జానకిని ప్రకృతి వైద్యశాలకు తీసుకెళ్లే విషయం గురించి ఆదిత్య రామ్మూర్తితో మాట్లాడతాడు. దానికి మాధవ్ కూడా ఒప్పుకుంటాడు కానీ ఆదిత్యని ఏదో విధంగా దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తాడు. మరోవైపు సత్య పాండిచ్చేరికి వెళ్లేందుకు అంతా ప్లాన్ చేసుకుంటుంది కానీ ఆదిత్య మాత్రం అందుకు ఒప్పుకోడు. దాంతో దేవుడమ్మ కూడా కొడుకుని కోప్పడుతుంది. ఆ తర్వాత అక్టోబర్ 4 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
సత్యతో బయటికి వెళ్లనని చెప్పడంతో దేవుడమ్మ కొడుకుకు క్లాస్ పీకుతుంది. అమ్మా.. నా పరిస్థితి అర్థం చేసుకోండి అంటాడు ఆదిత్య. నేనేం సత్యని బాధపెట్టట్లేదు.. తర్వాత వెళ్తాం అంటాడు. ఆఫీస్‌కి లీవ్ పెట్టి వెళ్లమని ఎంత చెప్పినా ఆదిత్య తల్లి మాట అసలు వినడు. పైగా తనని ఇబ్బందిపెట్టొద్దని తేల్చి చెప్తాడు. దాంతో సత్య కంటతడి పెడుతుంది. దేవుడమ్మకు ఏం చేయాలో తోచదు. మరోవైపు అర్ధరాత్రి మాధవ్.. జానకి బెడ్ వద్ద కూర్చుని దొంగలా చూస్తాడు. ‘నా మీద లేని ప్రేమ రాధ మీద ఏంటమ్మా.. రాధని నేను కూడా ఇష్టపడుతున్నా కదమ్మా. నా ప్రేమను అర్థం చేసుకుని సపోర్ట్ చేయకుండా నాన్నకు చెప్తానంటూ వెళ్లావ్. కదలడానికి కాళ్లు, మాట్లాడడానికి నోరు లేకుండా చేశాను. నీకు తగ్గితే వాడికేంటి తగ్గకపోతే వాడికేంటి’ అంటూ ఆదిత్య మీద అరుస్తాడు. నాకు ఓపిక నశిస్తే ఏం చేస్తానో తెలియదు. రేపు మనతో పాటు ప్రకృతి చికిత్సాలయానికి వస్తాడు కదా అపుడు చెప్తానంటూ బెదిరిస్తాడు జానకిని.
మరుసటి రోజు ఉదయం దేవుడమ్మకు కాఫీ ఇస్తుంది సత్య. ఆదిత్య లేచాడా అని అడగ్గా.. తెలియదంటుంది సత్య. నీ బాధ నాకు అర్థం అవుతుంది. వాడు పట్టించుకోవట్లేదని నువ్ కూడా పట్టించుకోకపోతే ఎలా అంటూ ప్రశ్నిస్తుంది అత్త. అంతలోనే ఆదిత్య బ్యాగ్ సర్దుకుని వస్తాడు. అదేంటిరా అని అడగ్గా.. క్యాంపు ఉందంటూ చెప్తాడు. అమ్మా.. అసలు నిజానికి నేను వెళ్తుంది.. అని చెప్పబోయి ఆగుతాడు. అసలు నిజం చెప్తే సత్య ఒప్పుకోదని విషయం దాచిపెడతాడు. బాయ్ చెప్పి అక్కడినుంచి బయలుదేరుతాడు ఆదిత్య. సత్య బాధపడుతూ లోపలికి వెళ్తుంది. దేవుడమ్మ మాత్రం ఆలోచనలో పడిపోతుంది.
సీన్ కట్ చేస్తే.. మాధవ్ కుటుంబమంతా చికిత్సాలయానికి వెళ్లేందుకు సిద్ధమవుతారు. అంతలోనే ఆఫీసర్ వెళ్తాడు అక్కడికి. జానకికి ధైర్యం చెబుతాడు ఆదిత్య. మీరు చెప్పిన చోట జానకి త్వరగా కోలుకుంటుందనే నమ్మకం నాకుంది అంటాడు రామ్మూర్తి. అందరూ కలిసి బయల్దేరతారు. పిల్లలు మనం ఆఫీసర్ కారులో వెళ్దాం అంటారు ఉత్సాహంగా. దాంతో మాధవ్ ఒళ్లు మండిపోతుంది. కానీ రామ్మూర్తి పర్మిషన్ ఇచ్చాక రాధ, పిల్లలు.. ఆఫీసర్‌తో కలిసి వెళ్తారు. ‘ఈ రోజు అక్కతో విషయం ఏంటో నేరుగా మాట్లాడతా’ అంటూ రాధ దగ్గరికి బయల్దేరుతుంది సత్య. ‘నువ్ ఎవరో తెలిసి కూడా ఇన్ని రోజులు విషయం బయటపెట్టలేదు. దేవిని ఆదిత్య దగ్గరికి ఎందుకు పదే పదే పంపుతున్నావ్. ఆదిత్య క్యాంపు నుంచి వచ్చేలోగా మళ్లీ నిన్ను కలవకుండా చేసుకుంటా’ అంటూ మాధవ్ ఇంటికి వెళ్తుంది సత్య. కానీ తాళం వేసి ఉండడం చూసి షాకవుతుంది.
జానకిని తీసుకుని అందరూ ప్రకృతి చికిత్సాలయానికి చేరుకుంటారు. ఎలా జరిగిందని అడగ్గా విషయం చెప్తుంది రాధ డాక్టర్‌తో. ఒక నాలుగు రోజులు ఇక్కడే ఉంచితే రిజల్ట్ కచ్చితంగా కనిపిస్తుందని హామీ ఇస్తుంది డాక్టర్. నయం అవుతుందంటే పది రోజులైనా ఉంటామంటుంది రాధ. ‘ఇంతకుముందు ఒక డాక్టర్ కూడా ఇలాగే చెప్పారు’ అంటాడు మాధవ్. ఇంతకంటే ప్రమాదంలో ఉన్న వాళ్లకు కూడా మేం నయం చేశాం.. త్వరలో ఈమెలో మార్పు వస్తుందని చెప్తుంది డాక్టర్. ఆ మాటలకు మాధవలో టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఒంటరిగా ఆలోచిస్తున్న రుక్మిణి దగ్గరికి వెళ్లి ఆదిత్య ఏమైందని అడుగుతాడు. ‘నేను సోచాయిస్తున్నది నా గురించి కాదు. సత్యకి తెలిస్తే తప్పుగా సమజ్ చేసుకుంటది. చిన్న బిడ్డని అన్ని మాటలన్న సత్యవ్వ ఇపుడు ఇది తెలిస్తే ఊరుకుంటదా’ అని అడుగుతుంది ఆదిత్యని. ఆ మాటల్ని దొంగచాటుగా విన్న మాధవ్.. ఏం చేస్తాడో తెలుసుకోవాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..