వారసులు కావాలని భర్తతో చెప్తూ ఎమోషనల్ అవుతుంది దేవుడమ్మ. ఆ మాటల్ని చాటుగా విన్న సత్య అత్తయ్య దగ్గరికి వెళ్లి కంటతడి పెడుతుంది. రుక్మిణి మీద సత్య కోపం పెంచుకుంటున్నందుకు బాధపడతాడు ఆదిత్య. అక్కడ దేవేమో తన తల్లే రుక్మిణి అని తెలియడంతో కోపంగా ఉంటుంది రాధ మీద. ఆ తర్వాత అక్టోబర్ 12 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
రాధ మీద మాధవకున్న ఉద్దేశం చూసి కోపంతో రగిలిపోతుంది భాగ్యమ్మ. నా బిడ్డను కష్టపెడితే ఊరుకుంటానా.. చేయి లేస్తది అంటూ వార్నింగ్ ఇస్తది. నా బిడ్డకు ఎవరూ లేరనుకుంటున్నవేమో.. కడుపున కన్న నేనున్నా.. అంటూ వార్నింగ్ ఇస్తుంది. దాంతో మాధవ్ షాకవుతాడు. ఆ తర్వాత సీన్‌లో ఆదిత్య స్కూల్ దగ్గరికి వెళ్లి దేవి కోసం ఎదురు చూస్తాడు. రామ్మూర్తి పిల్లల్ని తీసుకుని వస్తాడు అపుడే. ‘నమస్తే బాబు.. మీరెంటీ ఇక్కడ’ అని అడుగుతాడు రామ్మూర్తి. పిల్లల్ని కలవడానికి వచ్చినట్లు చెప్తాడు ఆదిత్య. జానకమ్మ గురించి మంచి చెడులు తెలుసుకుంటాడు. మీరేం దిగులు పడకండని ధైర్యం చెబుతాడు రామ్మూర్తికి. తర్వాత రామ్మూర్తి వెళ్లిపోతాడు అక్కడి నుంచి. ‘అమ్మా దేవి. నాతో కూడా మాట్లాడకుండా వెళ్లిపోతున్నావ్.. ఏమైందమ్మా ఎందుకు డల్‌గా ఉన్నావ్ ’ అని ప్రశ్నిస్తాడు ఆదిత్య. నువ్ అలా ఉంటే నాకు బాధగా ఉంది.. నన్ను బాధపెడతావా? అని ఆదిత్య అడిగినా.. నేనెవరితో మాట్లాడను అని కోపంగా వెళ్లిపోతుంది దేవి.
జానకికి సేవ చేస్తున్న రాధని చాటుగా చూస్తాడు మాధవ్. ‘ఎందుకు ఏడుస్తున్నారు మీ బాధ నాకు అర్థమైంది.. మిమ్మల్ని ఇడిచిపెట్టి ఎట్ల పోతా.. చంటి బిడ్డతో వచ్చిన నన్ను చేరదీశారు. మీరు నా గురించి పరేషాన్ కాకడండి. మందులు వేసుకుంటే మీకు జల్దీ నయవుతది’ అంటూ ఓదారుస్తుంది రాధ జానకిని. మాధవ్ మాత్రం ఆ మాటలకు తెగసంబరపడిపోతాడు. మా అమ్మని ఎంతో ప్రేమగా చూస్తున్నావ్.. మరి నన్నెందుకు చూడట్లేదు. నువ్ నా దానివి అయ్యే రోజు చాలా దగ్గర్లోనే ఉంది అనుకుంటాడు రాధని ఉద్దేశించి. అక్కడ సత్య ఆదిత్య మాటల్ని తలుచుకుంటూ బాధపడుతుంది. అంతలోనే పాప ఏడుపు వినిపిస్తుంది. పాపని వదిలేసి అక్క ఎక్కడికి వెళ్లిందంటూ వచ్చి పాపని ఎత్తుకుని ఆడిస్తుంది. రుక్కు అని పాపని పిలిచి బాధపడుతుంది. మా అక్కే నా ప్రాణం అనుకున్నా.. కానీ ఇపుడు ఆ పేరు వింటేనే అసహ్యం వేస్తుంది అనుకుంటుంది సత్య.
సీన్ కట్ చేస్తే.. మాధవ్ ఎప్పటిలాగే జానకి దగ్గరికి వెళ్తాడు. నీ కాళ్లు పశ్చాత్తాపంతో పట్టుకోలే.. సంతోషంతో పట్టుకున్నా. నువ్ పడడం వల్లే రాధ ఇంట్లో నుంచి వెళ్లిపోమన్నా వెళ్లిపోవట్లేదు. రాధ ఈ ఇంట్లోనే ఉండాలంటే నువ్ ఎప్పటికీ ఈ చైర్‌లోనే ఉండాలి అంటాడు తల్లితో. ఆ మాటల్ని విని భాగ్యమ్మ కోపంతో రగిలిపోతుంది. నేను ఇపుడు ఒక పని చేయబోతున్న.. నన్ను ఆశీర్వదించమ్మా అంటాడు.
ఆ తర్వాత సీన్‌లో ఆదిత్య రాధని కలిసి దేవి గురించి చెప్తాడు. ఏమైందో పెనిమిటి.. నాకు కూడా సమజ్ అయితలేదంటూ మదనపడుతుంది రాధ.. పెనిమిటికి సత్య ముచ్చట చెప్పాలా వద్దా.. అని ఆలోచిస్తుంది రుక్మిణి. నా దగ్గర దాచాల్సిన అవసరం ఏంటి రుక్మిణి అని అడగతాడు. అంతలోనే సత్య అక్కడికి రావడంతో కథ మరో మలుపు తీసుకుంటుంది. సత్యని చూసి ఆదిత్య, రాధల నోటి వెంట మాటరాదు. ‘ఎవరికి వారు సూపర్.. ఒకరు నేనున్నాని మాటిచ్చి లాగేసుకుంటారు. ఇంకొకరు అబద్దం చెప్పి రహస్యంగా కలుస్తారు. అసలు మా మధ్య ఏం లేదంటారు. కానీ చాటుగా కలుస్తారు’ అంటుంది సత్య. ఏం మాట్లాడుతున్నావ్ సత్య అని రుక్కు అనగా.. నిజమే మాట్లాడుతున్నానంటుంది సత్య. మరి సత్య ఏం చేయబోతుందో తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..