Devorce Party : పెళ్లికి పార్టీ ఇవ్వడం సర్వసాధారణం.. విడాకులు తీసుకున్నందుకు గ్రాండ్‌గా పార్టీ చేసుకోవడమే వింత. రకరకాల ఈవెంట్స్‌తో ఎంజాయ్ చేయడం మరో విశేషం. వీరంతా విడాకుల ద్వారా వచ్చిన స్వేచ్ఛను ఎంజాయ్ చేసేందుకే ఈ పార్టీ అట. మధ్యప్రదేశ్‌లోని భోపాల్లో ఓ ఎన్జీవో సంస్థ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కనీవినీ ఎరగని రీతిలో విడాకులు తీసుకున్నందుకు వేడుక నిర్వహిస్తోంది. భార్యా బాధితులైన మగవాళ్ల తరుఫున నిలిచి వారికి విడాకులు ఇప్పిస్తోంది భాయ్ వెల్ఫేర్ సొసైటీ. అలా ఇప్పటి వరకూ ఈ సంస్థ కృషి కారణంగా 18 మంది మగవాళ్లకు విడాకులు వచ్చాయి.
ఇక వారందరికీ విడాకులు రావడమే తరువాయి.. సదరు సంస్థ గ్రాండ్‌గా వేడుక నిర్వహిస్తోంది. దీనికోసం “విడాకుల ఆహ్వానం” అనే పేరుతో ఓ ఇన్విటేషన్ కూడా ప్రింట్ చేయించింది. ఈ విడాకుల వేడుక సెప్టెంబర్ 18న జరగనుంది. ఈ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లూ చేస్తోంది. ఈ వేడుకలో రకరకాలైన కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసింది. వాటికి సంబంధించిన విశేషాలను సైతం ఆహ్వాన పత్రికలో ప్రింట్ చేయించింది. అందులో ముఖ్యంగా జయమాల విసర్జన్ (వివాహ మాల నిమజ్జనం), మగవాళ్ల సంగీతం, సామాజిక సేవ కోసం ప్రతిజ్ఞలు, మనస్సాక్షిని శుభ్రపరిచే పవిత్రమైన అగ్ని ఆచారం వంటి ఈవెంట్స్ ఉన్నాయి. ఈ సందర్భంగా విడాకులు తీసుకున్న మగవాళ్లు స్వేచ్ఛను ఎంజాయ్ చేయనున్నారని భాయ్ వెల్ఫేర్ సొసైటీ పేర్కొంది.
Devorce Party : ఆత్మ గౌరవంతో ముందుకు వెళ్లేందుకు ఈ వేడుక ఒక మార్గం
“గత రెండున్నరేళ్లలో 18 మంది మగవాళ్లు తమ జీవితాన్ని దుర్భరం చేసిన వివాహం నుంచి విముక్తి పొందారు. మేము హెల్ప్‌లైన్ ద్వారా అలాంటి వారు మానసికంగా స్థిరంగా ఉండేందుకు చేయూతనిస్తాం.” అని ఆర్గనైజింగ్ కమిటీ సభ్యుడు జకీ అహ్మద్ తెలిపారు. విడాకులు తీసుకున్న ఈ మగవాళ్లు తమ కొత్త జీవితాలను సానుకూల మనస్తత్వంతో, మరింత ఆత్మ గౌరవంతో ముందుకు వెళ్లేందుకు ఈ వేడుక ఒక మార్గమని ఆ సంస్థ చెబుతోంది. 18 మందిలో కొందరు ఏళ్ల తరబడి విడాకుల కోసం పోరాడాల్సి వచ్చిందని సంస్థ ప్రతినిధులు తెలియజేశారు. ఈ నేపథ్యంలో వారి విడాకులను సెలబ్రేట్ చేయాలనే ఉద్దేశంతో.. కొద్దిమందితో దీనిని ప్లాన్ చేశారు. మొత్తానికి పెళ్లికి మించి విడాకుల పార్టీ ఉండబోతోందని తెలుస్తోంది. అయితే ఈ వివాహ ఆహ్వాన పత్రిక ఓ రేంజ్‌లో వైరల్ అయ్యింది. దీంతో ఈవెంట్‌ను గ్రాండ్‌గా జరిపేందుకు నిర్ణయించారు.