వేద లంచ్ బాక్స్ తీసుకుని యశోధర్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంటుంది. ఆ తర్వాత వేద తిరిగి వెళ్తుండగా అదే లిఫ్ట్‌లో మాళవిక కూడా ఉంటుంది. తప్పు చేసిన వారికి శిక్ష పడేలా చేస్తానని వేద శపథం చేస్తుంది. ఆ తర్వాత వసంత్ వేదని ఓదారుస్తాడు. ఈ రోజు నవంబర్ 24 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
వసంత్ యశోధర్ దగ్గరికి వెళ్లి నీ పనులు, నువ్వూ ఇవేవి నచ్చట్లేదని అంటాడు. దేవత లాంటి వదినని బాధపెడుతున్నావని కోప్పడతాడు. అక్కడ చిత్రకు వేద సారీ చెబుతుంది. బావ ఎందుకు ఇలా మారాడని ప్రశ్నిస్తుంది చిత్ర. అలా ఆఫీసులో యశోధర్‌ని వసంత్… ఇక్కడ ఇంట్లో వేదని చిత్రలు నిలదీస్తారు. కారణం ఏంటో చెప్పు యశ్ అంటూ గుచ్చి గుచ్చి అడుగుతాడు వసంత్. నేను చెప్పలేను నా నోరు నొక్కేసుకున్నా అంటాడు యశ్. అక్కడ బావని ఎందుకు ప్రశ్నించవని చిత్ర వేదని నిలదీస్తుంది. అలా భార్యాభర్తలిద్దరూ ఒకే సమాధానం చెప్తారు.
సీన్ కట్ చేస్తే.. సులోచన టెన్షన్‌గా ఉంటుంది. వేద ఏమైందమ్మా అని అడగ్గా.. ఈ కేసు ఫైల్ చేయడం అవసరమా అంటుంది సులోచన. జరిగిపోయిందేదో జరిగిపోయింది. నా వల్ల నీ జీవితంలో పెద్ద సమస్య వచ్చి పడిందంటూ బాధపడుతుంది. అల్లుడుగారు, మీమధ్య మంచి బంధం ఏర్పడిందనుకుంటే ఇప్పుడే ఇలా జరిగింది. మీ మధ్య నేనే దూరాన్ని పెంచానని బాధపడుతుంది సులోచన. అలా కూతురి పరిస్థితి తలుచుకుంటూ కుమిలిపోతుంది సులోచన. నా భర్త కళ్లల్లో చాలా ప్రేమ ఉందమ్మా.. కానీ ఆ ప్రేమ నాకోసం కాదమ్మా.. మాళవిక కోసం అంటూ బాధపడుతుంది వేద. ప్రేమ దొరకాలంటే అదృష్టం ఉండాలంటూ ఎమోషనల్ అవుతుంది వేద. ఆక్సిడెంట్ చేసింది వేరే వాళ్లైతే వదిలేస్తామా చెప్పమ్మా అంటుంది వేద. నా బలం నువ్వేనమ్మా.. నన్ను భయపెట్టొద్దమ్మా.. అంటుంది తల్లితో. నేను గెలుపు గడప చేరుకునే దాకా నా చేయి వదలొద్దమ్మా అంటూ ఎమోషనల్ అవుతుంది వేద.
ఆ తర్వాత సీన్‌లో యశ్ ఆఫీసు నుంచి ఇంటి వచ్చి వేద దగ్గరికి వెళ్తాడు. భార్యతో మాట్లాడనుకుంటాడు కానీ మాట్లాడకుంటా వెళ్లిపోతాడు. డైనింగ్ టేబుల్ మీద తినడానికి ఏం లేకపోవడంతో నీళ్లు తాగి సోఫాలో పడుకుంటాడు యశ్. నాన్నా అంటూ ఖుషి అన్నం తీసుకువచ్చి తినిపిస్తుంది. కూతుర్ని చూసి గర్వంగా ఫీల్ అవుతాడు యశ్. తన ముద్దు ముద్దు మాటలకు ఉప్పొంగిపోతాడు. ఆనందంతో కళ్ల వెంట నీళ్లు వస్తాయి యశోధర్‌కు. అమ్మ నాకు తిన్న తర్వాత ఇలాగే దిష్టి తీస్తుందంటూ యశ్‌కు ఖుషి దిష్టి తీస్తుంది. నువ్ నా కూతురివి కాదమ్మా.. బంగారు తల్లివంటూ ముద్దాడుతాడు యశ్. ఆ తర్వాత ఖుషి జరిగిందంతా వచ్చి వేదకు చెప్తుంది. నాన్నకు నా చేత ఎందుకు అన్నం ఎందుకు పెట్టించావ్? నాన్న మీద నువ్ అలిగావ్ కదా.. అందుకే అదోలా ఉన్నారు. మా నాన్నని బాధపెట్టొదమ్మా.. గుడ్ నైట్ అని చెప్పి వెళ్లిపోతుంది ఖుషి.
మరుసటి రోజు ఉదయం మాళిని భగవంతుడికి దండం పెట్టుకుంటుంది. కొడుకు, కోడలు.. ఇద్దరిలో ఎవరు గెలవాలని కోరుకోవాలి? న్యాయం నా కోడలు వైపు ఉంది. యశ్ ఎందుకు ఈ తప్పు చేస్తున్నాడు? నా కోడల్ని దీవించు స్వామీ అంటూ వేడుకుంటుంది. వేదకు హారతిచ్చి.. నీకంతా మంచే జరుగుతుందని ఆశీర్వదిస్తుంది మాళిని. అపుడే యశ్ వచ్చి ఈ రోజు నా జీవితంలో చాలా కీలకమైన రోజు. నన్ను ఆశీర్వదించమ్మా అంటూ మాళినిని అడుగుతాడు. మరి కోర్టులో ఎవరు గెలుస్తారో తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..