Delhi Liquor scam : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దూకుడు పెంచింది. శుక్రవారం ఉదయం నుంచి హైదరాబాద్‌లోని ఆరు చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.ప్రముఖ షాపింగ్ మాల్స్‌కు సంబంధించిన కార్యాలయాలు,ఇళ్లలో సోదాలు చేపట్టారు. ఆర్ఎస్ బ్రదర్స్ ఇటీవలి కాలంలో రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అడుగు పెట్టింది. హానర్స్ రియల్ ఇన్ఫ్రా పేరిట రియల్ ఎస్టేట్ సంబంధిత కార్యకలాపాలను నిర్వహిస్తోంది.ఇక హానర్స్ సంస్థ విషయానికి వస్తే.. వాసవితో పాటు పలు ప్రాజెక్టులను చేపట్టింది.కూకట్‌పల్లిలోని గల్ఫ్ ఆయిల్ ల్యాండ్ వివాదాల్లో కూడా హానర్స్ జోక్యం చేసుకుంది.
హానర్స్, సుమధుర, వాసవిల పరంపర ఆర్ఎస్ బ్రదర్స్‌పై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.ఆర్ఎస్ బ్రదర్స్ నిర్వహిస్తున్న వ్యాపార కార్యకలాపాల్లో సుమధుర, వాసవి సైతం భాగస్వాములుగా ఉన్నాయి. ఇదిలా ఉండగా.. నాలుగు రోజుల క్రితం ఈ కేసులో భాగంగా..రాబిన్ డిస్టలరీస్ ఎండీ బోయినపల్లి అభిషేక్ రావును సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఢిల్లీ తరలించారు.అంతకు ముందు విజయ్ నాయర్, సమీర్ మహేంద్రులను సీబీఐ అరెస్ట్ చేసింది.నేడు హైదరాబాద్‌లో సోదాలు నిర్వహిస్తుండటంతో తెలంగాణలో ప్రకంపనలు పుట్టిస్తోంది.
అయితే అభిషేక్‌రావును సీబీఐ కస్టడీకి కోరుతోంది. దీంతో మూడు రోజుల కస్టడీకి కోర్టు సైతం అనుమతి ఇచ్చింది. అయితే ఢిల్లీ లిక్కర్ స్కాం గురించి పూర్తిగా తెలుసుకునేందుకు మరో రెండు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరింది. అభిషేక్‌రావు ఖాతాల్లో డబ్బు వచ్చిన విషయాన్ని సీబీఐ అధికారులు గుర్తించారు. రూ.3.85 కోట్ల రూపాయలు అభిషేక్ రావు ఖాతాలోకి రావడంపై సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు.లిక్కర్ స్కాంలో అభిషేక్ రావుదే కీలక పాత్రగా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతని రిమాండ్ రిపోర్ట్‌లో సీబీఐ చాలా విషయాలను ప్రస్తావించింది.