రాధ తనదేనని ఏదైనా జరిగితే ఊరుకునేదే లేదని చెప్పి తల్లిని బెదిరిస్తాడు మాధవ్. మరోవైపు జానకికి ట్రీట్‌మెంట్ చేస్తానని చెప్పిన డాక్టర్‌కి ఆక్సిడెంట్ అయిందని ఆదిత్య రాధతో చెప్తాడు. దాంతో అందరూ మళ్లీ బాధపడతారు. సత్య మాత్రం ఆదిత్యపై కోపం పెంచుకుంటూనే ఉంది. ఆ తర్వాత అక్టోబర్ 3 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
ఆదిత్య, రాధలు ఎప్పటిలాగే బయట రహస్యంగా కలుస్తారు. డాక్టర్‌కు ఆక్సిడెంట్ అవడం ఏంటని బాధపడుతుంది ఆదిత్యతో చెప్తూ. అనుకోకుంట జరిగిందానికి మనం ఏం చేస్తాం చెప్పు రాధ అంటాడు భర్త. జానకి తనకు ఏదో చెప్పాలనుకుంటుందని, ఎలాగైనా తనకి నయం చేయమని వేడుకుంటుంది రాధ. నాకు తెలిసిన ఒక ఆశ్రమంలో ఈ జబ్బుకు మంచిగా నయం అవుతుందని విన్నాను. అక్కడికి తీసుకెళ్దామంటే మాధవ్ వింటాడా? అని ప్రశ్నిస్తాడు ఆదిత్య. ఆ సారు అట్లనే ఒర్లుతాడు. మనం వెళ్లి రామ్మూర్తి సార్‌తో మాట్లాడదాం పదండి అంటూ తీసుకెళ్తుంది ఆదిత్యని.
దేవుడమ్మ సత్యతో అలా మాట్లాడకూడదని హితబోధ చేస్తుంది. ‘ఆ ఇంటినే కాకుండా ఈ ఇంటిని కూడా పట్టించుకోమని చెప్తున్నా ఆంటీ. అక్కడ జానకమ్మని చూసుకోవడానికి ఇద్దరు మగవాళ్లు ఉన్నారు కదా. ఆదిత్యే వెళ్లాల్సిన అవసరం ఏముంది’ అంటూ తన ఆవేదనను వ్యక్తం చేస్తుంది సత్య. ‘ఈ సమస్యకి పరిష్కారం దొరకాలంటే ఓ రెండు రోజులు మీరిద్దరూ ఎక్కడికైనా దూరంగా వెళ్లండి’ అని సూచిస్తుంది దేవుడమ్మ. దాంతో సత్య ఆనందపడుతుంది. ‘అలా వెళ్లాలి అంటే ఆదిత్య ఒప్పుకోవాలి కద ఆంటీ’ అని అనుమానం వ్యక్తం చేస్తుంది. అన్నింటికి ఒప్పుకోకపోతే నేను ఊరుకుంటానా? నువ్ వెళ్లి కావాల్సిన ఏర్పాట్లు చేయమని చెప్తుంది కోడలితో.
సీన్ కట్ చేస్తే.. జానకి ఒంటరిగా దిగులుపడుతూ ఉంటుంది. పిల్లలు వచ్చి టీవీ చూస్తావా? అంటే జానకి ఏం మాట్లాడదు. నేను కరాటే చేస్తా.. చూస్తావా అంటూ చేసి చూపిస్తుంది దేవి. చిన్మయి కూడా భరతనాట్యం చేస్తూ జానకిని సంతోషపెడుతుంది. నువ్ ఎప్పటికీ ఇలానే ఉండాలని అంటారు. ‘ఎందుకు ఏడుస్తున్నావ్ నానమ్మ. ఊరుకో. ఆఫీసర్ సార్ నయం చేయిస్తానని చెప్పాడు కదా’ అంటారు. రామ్మూర్తి కూడా అక్కడికి వచ్చి నువ్ అలా ఉంటే నేను తట్టుకోలేను జానకి అంటాడు. అపుడే ఆదిత్య, రాధలు వస్తారు అక్కడికి. జానకమ్మని ప్రకృతి వైద్యశాలకు తీసుకెళ్తే బాగుంటుందని చెప్తాడు రామ్మూర్తితో. అక్కడ వైద్యం బాగుంటుంది కాబట్టి త్వరగా కోలుకునే అవకాశం ఉంటుందని వివరిస్తాడు. మీరు ఎలా చెప్తే అలా బాబు. మీకంటే ఎక్కువ నాకేం తెలియదు అంటాడు రామ్మూర్తి. ‘మా అమ్మ కోసం నాకంటే మీరు ఎక్కువ శ్రద్ధ చూపడం బాగుంది. కానీ అక్కడికి మాతో పాటు మీరు కూడా రావాలి. మీరుంటే మా అమ్మకి, రాధకి బాగుంటుంది’ అంటాడు మాధవ్. పిల్లలు కూడా ఆదిత్యని రమ్మని బతిలాడుతారు. దాంతో సరే అంటాడు ఆఫీసర్.
ఆ తర్వాత సీన్‌లో సత్య హుషారుగా బట్టలు సర్దుతుంది. ‘ఈ పాండిచ్చేరి ట్రిప్‌కి ఆదిత్యని అసలు వదలకూడదు. ఇక్కడి ఆలోచనలు అస్సలు రాకుండా చేయాలి. ఆదిత్యతో జాలీగా గడపాలి. కాలేజి రోజుల్లో ఎంత జాలీగా ఉండేవాళ్లం. మరిచిపోయిన ఆ రోజుల్ని మళ్లీ గుర్తుచేయాలి. ఇక్కడిలా అక్కడ మా మధ్య ఎవరూ ఉండరు కాబట్టి పాత రోజుల్ని గుర్తు చేయాలి. అప్పుడైనా ఆదిత్య మారుతాడేమో. నేను ఆదిత్యని మార్చాలి’ అంటూ కలలు కంటుంది సత్య.
అక్కడ మాధవ్ గిటారు వాయిస్తూ ‘అరేయ్ ఆదిత్య. నువ్ నాజోలికి వస్తే ఊరుకుంటానా. ఆఫీసర్‌గా నీ పనులు చేసుకోకుండా నీకు ఎందుకు రా ఇవన్నీ. డాక్టర్‌ని పిలిపించావ్. ఏం జరిగిందో చూశావ్ కదా. మళ్లీ ప్రకృతి వైద్యం అంటున్నావ్. రా చూసుకుందాం. ఈ మాధవ్ అంత ఈజీగా దొరికిపోడు. రాధ నాదే. నాకే దక్కుతుంది. నేను వేసే ప్రతి అడుగు కింద మా అమ్మే నలిగి పోయింది నువ్ ఎంతరా. రాధని నా నుంచి ఎవరూ దూరం చేయలేరు’ అంటూ విర్రవీగిపోతాడు.
ఇంటికి వెళ్లిన ఆదిత్యతో త్వరగా ఫ్రెషప్ అయి రమ్మని తొందర పెడుతుంది సత్య. ఎందుకు, ఎక్కడికి అని ఆదిత్య అడగ్గా.. ఫ్లైట్‌కి టైం అవుతుంది వెళ్లు అంటుంది. అంతలోనే దేవుడమ్మ వచ్చి ‘సత్య టూర్ ప్లాన్ చేసింది. ఇందాకటి నుంచి నీకోసం ఎదురు చూస్తుంది’ అంటుంది. నాతో చెప్పకుండా ఇవన్నీ ఏంటి సత్య అని అనగా ‘అమెరికా ప్లాన్ చేస్తే నువ్ వెళ్లావారా. అక్కడికి కాకపోయినా ఇక్కడికైనా వెళ్లు’ అంటూ దబాయిస్తుంది దేవుడమ్మ. నేను ఆఫీసర్‌ని అనుకుంటున్నావా? ఆఫీస్‌లో పని మనిషి అనుకుంటున్నారా? అంటూ ప్రశ్నిస్తాడు ఆదిత్య. మళ్లీ నాకు క్యాంప్ ఉందని.. రావడం కుదరదని తెగేసి చెప్తాడు. దాంతో దేవుడమ్మకు కోపం వస్తుంది. ‘నువ్ ఒక్కడివే ఉద్యోగం చేస్తున్నావా? ఎప్పుడూ ఆఫీస్ ఆఫీస్ అంటూ తిరుగుటుంటావా. ఇంట్లో వాళ్లని పట్టించుకోవా’ అంటుంది. మరి ఆదిత్య నిర్ణయం ఏంటో తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.