జానకిని తీసుకుని రామ్మూర్తి కుటుంబమంతా చికిత్సాలయానికి వెళ్తారు. అక్కడ కూడా మాధవ్ తల్లికి నయం కాకుండా అడ్డు పడతాడు. నర్సుకు డబ్బులు ఇచ్చి తను చెప్పినట్టు చేయమంటాడు మాధవ్. మరోవైపు సత్య గురించి ఆలోచిస్తూ బాధపడుతుంది రాధ. అక్కడ సత్యేమో అక్క అంతు తేల్చుకునేందుకు సిద్ధమవుతుంది. జానకితో మాధవ్ మాట్లాడిన మాటలన్నీ చాటుగా వింటుంది రాధ. ఆ తర్వాత అక్టోబర్ 6 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
మీరెప్పుడూ ఇలాగే ఆనందంగా ఉండాలని అంటాడు ఆదిత్య పిల్లలతో. అవ్వకు నయం అయ్యేదాకా నువ్వు ఇక్కడే ఉండు సారూ అంటుంది దేవి. అలాగేనమ్మా.. మీతో ఉంటే నాకూ సంతోషంగా ఉంటుంది అంటాడు. నేను పెద్దయ్యాక డాక్టర్‌ని అయి మా అవ్వని సక్కగ చేస్తా అంటూ తమాషా చేస్తుంది దేవి. ఇన్ని రోజులు ఆఫీసర్ అవుతానన్నావ్ కదా.. ఇపుడు డాక్టర్ అంటావేంటి అని చిన్మయి ఆదిత్యలు అడుగుతారు. అవ్వని అట్ల చూస్తే డాక్టర్ కావాలనిపిస్తుంది అని చెప్తుంది దేవి. దాంతో లక్ష్యాన్ని ఎప్పుడూ మార్చుకోకూడదు అని హితబోధ చేస్తాడు ఆదిత్య కూతురికి. మరోవైపు మాధవ్ మాటల్ని తలుచుకుంటూ బాధపడుతుంది రాధ. వాడు ఇట్ల పాగల్ గాని లెక్క చేస్తే కావాలని ఆ తల్లిని ఏమైన చేస్తడు అంటూ బాధపడుతుంది. ముందుగాల వాడికి సాయం చేసేటోళ్ల సంగతి చూడాలి అనుకుంటది రాధ.
మాధవ్‌కు ఆదిత్య వల్ల ఎలాంటి అపాయం కలుగుతుందోనని టెన్షన్ పడుతుంది రాధ. ఏదో ఒకటి చెప్పి పెనిమిటిని ఇక్కడి నుంచి పంపిచాలనుకుంటుంది. పిల్లలతో ఆడుకుంటున్న ఆదిత్య దగ్గరికి వెళ్లి విషయం చెప్పాలనుకుంటుంది రాధ. అక్కడ మాధవేమో సత్యకు లొకేషన్ పంపించి మరీ పిలిపిస్తాడు. ఆదిత్య గురించి సత్యకు చెడు అభిప్రాయం కలిగేలా చేస్తాడు. సత్యా.. ఒక్కసారి వచ్చి నీ కళ్లతో నువే చూడు అంటూ రాధ, ఆదిత్యని చూపిస్తాడు మాధవ్. అక్కడ రుక్మిణి ఆదిత్యతో నువ్ ఇక్కడి నుంచి వెళ్లిపో అని చెప్తుంది. నిన్ను వదిలేసి ఎలా వెళ్లాలి అంటాడు ఆదిత్య. వాళ్లిద్దర్నీ అలా చూసిన సత్య ఏడుస్తూ వెనక్కి తిరిగి వెళ్లిపోతుంది. అక్కడ రుక్మిణి మాత్రం ఆదిత్యతో నిజం చెప్పలేక ఆందోళన పడుతుంది. చివరకు రుక్మిణి మాట ప్రకారం వెళ్లిపోతానని అంటాడు ఆదిత్య. ఇదంతా చూసి హ్యాపీగా ఫీలవుతాడు మాధవ్.
ఆ తర్వాత సీన్‌లో రాధ.. నర్సు చెంప పగలగొడుతుంది. నువ్ పడే కథలు నాకు తెలుసు. ఆ అమ్మ ప్రాణం తీయాలని చూస్తే.. నా పెనిమిటి సీదా తీసుకుపోయి జైళ్ల కూర్చోబెడతాడు అని బెదిరిస్తుంది. దాంతో ఆ నర్సు పొరపాటయిందని.. క్షమించమని వేడుకుంటుంది రాధని. అపుడే అక్కడికి వచ్చిన డాక్టర్లకు కూడా అసలు నిజం చెప్తుంది రాధ. ‘మా చికిత్సాలయం పరువు తీయడానికి ప్రయత్నించిన ఈ నర్సుని పనిలో నుంచి తీసేస్తాం’ అని చెప్తుంది. వద్దంటూ ఆపి.. మా జానకమ్మకు నయం కావాలని వార్నింగ్ ఇస్తుంది. మరోవైపు నర్సుని కలిసి అడుగుతాడు మాధవ్. చెప్పినట్టే చేస్తానని అంటుంది ఆ అమ్మాయి. పని పూర్తయ్యాక నీకు ఊహించనంత డబ్బు ఇస్తానని ఆశ పెడతాడు మాధవ్.
సీన్ కట్ చేస్తే.. సత్య ఆదిత్య గురించి తలుచుకుంటూ మదనపడుతుంది. రాజమ్మ వచ్చి భోజనం చేయమంటుంది. అంతలోనే ఆదిత్య బ్యాగ్ తీసుకుని ఇంటికి వస్తాడు. క్యాంప్ ఎలా జరిగిందని సత్య అడగ్గా.. చాలా బాగా జరిగిందంటూ లోపలికి వెళ్తాడు ఆదిత్య. డల్‌గా కూర్చున్న ఆదిత్యని రిలాక్స్ అయి రమ్మంటుంది సత్య. పదే పదే క్యాంపు అంటూ ఆదిత్యని ఎగతాళి చేస్తుంది. దాంతో ఆదిత్యకు కోపం వచ్చి సత్య మీద అరుస్తాడు. నువ్ వెళ్లింది క్యాంపుకే కదా ఎందుకు అంత చిరాకు అంటూ అసలు నిజం చెప్పాలనుకుంటుంది సత్య. మాధవ్ పంపిన ఫొటోని ఆదిత్యకు చూపిస్తుంది. మరి ఆదిత్య రియాక్షన్ ఏంటో తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..