గుడిలో పంతులు చెప్పిన మాటల్ని తలచుకుంటూ బాధపడతాడు ఆదిత్య. ఇన్ని రోజులు నువ్ నాకు ఎందుకు దూరంగా ఉంటున్నావో ఇప్పుడే అర్థమైంది. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నా రుక్మిణి.. సారీ అని అనుకుంటాడు ఆదిత్య మనసులో. ఆ తర్వాత సీన్‌లో రాధ పిల్లలకు తినిపిస్తుంది. ‘నువ్ అగుపడలేదంటే ఎంత మందిమి లెంకినం తెలుసా? ఎక్కడికి పోయినవ్’ అని ప్రశ్నిస్తుంది కూతుర్ని రాధ. మా నాయన ఎవరో తెలుసుకోవడానికి నీ ఫొటో పట్టుకుని వెతుక్కుంటూ పోయినా. ఎక్కడెక్కడో తిరిగిన తర్వాత సోయి తప్పి పడిపోయిన. ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు అని జరిగింది చెప్తుంది దేవి. ‘అమ్మా.. ఇప్పటికైనా మా నాయనెవరో చెప్పమ్మా’ అంటూ నిలదీస్తుంది మళ్లీ. రాధ చెప్పకపోవడంతో కోపంగా వెళ్లిపోతుంది దేవి.
సీన్ కట్ చేస్తే.. దేవుడమ్మ ఆలోచిస్తూ కూర్చుంటుంది. రాజమ్మ వచ్చి ఏంటక్కా.. నీ ఆలోచన సత్య గురించా? లేక ఆదిత్య గురించా అని అడగ్గా.. ఇద్దరి గురించి అని బదులిస్తుంది దేవుడమ్మ. ఆదిత్యని నాలుగు రోజులు ఇంట్లో ఉండమని మాట్లాడుకుంటూ సరిపోతుంది అక్కా అని సలహా ఇస్తుంది రాజమ్మ. దేవి దొరికిందో లేదో ఆదిత్య ఎక్కడ ఉన్నాడో అని ఆందోళన చెందుతుంది దేవుడమ్మ. అంతలోనే ఆదిత్య వస్తాడు. ‘ఏంట్రా ఈ అవతారం’ అని దేవుడమ్మ అడగ్గా.. రెండ్రోజులు కష్ట పడ్డాం.. దేవి క్షేమంగా దొరికిందని చెప్తాడు ఆదిత్య. దాంతో దేవుడమ్మ సంబరపడిపోతుంది. ఎక్కడ దొరికిందని అడగ్గా… జరిగిందంతా చెప్తాడు ఆదిత్య. సరే కానీ ఆఫీస్ నుంచి ఒకటే ఫోన్లు వస్తున్నాయి.. త్వరగా రెడీ అయి వెళ్లమని సూచిస్తుంది దేవుడమ్మ.
ఆ తర్వాత సీన్‌లో మాధవ్ చేసిన పనులను తలుచుకుంటూ చిరాకు పడుతుంది రాధ. అపుడే మాధవ్ వచ్చి రాధా.. అని పిలుస్తాడు. నా గదిలోకి సీదా వచ్చినవేంది బయటికి వెళ్లు అని అసహ్యించుకుంటుంది. ఊరి జనం ముందు మాధవ్ చేసిన పనుల గురించి నిలదీస్తుంది రాధ. నన్ను నా బిడ్డని బాధపెట్టినందుకు అనుభవిస్తావ్ అని శపిస్తుంది. ఆ తర్వాత దేవుడమ్మ ఆదిత్య గురించి ఆలోచిస్తుంది. నాకు తెలిసి నా బిడ్డ ఏ తప్పు చేయడు. తల్లిగా నా మాటను జవదాటలేదు అనుకుంటూ ఆదిత్య ప్రవర్తనలో వచ్చిన మార్పుని తలుచుకుంటూ బాధపడుతుంది. ఆదిత్య బాధేంటో ఈ రెండ్రోజుల్లో తేల్చేస్తా.. నా బిడ్డ తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి ఈ తప్పు చేయక తప్పదు అనుకుంటుంది దేవుడమ్మ.
ఆ తర్వాత ఆదిత్య దేవికోసం స్కూల్‌కి వెళ్తాడు. నిన్ను చూడడానికి రోజు నేను వస్తా అని ఆదిత్య చెప్పగా నేనంటే అంత ఇష్టమా సారూ నీకు అని ప్రశ్నిస్తుంది దేవి. ఆ తర్వాత ఎందుకు కనిపించకుండా పోయావమ్మా అని ఆదిత్య అడగ్గా.. మా నాయనని వెతుక్కుంటూ పోయిన అంటుంది దేవి. నీకేమైనా అయితే మేం అందరం ఏమైపోవాలి అని ఎమోషనల్ అవుతాడు ఆదిత్య. మీ నాయన అంటే అంత ఇష్టమా నీకు అని దేవిని అడగ్గా.. ఇష్టమా? అగుపిస్తే ఏదేదో చేయాలని ఉందంటుంది దేవి. ఎందుకమ్మా అని అడగ్గా.. తన కోపానికి గల కారణాన్ని చెప్తుంది దేవి. ఇప్పటికిప్పుడు మీ నాన్న వచ్చి మిమ్మల్ని బాగా చూసుకుంటానంటే అని ప్రశ్నిస్తాడు ఆదిత్య. వస్తే బాగుంటది సారూ. మా అమ్మని, నాయన్ని ఒకటి చేస్తా అని తన తండ్రి మీద ఉన్న ఇష్టాన్ని చెప్పుకుంటుంది ఆదిత్యతో. ఆ మాటలు విని సంబరపడిపోతాడు ఆదిత్య. మా నాయనను వెతకడానికి నాకు సాయం చేస్తవా సారూ? అని అడుగుతుంది ఆఫిసర్‌ని. మరి ఆదిత్య నిజం చెప్తాడా? లేదా తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..