సత్య, ఆదిత్యలను బయటికి పంపాలనుకున్న దేవుడమ్మకు నిరాశే ఎదురవుతుంది. రెండు రోజులు క్యాంపు ఉందంటూ ఆదిత్య బ్యాగ్ సర్దుకుని బయల్దేరుతాడు. ఆదిత్య విషయంలో తన అక్క రాధ అంతు తేల్చేందుకు ఇంటికి వెళ్తుంది సత్య. మరోవైపు జానకిని అందరూ కలిసి ప్రకృతి చికిత్సాలయానికి తీసుకెళ్తారు. ఆ తర్వాత అక్టోబర్ 5 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
ఒంటరిగా ఉన్న రాధ బాధకు కారణం ఏంటని అడుగుతాడు ఆదిత్య. నేను సత్య గురించి సోచాయిస్తున్న. నువ్ ఇక్కడికి వచ్చావని తెలిస్తే ఊకుంటదా? అమ్మని నేను చూసుకుంటా నువ్ ఇంటికి వెళ్లు పెనిమిటి అంటుంది రాధ. దేవి గురించి నేను పడుతున్న బాధ నీకు కూడా అర్థం కావట్లేదా రుక్మిణి? అంటాడు ఆదిత్య. బిడ్డ గురించి నువ్ ఆలోచించకు. నేను సత్యవ్వ గురించి ఆలోచిస్తున్నా. బిడ్డని నేను పంపిస్తా.. అని మాటిస్తుంది రాధ. ఆ మాటలు విన్న మాధవ్.. నిన్ను ఎక్కడ కొట్టాలో నాకు ఇప్పుడు తెలిసింది ఆదిత్య అనుకుంటాడు మనసులో. ఆ తర్వాత సీన్‌లో సత్య.. తన అక్క రాధ ఎక్కడికి వెళ్లిందోనని ఆలోచిస్తుంది. ఫోన్ చేద్దామని అనుకుంటుంది కానీ మళ్లీ ఆగిపోతుంది. మాధవ్‌కి చేద్దామనుకునేలోపే తనే సత్యకు మెసేజ్ పెడతాడు. ఆ ఫొటో చూసి సత్య షాకవుతుంది. అంటే ఆదిత్య నాకు అబద్ధం చెప్పాడా. అక్కతో కలిసి వెళ్లాడా. ఇదే నా ఇంపార్టెంట్ వర్క్ అనుకుంటూ ఏడుస్తుంది.
సీన్ కట్ చేస్తే.. మాధవ్ నర్స్‌ని పక్కకి పిలిచి రహస్యంగా మాట్లాడతాడు. ‘ఇంకో మనిషికి తెలియకుండా నువ్ నాకు హెల్ప్ చేయాలి’ అంటాడు. నేను చెప్పినట్టే మా అమ్మకు వైద్యం చేయాలని చెప్పి డబ్బు చూపిస్తాడు. ఆవిడ అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పకుండా నర్సుని లొంగదీసుకుంటాడు మాధవ్. తను చెప్పింది చేయమని ఆదేశిస్తాడు. జానకికి చికిత్సలో భాగంగా చెట్ల మందులు తాగిస్తారు. భయపడుతున్న జానకితో ‘ఎందుకు భయపడుతున్నారు. మీకేం కాదు’ అంటాడు ఆదిత్య. ఇలా అయినప్పటినుంచి జానకి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుందని రామ్మూర్తి అంటాడు. మిమ్మల్ని అలా చూసి అందరూ బాధపడుతున్నారని.. త్వరగా మీకు నయమవుతుందని ధైర్యం చెబుతాడు ఆదిత్య. మాధవ వైపు చూపిస్తూ ఏదో చెప్పే ప్రయత్నం చేస్తుంది కానీ అది అర్థం కాదు అందరికీ. ‘అమ్మా ఎందుకు భయం. నీకు నేనున్నా. అందరికంటే ఎక్కువ ప్రేమించే రాధ ఉంది. నీకోసం ఆఫీసర్ ఉన్నాడు’ అంటూ తల్లితో మాట్లాడతాడు మాధవ్. పిల్లలు కూడా జానకికి మేం ఉన్నాం అంటూ ధైర్యాన్నిస్తారు.
తర్వాత సీన్‌లో మాధవకు సత్య ఫోన్ వస్తుంది. కానీ లిఫ్ట్ చేయడు. మరోవైపు జానకి రాధని, మాధవని తలుచుకుంటూ బాధపడుతుంది. నా కడుపున పుట్టిన వాడే నన్ను ఇలా చేస్తే.. చేరదీసిన రాధ నాకోసం ఇలా అయిపోయింది. రాదని ఎలాగైనా కాపాడాలి అనుకుంటుండగానే మాధవ్ వెళ్తాడు జానకి దగ్గరికి. జానకికి మంచి నీళ్లు ఇవ్వడానికి రాధ కూడా వస్తుంది అపుడే. ‘నీ సైగలకు అర్థం ఏంటో నాకు తెలుసు. కానీ మిగతా వాళ్లకి అర్థం కాదు కదా. నా గురించి అందరికీ చెప్పేయాలని ఉందా. నువ్ అలా మాట్లాడితే నా పరిస్థితి ఏంటమ్మా. నిన్ను చూసుకోవడానికి రాధ ఇక్కడే ఉంటుంది. నిన్ను ఇలా వదిలి రాధ వెళ్లలేదు. నాకు కావాల్సింది అదే కదా. అందుకే నువ్ మామూలు మనిషివి కావడానికి చిన్న అవకాశం కూడా నీకు ఇవ్వను. నాకు కావాల్సింది రాధ ఇల్లు వదిలి వెళ్లకపోవడం. నిన్ను ఇలా బాధపెడుతున్నందుకు నన్ను క్షమించమ్మా. తప్పని తెలిసిన తప్పట్లేదు. రాధ కోసం నువ్ మామూలు మనిషి కాకూడదు’ అంటూ భయపెడతాడు మాధవ్ తల్లిని. నువ్ ఎప్పటికీ ఇలానే ఉండాలి. మందుల్ని మార్చేశా. ఆ మందుల వల్ల నీకు జరగరానిది ఏదైనా జరిగినా ఆ నేరం ఆదిత్య మీదకు వెళ్లిపోతుంది’ అంటాడు. అది విన్న రాధ గ్లాసును కిందపడేస్తుంది. రాధ రావడం గమనించిన మాధవ్ సత్యకు ఫోన్ చేసి లొకేషన్ పంపించి రమ్మంటాడు. మరి రాధ మాధవ్‌పై ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..