ఆదిత్యతో కలిసి రుక్మిణి గుడిలో దీపాలు వెలిగిస్తుంది. దాంతో దేవి తన తండ్రి ఎవరో తెలుసుకుంటుంది. ఆదిత్యే మా నాయన అని సంబరపడిపోతుంది. అంతలోనే మాధవ్ కూడా అక్కడికి వస్తాడు. సత్యకు ఫోన్ చేసి గుడిలో జరిగిందంతా చెప్తాడు. భర్త మీద కోపంతో ఊగిపోతుంది సత్య. ఆ తర్వాత నవంబర్ 4 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
తన తండ్రి ఎవరో తెలియడంతో దేవి ఆనందంగా ఉంటుంది. చిన్మయి వచ్చి ఏమైందని అడగ్గా.. నాకు చాలా ఖుషిగా ఉంది అంటుంది దేవి. మా నాయనెవరో నాకు తెలిసింది అంటుంది. ఆఫీసర్ సారే మా నాయన.. గందుకే గీ పొద్దు నేను మస్తు ఖుషిగా ఉన్నా అంటుంది అక్కతో. ‘ఆఫీసర్ సారే మీ నాయన అని నాకు ముందే తెలుసు’ అంటుంది చిన్మయి. నీకెలా తెలుసు అని అడగ్గా.. చిన్మయి ఎలాగో తెలిసింది లే అంటుంది. అమ్మకు నాయన అంటే మస్తు ఇష్టం ఉన్నది మరి ఎందుకు దూరంగా ఉంటున్నారో నాకు అర్థం కావట్లేదు అంటుంది దేవి. అదైతే నాకు తెలియదు కానీ సత్య పిన్ని అమ్మ చెల్లలు. ఆదిత్య సారుకు సత్య పిన్ని దూరమై పోతుందేమోనని అమ్మ భయం అంటుంది చిన్మయి. అంతలోనే ఆదిత్య, రుక్మిణిని తీసుకుని వస్తాడు. దేవి వెళ్లి ప్రేమగా ఆఫీసర్ సారూ రండి అంటూ లోపలికి తీసుకెళ్తుంది. అమ్మ నువ్వెళ్లి కాఫీ తీసుకురా అంటూ హడావుడి చేస్తుంది దేవి. ఆదిత్య మాత్రం జానకమ్మ ఆరోగ్యం ఎలా ఉందో అడిగి తెలుసుకుంటాడు. దేవి కాఫీ తీసుకురమ్మని బలవంతం చేస్తుంది రాధని. నేనంటే నీకు మస్తు ఇష్టం కద బిడ్డ లెక్క అంటుంది ఆఫీసర్‌తో. దాంతో ఒక్కసారిగి అందరూ షాకవుతారు. ఆ తర్వాత మళ్లీ మీ బిడ్డ లాంటిదాన్ని అంటూ కవర్ చేస్తుంది దేవి.
ఆ తర్వాత మాధవ్ ఎంట్రీ ఇస్తాడు. ఎంత తర్వగా రాధని పెళ్లి చేసుకుంటే అంత మంచిది అనుకుంటాడు ఆదిత్య, రుక్మిణిలను చూసి. దేవి ఆదిత్యకు కాఫీ ఇస్తుంది. మాయమ్మ నీకు ఎక్కడ కలిసింది సారూ అని అడగ్గా.. తడబడుతూ ఇద్దరూ వేర్వేరుగా సమాధానం చెప్తారు. కాసేపు ఆడుకుందాం సారూ బయటికి పోయి. నేను నీతో ఏడికి రమ్మన్నా వస్తా అంటుంది దేవి. తప్పకుండా తీసుకెళ్తానమ్మా.. మళ్లీ వస్తా అంటాడు ఆదిత్య. స్కూల్‌కు నీతోనే వస్తా.. నీతోనే ఉంటా అంటున్న దేవి ప్రవర్తనలో వచ్చిన మార్పుకు అందరూ షాకవుతారు. వెళ్లొస్తానమ్మా అంటూ బయల్దేరతాడు ఆదిత్య.
సీన్ కట్ చేస్తే.. మాధవ్ మాటల్ని గుర్తు చేసుకుంటూ బాధపడతుంది సత్య. చాటుగా ఆదిత్యతో తిరుగుతున్న అక్కని తప్పుగా అర్థం చేసుకుంటుంది. అంతలోనే దేవుడమ్మ వచ్చి.. సత్య ఒకటి అడుగుతా సూటిగా సమాధానం చెప్పు అంటుంది. మనం ఎంత చెప్పినా ఆదిత్య ప్రవర్తనలో మార్పు రావడం లేదు. అంటే మీ అక్క ఇక్కడే ఎక్కడో ఉందో? అని నిలదీస్తుంది. దాంతో సత్య షాకవుతుంది. అదేంటి ఆ అనుమానం ఎందుకు వచ్చింది ఆంటీ అంటుంది. నిన్ను ఏ కష్టం రాకుండా చూసుకుంటానని మాటిచ్చిన ఆదిత్య ఇలా ప్రవర్తిస్తున్నాడు. ఆదిత్య వాడిని వాడే మరిచిపోయి తిరిగేది ఒక్క రుక్మిణి ఉన్నపుడు మాత్రమే అంటూ బాంబ్ పేల్చుతుంది. అదేం లేదు ఆంటీ అంటుంది సత్య. మరెందుకు మీ జీవితాల్లో ఈ అలజడి అంటూ సత్యని నిలదీస్తుంది. అంతలోనే ఆదిత్య వస్తాడు. భోజనం చేసి వెళ్లరా అని దేవుడమ్మ అడగ్గా.. ఆకలిగా లేదంటాడు. బెడ్రూంలోకి వెళ్లి తనలో తానే నవ్వుకుంటాడు ఆదిత్య.
అది చూసి సత్య షాకవుతుంది. అసలు నీకేమైంది. వేరే వాళ్ల భార్యతో కలిసి గుడిలో దీపాలు వెలిగించమేంటి.. పాపం వస్తుంది అంటూ కోప్పడుతుంది సత్య. అయినా ఆదిత్య నోరు విప్పకుండా అలానే నవ్వుకుంటాడు. కోపం వచ్చి సత్య వెళ్లిపోతుంది. అక్కడ దేవి మా అమ్మ నాయన కలిసి ఉండకపోవడానికి కారణం చిన్నమ్మ అని అనుకుంటుంది. మరెలా దేవి.. నీకు ఈ నిజం తెలుసని అమ్మకు చెప్తానంటుంది చిన్మయి. అమ్మ చెప్పే వరకు నువ్ చెప్పకు అని అంటుంది అక్కతో. రేపు ఒకసారి నా ఇంటికి పోయి వస్తానంటుంది దేవి. ఆ తర్వాత ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.