Dhoni Dance: టీమిండియాకు విజయవంతమైన కెప్టెన్‌లలో మహేంద్రసింగ్ ధోనీ ఒకడు. తన కూల్ కెప్టెన్సీతో టీమిండియాకు రెండు ప్రపంచకప్‌లను అందించాడు. ప్రతి ఫార్మాట్‌లోనూ టీమిండియాను అగ్రస్థానంలో నిలిపాడు. అయితే ధోనీ తాజాగా తనలోని కొత్త టాలెంట్ బయటకు తీశాడు. మైదానంలో ఎప్పుడూ కామ్‌గా కనిపించే ధోనీ మాస్ స్టెప్పులతో డ్యాన్స్ వేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్‌లతో కలిసి ధోనీ వేసిన డ్యాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
దుబాయ్‌లో తన బంధువు బర్త్ డే పార్టీకి ధోనీ హాజరయ్యాడు. ఈ వేడుకకు ధోనీతో పాటు అతడి భార్య సాక్షి, టీమిండియా తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్యా, అతడి సోదరుడు కృనాల్ పాండ్యా, యువ క్రికెటర్ ఇషాన్ కిషాన్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా హార్దిక్ పాండ్యాతో కలిసి ధోనీ డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశాడు. ర్యాపర్ బాద్‌షాతో కలిసి గొంతు కలిపిన ధోనీ.. అతడి పాటలకు స్టెప్పులు కూడా వేయడం అభిమానులను ఆకట్టుకుంది.
బాద్ షా ధోనీకి పెద్ద అభిమాని. దీంతో కాసేపు డీజేగానూ వ్యవహరించి ధోనీ ఎంజాయ్ చేశాడు. ధోనీ భార్య సాక్షి ఈ వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఈ వీడియోలను చూసి ధోనీ అభిమానులు మురిసిపోతున్నారు. ప్రశాంతంగా ఉండే ధోనీ ఇలా స్టెప్పులు వేయడం ఎప్పుడూ చూడలేదని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ధోనీ ప్రస్తుతం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు.
https://www.youtube.com/watch?v=ni6keiQXAWo
వచ్చే ఏడాది ఐపీఎల్‌తో రిటైర్మెంట్
టీమిండియాతో పాటు ఐపీఎల్ లాంటి మెగా టీ20లీగ్‌లోనూ ధోనీ తనదైన ముద్ర వేశాడు. 2008లో ఐపీఎల్ ప్రారంభం కాగా అప్పటి నుంచి చెన్నై సూపర్‌కింగ్స్ ఫ్రాంచైజీకి ధోనీ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. 2022 సీజన్‌లో కొన్ని మ్యాచ్‌లకు మాత్రం జడేజా నాయకత్వం వహించగా అతడు విఫలం కావడంతో ఫ్రాంచైజీ యాజమాన్యం మళ్లీ పగ్గాలను ధోనీకే అందించింది. అయితే 2023లో జరిగే సీజన్‌తో ధోనీ ఐపీఎల్‌కు కూడా వీడ్కోలు పలకనున్నట్లు ప్రచారం జరుగుతోంది.