‌కు దారిలో సులోచన అడ్డుపడుతుంది. నన్ను క్షమించడండి అత్తయ్య అని మననసులో అనుకుంటాడు యశ్. నన్ను దీవించండంటూ సులోచనతో. ఆ తర్వాత అందరూ కలిసి కోర్టుకు బయల్దేరతారు. ఆ తర్వాత సీన్‌లో కోపంలో ఉన్న అభిని కైలాష్ వచ్చి రెచ్చగొడతాడు. మాళవిక మీద అభికి కోపం పెరిగేలా చేస్తాడు. దాంతో ఆ యశోధర్ ఈ రోజు కోర్టులో కశ్చితంగా ఓడిపోతాడు. నువ్ జైలుకు వెళ్తావ్ అంటాడు అభి మాళవికని ఉద్దేశించి.
మీరందరూ ఎక్కడికి వెళ్తున్నారని యశ్ చిత్రని అడగ్గా.. మాళిని మేం కూడా కోర్టుకు వెళ్తున్నాం అంటుంది. తన కారులో రమ్మని అడగ్గా క్యాబ్‌లో వస్తాం అంటూ బదులిస్తుంది మాళిని. ఆఫీస్ టైంలో క్యాబ్స్ అన్నీ బిజీగా ఉంటాయంటుంది వేద. మనం విడిగా వెళ్లినా వెళ్లాల్సిన చోటు ఒకటే కదా.. పదండి కారులో వెళ్దాం అంటుంది సులోచన. సరేనంటూ అందరూ కారు ఎక్కుతారు. సులోచన, మాళినిల మాటల యుద్ధం తట్టుకోలేక చిత్ర యశ్‌ని పాటలు పెట్టమంటుంది. అలా అందరూ చివరకు కోర్టుకు చేరుకుంటారు.
అందరూ వెళ్లిన తర్వాత వేద ఫోన్ మరిచిపోవడంతో మళ్లీ కారు దగ్గరికి వస్తుంది. అపుడే యశ్ కూడా వచ్చి సీట్లో ఇరుక్కుపోయన చీర కొంగును తీస్తాడు. ఆ తర్వాత యశ్‌ని ‘కోర్టులో ఏమైనా జరగచ్చు. దానివల్ల మన మధ్య దూరం పెరగకూడదు. గొడవలు జరిగితే ఖుషి తట్టుకోలేదు. నాకు మాటివ్వండి’ అడుగుతుంది. మనిద్దరి మధ్య మూడో మనిషికి చోటు ఉండదని యశ్ చేతులో చేయి వేస్తుండగానే మాళవిక యశ్ అంటూ వస్తుంది. దాంతో చేయి మాటివ్వకుండా ఆగిపోతాడు. మరి కోర్టులో ఏం జరుగుతుందో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే..