భారతదేశంలో ఎక్కువగా వారసత్వంపై చర్చ జరుగుతూ ఉంటుంది. రాజకీయాలు వారసత్వంగా నడుస్తూ ఉంటాయి. ఒకరు ఎమ్మెల్యే అయ్యారంటే తరువాత అతని కొడుకు, అతని మనవడు ఇలా తరతరాలు ఆ రాజకీయ వారసత్వంతో అర్హత లేకపోయిన నాయకులుగా చెలామణి అవుతూ ప్రజలపై పెత్తనం చలాయిస్తూ ఉంటారు. వారసత్వం అనేది కొంత మందికి బలంగా మారుతుంది. మరికొంత మంది బలహీనతగా మారుతుంది. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ తర్వాత కేటీఆర్ రూపంలో బలమైన వారసత్వ నాయకుడు దొరికాడు. ఏపీలో టీడీపీకి చంద్రబాబు స్థాయిలో లోకేష్ నాయకుడిగా గుర్తింపు పొందలేకపోతున్నాడు. వైఎస్ఆర్ వారసుడుగా జగన్ ప్రజల మెప్పుని మళ్ళీ పొందాడు. అలాగే కాంగ్రెస్ పార్టీ అయితే దశాబ్దాలుగా వారసత్వ రాజకీయాలు, రాజకీయ నాయకులతోనే నడుస్తుంది.
సొంత బలంతో ఎదగాలని అనుకునే వారికి అక్కడ స్థానం ఉండదు. ఇక సినిమా రంగంలో కూడా వారసత్వం మెయిన్ ఫ్యాక్టర్ గా ఉంటుంది. వారసత్వంతో వచ్చే హీరో, హీరోయిన్స్ కి ఎక్కువ అవకాశాలు వస్తాయి. చాలా వేగంగా స్టార్ ఫేమ్ వచ్చేస్తుంది. సొంత టాలెంట్ తో ఎదిగేవారు స్టార్ ఇమేజ్ ని తెచ్చుకోవడానికి చాలా కష్టపడాలి. ఇక వ్యాపార రంగంలో కూడా వారసత్వమే నడుస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఒక్క స్పోర్ట్స్ లో మాత్రమే ఇండియాలో వారసత్వం పెద్దగా వర్క్ అవుట్ కాదని చాలా మంది లైఫ్ ప్రూవ్ చేసింది. ఇండియన్ క్రికెట్ లో లెజెండ్రీ ఆటగాళ్ళుగా గుర్తింపు తెచ్చుకున్న క్రికెటర్స్ కొడుకులు ఎవరూ కూడా తండ్రుల స్థాయిలో రాణించలేకపోయారు.
తండ్రి వారసత్వంతో అవకాశాలు వచ్చిన వాటిని వినియోగించుకోవడంలో మాత్రం వారు విఫలం అయ్యారు క్రికెట్ లో మాత్రమే టాలెంట్ ఉన్నవారు స్టార్స్ గా గుర్తింపు తెచ్చుకుంటారు. సచిన్ టెండూల్కర్ తన టాలెంట్ తో మాస్టర్ బ్లాస్టర్ అనిపించుకుంటే అతని కొడుకు అర్జున్ టెండూల్కర్ మాత్రం దేశవాళీలో అరంగేట్రం చేయడానికి 23 ఏళ్ళు పట్టింది. సచిన్ 16 ఏళ్ళకే ఇండియాకి ప్రాతినిధ్యం వహించి అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడారు. అలాగే వెటరన్ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా లెజెండరీ ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అతని కొడుకు రోహన్ గవాస్కర్ తండ్రి ఇమేజ్ తో అవకాశాలు అందుకున్న వాటిని నిలుపుకోలేకపోయాడు.
వీరు మాత్రమే కాకుండా ఇండియన్ క్రికెట్ లో చాలా మంది తండ్రి మార్గంలోనే క్రికెట్ ని కెరియర్ గా ఎంచుకున్న కనీసం దేశవాళీ మ్యాచ్ లలో కూడా రాణించలేకపోయారు. ఇక అంతర్జాతీయ క్రికెట్ లోకి భారత్ తరుపున ప్రాతినిధ్యం వహించిన వారంటే వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. ఓ విధంగా చెప్పాలంటే ఇండియాలో వారసత్వం అస్సలు పని చేయని రంగం ఏదైనా ఉందంటే అది క్రీడలలో మాత్రమే అని చెప్పాలి. ఇక్కడ కూడా లాబీయింగ్ ఉంటుంది కాని ప్రతిభకి కూడా అంతే స్థాయిలో అవకాశం లభిస్తుంది. ఐపీఎల్ వచ్చిన తర్వాత ప్రతిభ కొలమానంగా జట్టులోకి చాలా మంది ఆటగాళ్ళు ఎంపిక అవుతున్నారు.