Earthquake: ప్రకృతితో, పంచభూతాలతో ఎప్పుడు కూడా ఆటలు ఆడకూడదు అని అప్పుడప్పుడు కొన్ని ప్రకృతి విపత్తులు మానవ సమాజానికి పరిచయం చేస్తూనే ఉంటాయి. అయినా కూడా ప్రకృతి విద్వంసం చేస్తూనే ఉంటాం. భూమిని తవ్వేస్తూ అందులో ఖనిజ సంపదని దోచేస్తూ ఉంటాం. పంచభూతాలలో ప్రతి దానిని మన అవసరాల కోసం వాడేస్తూ ఉంటాం. అందుకే మానవ విద్వంసానికి ప్రకృతి కూడా అప్పుడప్పుడు సమాధానం చెబుతుంది. భూకంపాలు, సునామీలతో మానవ సమాజంపై దాడి చేస్తుంది. ఈ ప్రకృతి విపత్తుని తట్టుకొని నిలబడటం మానవ మాత్రులకి సాధ్యం కాదు. అందుకే లక్షలాది మంది ప్రకృతి ప్రకోపానికి బలైపోతూ ఉంటారు. తాజాగా టర్కీ, సిరియా దేశాలలో ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏకదాటిగా మూడు భూకంపాలు సంభవించాయి.

అసలు ప్రజలు తేరుకునే అవకాశం కూడా ఇవ్వకుండా ఒకదాని తర్వాత ఒకటిగా దాడి చేశాయి. 12 గంటల వ్యవధిలోనే మూడు భూకంపాలు సంభవించడం విశేషం. వేకువ జామున 7.8 తీవ్రతతో తొలి భూకంపం సంభవించింది. దాని నుంచి తేరుకునేలోపే మళ్ళీ మధ్యాహ్నం 7.5 తీవ్రతతో రెండో భూకంపం సంభవించింది. ఇక ఈ రెండు భూకంపాలతో చాలా భవనాలు నేలమట్టం అయ్యాయి. దీంతో ఎంతమంది చనిపోయి ఉంటారు అనేది గుర్తించి సహాయక చర్యలు చేస్తూ ఉండగానే సాయంత్రం మరల 6.0 తీవ్రతతో మూడో భూకంపం వచ్చింది. ఈ భూకంప కేంద్రం సెంట్రల్ టర్కీలో ఉన్నట్టు గుర్తించారు.
ఇక ఈ భూకంపాలు ధాటికి టర్కీ, సిరియా దేశాలు అతలాకుతలం అయ్యాయి. వేలాది భవనాలు నేలమట్టం అయ్యాయి. సహాయక చర్యలు మొదలు పెట్టారు. భరత్ నుంచి కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలని కేంద్ర ప్రభుత్వం పంపించింది. అలాగే అగ్ర దేశాలు కూడా సహాయక చర్యలకి బృందాలని పంపించినట్లు తెలుస్తుంది. శిథిలాల క్రింద వేలాది మంది చిక్కుకొని ఉంటారని భావిస్తున్నారు. ఇప్పటి వరకు మృతుల సంఖ్య 2300 వరకు ఉంది. వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇలా లక్షలాది మంది నిరాశ్రయులు అయినట్లు తెలుస్తుంది. అలాగే వేలాది మంది క్షతగాత్రులుగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే సహాయక చర్యలు చేపడుతున్న మళ్ళీ భూకంపం వస్తుందేమో అని భయపడుతున్నారు.