Diwali: పిల్లలు, పెద్దలు.. దీపావళి పండగంటే ఇష్టపడని వారు ఉంటారా? టపాసులు, అలంకరణలు, వెలుగుల దీపాలు, కొనుగోళ్లు, పూజలు, బహుమతులు, స్వీట్లు, ఫలహారాలు… ఇలా భారతీయ సంస్కృతిలో దీపావళి పండుగది ప్రత్యేకమైన స్థానం. భారతీయులంతా సమైక్యంగా ఈ పండుగను ఆనందోత్సాహాల నడుమ జరుపుకుంటారు. దీపాలతో చీకట్లను పారదోలి కొత్త వెలుగులను తీసుకొచ్చే ఆనందాల పండుగగా దీన్ని జరుపుకుంటాం.
పురాణాల్లో దీపావళి గురించి అనేక కథలు ఉన్నాయి. లంకలోని రావణుడిని సంహరించి సీతమ్మను రక్షించి శ్రీరామచంద్రుడు అయోధ్యకు సతీసమేతంగా చేరుకుంటాడు. ఈ క్రమంలో జరుపుకొనే పండుగే దీపావళిగా రామాయణ గ్రంధం చెబుతోంది. ఇలా చెడుపై మంచి సాధించిన విజయంగా దీపావళి జరుపుకుంటాం. దీప ధూప, నైవేద్యాలతో భక్తి శ్రద్ధలతో పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
గృహాన్ని అందంగా అలంకరించుకొని, ఇంటిల్లిపాదీ కొత్త బట్టలు కట్టుకొని, పిండి వంటలు ఘుమఘుమలాడుతుండగా, బాణాసంచా చప్పుళ్లతో, ధగధగ మెరిసే దీపాలతో దీపావళి పర్వదినాన్ని జరుపుకుంటాం. ఈ పండుగ ఏటా ఆశ్వయుజ మాసం అమావాస్య నాడు వస్తుంది. ఈ పండగ ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్థశి. దీన్ని నరక చతుర్ధశి అని కూడాపిలుస్తారు.
Diwali: రామాయణం, మహాభారతం, భాగవతంలో కథలు..
ఈ పండుగనాడు మహాలక్ష్మి పూజ గురించి కూడా పురాణ కథ ఉంది. అలాగే, ద్వాపర యుగంలో కూడా కృష్ణుడు, సత్యభామ కలిసి నరకాసురుణ్ని వధిస్తారు. దీనికి నరక చతుర్ధశిగా పేరుంది. నరకాసురుని పీడ విరగడైందన్న ఆనందంలో జరుపుకొనే పండుగగా దీపావళికి పేరుంది. ఇలా రామాయణం, మహాభారతం, భాగవతం.. మూడూ చదివి తెలుసుకున్న వారికి ఆ కథలు తెలుస్తాయి. మొదటి కథ రామాయణంలో రావణుడి వధగా చెబుతారు. రెండోది నరకాసుర వధ. ఇక మూడో కథ పాలసముద్రం నుంచి శ్రీమహాలక్ష్మీదేవి ఉద్భవించిన వృత్తాంతాన్ని చెబుతారు. మహాభారతంలో కౌరవులు సాగించిన మాయాజూదంలో 14 సంవత్సరాల అరణ్యవాసం చేసి తిరిగి వచ్చిన పాండవులకు ప్రజలు కాగడాలతో స్వాగతం పలుకుతారు. దీన్ని నాలుగో ఇతివృత్తంగా చెబుతారు. ఇక ఐదో వృత్తాంతం.. గ్రామీణ ప్రాంతాల్లో పంటచేతికొచ్చే సమయంలో అన్నదాతలు దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఇలా.. దీపావళి పండుగ గురించి అనేక ఇతి వృత్తాలు ఉన్నాయి.