Election Commission : 2023 లో జరగనున్న మొదటి విడత అసెంబ్లీ ఎన్నికకు నగారా మోగింది. నాగాలాండ్, మేఘాలయ , త్రిపుర అసెంబ్లీల ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించింది. త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు 2023 ఫిబ్రవరి 16న జరగనుండగా, నాగాలాండ్, మేఘాలయలకు ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనున్నాయి. పరీక్షల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల తేదీలను నిర్ణయించినట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఈ మూడు రాష్ట్రాల షెడ్యూల్‌ను ప్రకటించిన ఈ ఏడాది తొలి ప్రెస్‌మీట్‌లో సీఈసీ ప్రసంగిస్తూ, ఈ మూడు రాష్ట్రాల్లోనూ ఓటింగ్ ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుందని అన్నారు.

త్రిపురలో జనవరి 21వ తేదీన గెజిట్ నోటిఫికేషన్ ను విడుదల చేస్తారు. నామినేషన్ల దాఖలుకు జనవరి 30 చివరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థుల ఉపసంహరణకు ఫిబ్రవరి 2 చివరి తేదీ. మేఘాలయ, నాగాలాండ్‌లో జనవరి 31 న గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలుకు ఫిబ్రవరి 7 తేదీ వరకు సమయం ఉంటుంది.

నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అసెంబ్లీల పదవీకాలం వరుసగా మార్చి 12, 15, 25 తేదీల్లో ముగియనుంది. మూడు రాష్ట్రాల్లో మొత్తం 9,125 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. 73 శాతం పోలింగ్ స్టేషన్లలో వెబ్‌కాస్టింగ్ ఉండనుంది. 376 పోలింగ్ కేంద్రాలను మహిళలే నిర్వహించనున్నారు.
ఎన్నికల సంఘం అన్ని పోలింగ్ బూత్‌లలో విద్యుత్ , తాగునీరుతో సహా 100శాతం అన్నిరకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తుంది కాబట్టి, తాత్కాలిక మౌలిక సదుపాయాలను సృష్టించవద్దని ఈసీ ఈసారి రాష్ట్ర ప్రభుత్వాలను అభ్యర్థించిందని రాజీవ్ కుమార్ తెలిపారు. మగవారికి, ఆడవారికి వేర్వేరు మరుగుదొడ్లు, విద్యుత్ సదుపాయ, వికలాంగులకు ర్యాంప్ తదనుగుణంగా బడ్జెట్లు మంజూరు చేస్తున్నట్లు ఈసీ తెలిపింది.