Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్‌రాజు పేరు ఇటీవలి కాలంలో మార్మోగుతోంది. రెండు దశాబ్దాలుగా స్టార్ ప్రొడ్యూసర్‌గా వెలుగొందుతున్నారు దిల్ రాజు. సక్సెస్‌ఫుల్ సినిమాలు తీస్తూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. ఓవైపు నిర్మాతగానే కాకుండా డిస్ట్రిబ్యూటర్‌గానూ కొనసాగుతున్నారు. అయితే దిల్ రాజు పేరు ప్రస్తుతం అటు మెయిన్ స్ట్రీమ్ మీడియా, ఇటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పేరు వినిపిస్తోంది.
సంక్రాంతి పండుగకు అటు మెగాస్టార్ చిరంజీవి, ఇటు నటరత్న నందమూరి బాలకృష్ణ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్యలోకి ‘వారసుడు’ వచ్చి చేరడంతో అసలు రచ్చ ప్రారంభమైంది. వారసుడు సినిమాకు దిల్ రాజే ప్రొడ్యూసర్ కావడంతో ఆయన చిరు, బాలయ్యల సినిమాలకు థియేటర్లు దొరక్కుండా చేస్తున్నారనేది ప్రధాన అభియోగం. అయితే సంక్రాంతి పండగ సందర్భంగా డైరెక్ట్ తెలుగు సినిమాలకే ముందుగా ప్రాధాన్యత ఇవ్వాలని ఇటీవల తెలుగు నిర్మాతల మండలి నిర్ణయించిన నేపథ్యంలో దిల్ రాజు బాగా హైలైట్ అవుతున్నారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన షూటింగ్, క్యారవాన్ కల్చర్‌పై సెన్సేషన్ కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీలో క్యారవాన్ కల్చర్ వచ్చాక బాగా సమయం వృథా అవుతోందని ఆయన పేర్కొన్నారు. ఏదైనా షూటింగ్‌లో ఒక పాట లేదంటే సీన్ రెడీ అయ్యిందంటే.. ముందుగా హీరో, హీరోయిన్లను అసిస్టెంట్లను పిలవాల్సి వస్తోందన్నారు. వాళ్లు వెళ్లి క్యారవాన్‌లో ఉన్న యాక్టర్లు వచ్చేసరికి పావుగంట అవుతుందని.. ఆ తర్వాత షూటింగ్ ఏరియా క్లియర్ చేయడానికి మరికాస్త టైం పడుతుందన్నారు. హీరో, హీరోయిన్లు క్యారవాన్ కల్చర్‌తో క్రమశిక్షణ అనేది లేకుండా పోయిందని దిల్ రాజు పేర్కొన్నారు.