అభిమన్యు వేదని తీసుకుని యశ్ మాళవికలు ఉన్న హోటల్ గదికి వెళ్తాడు. ఆక్సిడెంట్ చేసింది మాళవిక అంటున్న అభి మాటలకు చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పమని వేద భర్తని నిలదీస్తుంది. కానీ యశోధర్ అదే నిజమని చెప్పకనే చెప్తాడు. దాంతో భర్త చేసిన అన్యాయానికి కుమిలి కుమిలి ఏడుస్తూ ఇంటికి వెళ్లిపోతుంది వేద. ఆ తర్వాత నవంబర్ 16 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
ఏడుస్తూ ఖుషిని తీసుకుని ఇంటికి వెళ్తుంది వేద. దాంతో గదిలో ఒంటరిగా మిగిలిపోతాడు యశ్. జరిగింది తలచుకుని కుమిలిపోతాడు. వేదకు అన్యాయం చేశానని బాధపడతాడు. ఆ తర్వాత సులోచన కుటుంబమంతా వేదకోసం ఎదురుచూస్తూ కంగారు పడతారు. చిత్ర ఎన్ని సార్లు ఫోన్ చేసినా కనెక్ట్ అవదు. ఈ తల్లి గుండె కొట్టుకునేదే నా బిడ్డ కోసం. నాకు ఆక్సిడెంట్ జరిగి నేను చచ్చిపోతే నా బిడ్డ ఎలా బతుకుతుందోని ఎంత కంగారు పడ్డానో తెలుసా అని భర్తతో చెప్పుకుంటూ విలవిలలాడిపోతుంది. వేద జాతకం ప్రకారం దాని జీవితంలో కొన్ని సమస్యలున్నాయని గుర్తు చేసుకుంటుంది. భార్యని ఓదారుస్తాడు వరదరాజులు. యశోధర్ మాటల్ని తలుచుకుంటూ కుమిలిపోతుంది వేద.
సీన్ కట్ చేస్తే.. మాళిని వేద, ఖుషిల కోసం ఎదురు చూస్తుంటుంది. అంతలోనే వేద ఏడుస్తూ వస్తుంది. ఏంటమ్మా ఒక్కదానివే వచ్చావ్? యశ్ ఏడి అని ప్రశ్నల వర్షం కురిపిస్తుంది మాళిని. ఏం చెప్పకుండా వెక్కి వెక్కి ఏడుస్తుంది వేద. కోడల్ని బుజ్జగించి మరీ అడుగుతుంది మాళిని. అత్తయ్య గారూ మీ అబ్బాయి నా దగ్గర నిజం దాచాడు అంటూ ఏడుస్తుంది. నేనిపుడు ఏం చెప్పలేను అత్తయ్యా అంటూ లోపలికి వెళ్లిపోతుంది వేద. ఏం జరిగిందోనని బాధపడుతుంది మాళిని.
ఆ తర్వాత సీన్‌లో కైలాష్‌కు కాంచన ఫోన్ చేస్తుంది. ఇంట్లో జరిగిందంతా భర్తకు చెబుతుంది. ఆ వేదకు అలానే కావాలి అంటాడు కైలాష్. వేద, యశ్‌ల మధ్య గొడవలు చూసి సంబరపడిపోతాడు కైలాష్. ఆ తర్వాత యశోధర్ పీకలదాకా తాగి ఇంటికి వస్తాడు. లైఫ్‌లో ఫెయిలై పోయానంటూ సెక్యూరిటితో చెప్పుకుంటూ బాధపడతాడు. ఇంట్లోకి రాకుండా అక్కడే తప్పతాగి తూలిపోతాడు. నా ఫ్యామిలీని కాపాడిన వేదకు ద్రోహం చేశానంటూ మదనపడతాడు. అలా చాలాసేపు బయటే ఉండి అరుస్తాడు యశోధర్. నా జీవితాన్ని నేనే నాశనం చేసుకున్నానంటాడు.
అపుడే సులోచన, మాళినిల కుటుంబసభ్యులు మేడమీది నుంచి యశోధర్‌ని చూస్తారు. యశోధర్ గొంతు విని తీసుకురావడానికి వెళ్తుంది వేద. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం..