ఆదిత్య క్యాంపుకు వెళ్లలేదని తెలిసి సత్య గొడవపడుతుంది. దేవుడమ్మ కొడుకు, కోడల్ని కలపాలనుకుంటుంది. మరోవైపు జానకిని తీసుకుని ఇంటికి వెళ్తారు రాధ, రామ్మూర్తిలు. ఇంట్లో నుంచి వెళ్లిపోమని రాధకు సైగ చేస్తుంది జానకి. కానీ నిన్ను ఇట్ల విడిచిపెట్టిపోయేది లేదంటుంది రాధ. అది విని సంబరపడిపోతాడు మాధవ్. ఆ తర్వాత అక్టోబర్ 8 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
ఒంటరిగా ఉన్న జానకి దగ్గరికి వచ్చి ‘ఏంటమ్మా.. రాధని ఇంటి నుంచి పంపించేయాలనుకుంటున్నావా. నా బాధ చూసి తల్లి మనసు కరగాలి కానీ ఇబ్బంది పెట్టకూడదు’ అంటాడు. అంతలోనే రామ్మూర్తి రావడంతో ఆపేస్తాడు మాధవ్. గుడికి వెళ్లొస్తానంటూ పిల్లల్ని తీసుకుని వస్తుంది రాధ. జానకమ్మ పేరు మీద అర్చన చేయిస్తానని చెప్తుంది. డబ్బులు హుండీలో వేసి పూజ జరిపించమని ఇస్తాడు రామ్మూర్తి. మాధవ్‌ని కూడా గుడికి వెళ్లమంటాడు కానీ అమ్మని వదిలి వెళ్లనంటాడు నటిస్తూ. పిల్లలు రా నాయన పోదాం అనడంతో వెళ్తాడు మాధవ్ కూడా.
సీన్ కట్ చేస్తే.. ఆదిత్య కుటుంబమంతా గుడికి వెళ్తారు. విజయదశమి సందర్భంగా అమ్మవారి గుడి చుట్టు పొర్లుదండాలు పెడితే ఏది కోరుకున్నా తీరుతుందట ఆదిత్య.. అని చెప్తుంది కొడుకుతో. తర్వాత చేసుకోవచ్చులే అక్క అని రాజమ్మ అనగా.. వాయిదా వేయకూడదని అంటుంది దేవుడమ్మ. నేను పిల్లపాపలతో మిమ్మల్ని చూడాలనుకుంటున్నా. నా మనసులోని బాధను పొర్లాడి పొర్లాడి ఆ అమ్మవారితో చెప్పుకుంటాను అంటూ ఎమోషనల్ అవుతుంది. మీరు వెళ్లి పూజ మొదలుపెట్టండి నేను వస్తానంటుంది. నేను అక్కకు తోడుగా ఉంటా మీరెళ్లండి అంటుంది రాజమ్మ. ఆ తర్వాత దేవుడమ్మ దేవుడికి మొక్కుకుని పొర్లదండాలు పెడుతుంది. ‘ఈ వయసులో మీ అమ్మకు ఆ కష్టం అవసరమా. మీరు కలిసిమెలిసి ఉండాలని అలా చేస్తుంది. మీ అమ్మ మనసు అర్థం చేసుకోండి’ అంటాడు ఆదిత్యతో తండ్రి.
ఆ తర్వాత సీన్‌లో మొక్కు చెల్లించుకుని వస్తుంది దేవుడమ్మ. సత్య చేతుల మీదుగా ముత్తైదులకు చీరలు పంచమని చెబుతుంది. అత్త చెప్పినట్టే సత్య చీరలు పంచి పెడుతుంది. మరోవైపు రాధ, మాధవ్‌లు పిల్లలతో కలిసి గుడిలోకి అడుగుపెడతారు. దేవి ‘అదిగో ఆఫీసర్ సారూ’ అంటుంది. వాళ్లని చూసి రాధ షాకవుతుంది. చిన్మయి, దేవిలు వాళ్లదగ్గరికి వెళ్తారు. ఆఫీసర్ సారూ అంటూ కౌగిలించుకుంటారు. రాధ మాత్రం ఎవరికీ కనిపించకుండా పక్కకు వెళ్లిపోతుంది. మాధవ్ కూడా వెళ్లి దేవుడమ్మని కలుస్తాడు. ఆదిత్య మాత్రం రుక్మిణి ఎక్కడుందో.. సత్య చూస్తే తనతో గొడవపడుతుందనుకుంటూ టెన్షన్ పడతాడు. మీ అమ్మగారికి ఎలా ఉందంటూ పరామర్శిస్తుంది దేవుడమ్మ. ‘అవ్వా.. నువ్ ఎప్పుడూ మా అమ్మని చూడలేదు కదా.. మాతో పాటు గుడికి వచ్చింది చూపిస్తా’ అంటూ వెళ్తుంది దేవి. కోపంలో ఉన్న సత్య రాధని చూస్తే రచ్చ రచ్చే అని సంబరపడతాడు మాధవ్. ఓ వైపు సత్యేమో అక్క రుక్కు కోసం వెతుకుతుంది. మరోవైపు ఆదిత్య కూడా రుక్కుని వెతుకుతాడు. ఆదిత్యని చూసి సత్య.. నిన్న జరిగింది అక్కకి చెప్పి నా కంట పడకుండా చేస్తాడా. అలా జరగడానికి వీల్లేదు.. అని మనసులో అనుకుంటుంది.
తప్పించుకుని తిరుగుతున్న రాధని.. అక్కా అంటూ పిలుస్తుంది. సత్యా.. అని ప్రేమగా పిలుస్తుంది రాధ. అవసరం లేదంటూ అరుస్తుంది సత్య. ‘ఇంకా మన మధ్య ఈ ముసుగు అవసరం లేదు. నాకోసం నువ్ పట్టీ పట్టీ తెలుగు మాట్లాడాల్సిన అవసరం లేదు. నువ్ రాధ కాదు మా అక్క రుక్మిణివని నాకు తెలుసు. అక్కవేనని తెలిసినా కొత్తగా నువ్ బతుకుతున్న బతుకు బాగుండాలని కోరుకున్నా. ఆ రోజు ఆదిత్యకు నాకు మధ్య సమస్య ఇలా ఉందంటే నాకు అండగా ఉన్నావని భరోసా ఇచ్చావ్ ఇదేనా..’ అంటుంది. ఇంకా నన్ను మోసం చేయకు అంటుంది. నేను మోసం చేయడమా? అని రాధ అనుమానం వ్యక్తం చేయగా.. మాధవ్ పంపిన ఫొటోని చూపిస్తుంది సత్య. అది చూసి షాకవుతుంది రుక్మిణి. మరి రాధ నిర్ణయం ఏంటో తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..