దేవుడమ్మ తనని ఇంటికి తీసుకెళ్తానన్న మాటల్ని తలుచుకుంటూ కుమిలిపోతుంది రుక్మిణి. నేను వెళ్తే నా చెల్లె బతుకు ఆగమైతదని బాధపడుతుంది. ఆ తర్వాత దేవుడమ్మ ఆదిత్యని నిలదీయడంతో అంతా చెప్పేస్తాడు. దేవే నీ మనవరాలని చెప్పడంతో ఎమోషనల్ అవుతుంది దేవుడమ్మ. సత్య కూడా తన అక్క మంచితనం తెలుసుకుని పశ్చాత్తాపంతో కుమిలిపోతుంది. ఈ రోజు ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం..
నా బిడ్డని వాళ్ల నాయనకి అప్పజెప్పి నా దారిలో నేను పోయే దారి చూపియ్ దేవుడా అని వేడుకుంటుంది రుక్మిణి. రాధని వెతుక్కుంటూ కంగారుగా వస్తాడు మాధవ్ అక్కడికి. నువ్ ఎలా వెళ్తావో నేనూ చూస్తా రాధ అనుకుంటాడు మనసులో. దేవుడికి దండం పెడుతున్న రాధ మెడలో తాళి పెట్టగానే మాధవ్‌ని నెట్టేస్తుంది. అలా ఇద్దరి మధ్య తోపులాట జరుగుతుంది. రాధ వద్దు సారూ.. అని ఎంత వేడుకున్నా మాధవ్ వదలకుండా బలవంతం చేస్తాడు. రాధ మెడలో ఉన్న తాళిని మాధవ్ లాగుతుండగా సత్య వచ్చి తల పగలగొడుతుంది. దాందో కిందపడిపోతాడు మాధవ్. ఏంది సత్య ఇట్ల చేసిన్ అని కంగారు పడుతుంది రుక్మిణి. ‘నన్ను క్షమించు అక్క. నీ త్యాగాన్ని అపార్థం చేసుకున్నా’ అంటూ రుక్మిణి కాళ్లమీద పడి ఏడుస్తుంది సత్య. అంతలోనే అక్కడికి వచ్చిన పిల్లల్ని, భాగ్యమ్మను చూసి మాధవ్‌ను తనే చంపినట్టు కర్ర చేతిలో పట్టుకుంటుంది రుక్మిణి. చిన్మయి నాన్నా.. అంటూ విలవిలలాడిపోతుంది.
ఆ తర్వాత దేవుడమ్మతో సహా అందరూ అక్కడికి వచ్చి ఏంటమ్మా.. ఇది అని ప్రశ్నిస్తారు. నా బతుకుని ఆగం చేయాలని చూసిండు అందుకే చంపిన అని చెప్తుంది. నువ్ చంపడం ఏంటి రుక్మిణి అని ఆదిత్య ప్రశ్నించగా.. సత్య అక్క చంపలేదు అని చెప్తుంది. నువ్ అబద్ధం చెప్తే నిజం అవుతదా సత్య అని నింద తన మీద వేసుకుంటుంది రుక్కు. నా కడుపులో పుట్టిన బిడ్డని, గుండెల మీద పెంచిన బిడ్డని నీకు అప్పగించి పోతున్నానంటూ సత్య చేతిలో పిల్లల్ని పెడుతుంది రుక్కు. ఆ తర్వాత నన్ను మన్నించు అత్తమ్మా అంటూ దేవుడమ్మ దగ్గరికి వెళ్లి జరిగిందానికి క్షమాపణ అడుగుతుంది రుక్మిణి. మీ కోడలుగా బతకలేకపోయినా మీ కోడలిగా చచ్చిపోతానంటూ కాళ్ల మీద పడి ఏడుస్తుంది. కోడల్ని వాటేసుకుని దుఖి:స్తుంది దేవుడమ్మ.
ఆ తర్వాత ఆదిత్య దగ్గరికి వెళ్లి.. మళ్లీ జన్మంటూ ఉంటే నువే నా పెనిమిటివి కావాలంటూ ఎమోషనల్ అవుతుంది రుక్మిణి. ‘ఇగో పెనిమిటి నీకిచ్చిన మాట నిలబెట్టుకుంటున్న. నీ బిడ్డని నీకు ఇస్తున్నా. ఇక మీరు సంతోషంగా ఉండండి. దేవమ్మా ఆఫీసర్ సారే మీ నాయన. మంచిగ చదువుకో బిడ్డ’ అని దేవిని కౌగిలించుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది రుక్మిణి. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమని ఆదిత్య, సత్యలకు చెప్తుంది. చివరిసారిగా నేను పెనిమిటి కాళ్లు మొక్కుత సత్య అని చెప్పి ఆదిత్య కాళ్లు మొక్కుతుంది. అంతలోనే పోలీసులు వస్తారు. చెల్లిని గట్టిగా కౌగిలించుకుని ఏడుస్తుంది రుక్కు. కోడలి నుదిటిన ముద్దుపెడతుంది దేవుడమ్మ. అందరూ తీవ్ర విషాదంలో ఉండగానే రుక్మిణి పోలీసులతో జైలుకు వెళ్లిపోతుంది. చివరకు మిగిలేది.. అనుకుంటూ గతాన్ని గుర్తుచేసుకుంటారు.
సీన్ కట్ చేస్తే.. కొంత కాలం తర్వాత జైలు నుంచి విడుదలవుతుంది రుక్మిణి. భాగ్యమ్మతో కలిసి రుక్మిణి నాగలి దున్నుతుండగా తోట దగ్గరే కూర్చుని చిన్మయి చదువుకుంటుంది. అక్కడినుంచే కారులో వెళ్తున్న ఆదిత్య, సత్య, దేవి, దేవుడమ్మలు రుక్మిణిని చూసి మురిసిపోతారు. మొదటినుంచి చెల్లి కోసం బతికావ్. ‘ఇప్పుడు అనాధ అయిన ఆ బిడ్డ కోసం బతుకుతున్నావ్. నిజంగా నువ్ మనిషిగా పుట్టిన దేవత’ అని కోడల్ని ఉద్దేశించి మనసులో అనుకుంటుంది దేవుడమ్మ. రుక్మిణి కోరుకున్నట్టే దేవి తన తండ్రికి చేరువైంది. అనాధ అయిన చిన్మయికి అన్ని తనే అయింది రుక్మిణి. ఐఏఎస్ కావాలన్న దేవి కోరిక వైపు ఆదిత్య అడుగులు వేస్తుంటే.. అమ్మలా కావాలనుకున్న చిన్మయి అమ్మ అడుగులో అడుగు వేస్తుంది. ఈ ప్రయాణం ఇక్కడితో ఆగలేదు. ఇది మరో ప్రయాణానికి మొదలు మాత్రమే అంటూ ‘దేవత’ సీరియల్ పార్ట్ 1కు శుభం కార్డు పడుతుంది.