విజయదశమి సందర్భంగా దేవుడమ్మ కుటుంబమంతా అమ్మవారి గుడికి వెళ్తారు. అక్కడ ఆదిత్య, సత్యలు తమ చేతుల మీదుగా చీరలు, గాజులు పంచిపెడతారు.. మరోవైపు అదే గుడికి మాధవ్ రాధ, పిల్లలతో కలిసి వెళ్తాడు. దేవి తన తల్లి రాధను పరిచయం చేయిస్తానంటుంది దేవుడమ్మతో. అపుడే సత్య తన అక్క చేస్తున్న అన్యాయం గురించి నిలదీయాలనుకుంటుంది. ఆ తర్వాత అక్టోబర్ 10 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
ఆదిత్య, రాధలు కలిసి ఉన్న ఫొటోను చూపిస్తుంది సత్య. ఇందాక ఏమన్నావ్ అక్క ‘పెనిమిటి అనా.. ఇద్దరు పిల్లల తల్లివి. ఇంకొకరు కట్టిన తాళి ఉండగా ఆదిత్యని పెనిమిటి అని ఎలా అంటావ్’ అని చీదరించుకుంటుంది రుక్మిణిని. నీకంటూ ఒక కుంటుంబం ఉండగా ఆదిత్యతో ఏం పని ప్రశ్నిస్తుంది. నా జీవితాన్ని నిలబెట్టడం కోసం నీ జీవితాన్ని త్యాగం చేసిన దేవత అనుకున్నా. కానీ ఇలా పదేపదే కలుస్తుంటే ఏమనుకోవాలి అని నిలదీస్తుంది. నువ్వంటే ఆంటీకి ఎంతో ఇష్టం. అందుకే కమలక్క బిడ్డకు నీ పేను పెట్టుకుంది. కానీ నువ్ ఇలా ఆదిత్యతో తిరిగితే నిన్ను అసహ్యించుకుంటుంది. ఆదిత్యని కలుస్తున్న నువ్ ఆంటీని ఎందుకు కలవట్లేదు.. ఒకప్పుడు నిన్ను చూడాలి.. చూడాలి అనుకునేదాన్ని కానీ ఇప్పుడు నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తుంది అని రుక్కు మొహం మీదే చెప్పేస్తుంది.
సత్య, రుక్కుల మాటలన్నీ చాటుగా వింటుంది దేవి. తన తల్లి పేరు రాధ కాదని తెలిసి ఆలోచనలో పడుతుంది. మరోవైపు రుక్కు కోసం ఆదిత్య వెతుకుతాడు. అక్కడ దేవుడమ్మ పూజలన్నీ పూర్తి చేసుకుంటుంది. తల్లిని తీసుకొస్తానని వెళ్లిన దేవి వచ్చి దేవుడమ్మకు అబద్ధం చెబుతుంది. అంటే మా అమ్మే రుక్మిణా అని మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత అందరూ ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోతారు. సత్య మాటల్ని తలచుకుని కుమిలి కుమిలి ఏడుస్తుంది రాధ. ‘నీ కోసం కడుపున బిడ్డ ఉన్నా.. మీ అందరి ముందు చచ్చిపోయినట్టు బతుకుతున్నా. ఇంట్లో అత్తమ్మ వారసుల కోసం ఆగమవుతుందని తెలిసి దేవిని పెనిమిటికి దగ్గర చేయాలని చూసినా.. అని సత్యని ఉద్దేశించి అనుకుంటుంది. తాను విన్న మాటల్ని తలుచుకుంటూ దేవి కూడా చింతిస్తుంది. ‘హలో ఆఫీసర్.. ఏంటీ హడావిడిగా నా పిల్లల దగ్గరికి వెళ్తున్నావ్. ఓ రాధ కనిపించలేదనా.. రాధ మీ ఇంటికి రావాలనుకున్నా రాలేదు. మా అమ్మకు దెబ్బలు బాగా తగిలాయి కాబట్టి రాధ రావడం జరగదు’ అంటూ ఆదిత్యని రెచ్చగొడతాడు మాధవ్. ఇప్పటికే ఒక భార్య దూరమైందని, ఇంకో భార్యని దూరం చేసుకోకని సలహా ఇస్తాడు.
సీన్ కట్ చేస్తే.. రాధ గుడి నుంచి ఇంటికి వెళ్లిపోతుంది. ‘నువ్వేనా సత్యవ్వ నన్ను అట్ల అర్థం చేసుకుంది. అక్క నీ బతుకు బాగుచేస్తది కానీ కరాబ్ చేస్తదని ఎట్ల అనుకున్నావ్’ అంటూ ఎమోషనల్ అవుతుంది. అక్కడ సత్య కూడా రుక్మిణి చేస్తున్న మోసం గురించి చింతిస్తుంది. ‘మాయమ్మ పేరు రాధ కాదా. మరి మా అమ్మ నాకు ఎందుకు చెప్పలే’ అనుకుంటూ ఆలోచిస్తుంది దేవి. సత్య ఎందుకు రుక్మిణిని అపార్థం చేసుకుంటుందని బాధపడతాడు ఆదిత్య. ఇలా అందరూ ఎవరికి వారుగా ఆలోచిస్తూ కంటతడి పెడుతుంటారు. ఆలోచిస్తూ కూర్చున్న దేవి దగ్గరికి వెళ్లి ఏమైందని అడుగుతుంది చిన్మయి. అంతలోనే రాధ అన్నం తినడానికి రమ్మని పిలవగా.. నాకు ఆకలిగా లేదంటుంది చిన్మయి.
ఆ తర్వాత సీన్‌లో దేవుడమ్మని నీ బాధ ఏంటని అడుగుతాడు భర్త. ఈ వయసులో అమ్మవారి ముందు పొర్లు దండాలు పెట్టి ఇలా బాధపడడం ఎందుకు అంటాడు భార్యతో. ఈ నొప్పులది ఏముంది నేను పడుతున్న బాధముందు అంటుంది దేవుడమ్మ. ‘వయసు మీద పడ్డాక మనల్ని ఆడించడానికి వారసులు కావాలి. వయసు మీద పడ్డపుడు ఆయుష్షుని ఆరోగ్యాన్ని పెంచేది డాక్టర్లు, మందులు కాదండీ పిల్లలు. పిల్లలు నవ్వే బోసి నవ్వులు’ అంటుంది ఎమోషనల్‌గా. మరి ఆ మాటల్ని విన్న సత్య ఏం చేస్తుందో తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..