ఒక కోటీశ్వరుడి కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోవడం. అతని ఆస్తిపై ప్రత్యర్ధులు కన్నువేయడం. దానిని కాపాడేందుకు అతని కొడుకు స్థానంలో హీరో వెళ్లడం. వారి ఆస్తిని, గౌరవాన్ని తిరిగి కాపాడే ప్రయత్నం చేయడం. ఈ పాయింట్ వింటే తెలుగులో ఎప్పుడో రౌడీ అల్లుడు, వారసుడు, దొంగ మొగుడు అలాగే చాలా సినిమాలు గుర్తుకొచ్చి ఉంటాయి కదా. ఇప్పుడు అదే కథని ప్రెజెంట్ బ్యాక్ డ్రాప్ లోకి తీసుకెళ్లి విశ్వక్ సేన్ ధమ్కీ సినిమాని చేసినట్లు మూవీ ట్రైలర్ చూస్తూ ఉంటే కనిపిస్తుంది. అలాగే హోటల్ లో వెయిటర్ గా పనిచేసిన వాడు నేను రిచ్ కిడ్ అంటూ అమ్మాయికి పరిచయం చేసుకొని ఆమెని ప్రేమలో పడేయడం. ఈ పాయింట్ కూడా చాలా సినిమాలలో వచ్చినట్లు కనిపిస్తుంది కదా.
ఇదే ఎలిమెంట్ కూడా ధమ్కీ ట్రైలర్ లో కనిపిస్తుంది. ఈ రెండు ఎలిమెంట్స్ ని మిక్స్ చేసి విశ్వక్ సేన్ హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా ధమ్కీ మూవీని తెరకెక్కించాడు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ని బాలకృష్ణ గ్రాండ్ గా రిలీజ్ చేశాడు. ఇక ఈ ట్రైలర్ చూస్తూ ఉంటే టాలీవుడ్ లో అందరికి తెలిసిన పాత కథలు రెండింటిని కలిపేసి కొత్త ట్రీట్మెంట్ తో అది కూడా పాన్ ఇండియా లెవల్ లో చెప్పాలని విశ్వక్ సేన్ ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తుంది.
విశ్వక్ లుక్ పరంగా చూసుకుంటే ఒక పబ్ లో వెయిటర్ గా, అలాగే కోటీశ్వరుడి ఇంటికి కొడుకు స్థానంలోకి వెళ్లిన వ్యక్తి డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలలో కనిపిస్తున్నాడు. అయితే ఒక్కసారి కోటీశ్వరుడు అయ్యాక అతనిలో హీరోయిజం కంటే విలనిజం పెరిగినట్లు ట్రైలర్ గా చూపించే ప్రయత్నం చేశాడు. అలాగే మదర్ సెంటిమెంట్ ని బాగానే వర్క్ చేసినట్లు కనిపిస్తుంది. అలాగే చనిపోయిన వ్యక్తి ఆత్మ పాత్ర కూడా సినిమాలో అంతర్లీనంగా ఉండబోతుందని కొన్ని ఎలిమెంట్స్ లో రివీల్ చేశారు. ఓవరాల్ గా కామెడీ, ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా ధమ్కీ మూవీని విశ్వక్ సేన్ ఆవిష్కరించినట్లు ట్రైలర్ బట్టి అర్ధమవుతుంది. మరి ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో అతనికి ఏ మేరకు సక్సెస్ ఇస్తుందనేది చూడాలి.