మాధవ, ఆదిత్య ఇళ్లల్లో వినాయక చవితి పూజలకు ఏర్పాట్లు మొదలయ్యాయి. అందంగా రెడీ అయిన రాధని చూసి మనసు పారేసుకుంటాడు మాధవ. అది గమనించిన భాగ్మమ్మకు మాధవ ప్రవర్తన పట్ల ఒళ్లు కాలిపోతుంది. వేడి గిన్నెను మాధవకు చురుకు పెడుతుంది. అక్కడ దేవిని కొత్త బట్టల్లో చూసి అందరూ మురిసిపోతారు. చిన్మయి చెల్లీ.. అనుకుంటూ దేవి కోసం ఆదిత్య ఇంటికి వెళ్తుంది. ఆ తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
‘చిన్న పిల్లలు అంటే ఇలా ఉండాలి’ అంటూ పిల్లల్లిద్దర్నీ, పెంచిన రాధను కూడా పొగడుతుంది దేవుడమ్మ. అక్కకు కొత్త డ్రెస్ చూపిస్తూ, దేవుడమ్మ కుట్టిందని చెబుతుంది దేవి. అక్కడేమో రాధతో పాటు ఇంటిల్లిపాది భక్తి శ్రద్ధలతో వినాయక పూజలు చేస్తారు. నవధాన్యాలను మూటగట్టమని రామ్మూర్తి జానకితో చెబుతాడు. అదేం ఆచారం అయ్యగారూ అని అడుగుతుంది భాగ్యమ్మ. ప్రతి సంవత్సరం ఇలా చిన్న చిన్న మూటలు కట్టి పొలంలో చల్లుతాం అని చెబుతాడు రామ్మూర్తి.
సీన కట్ చేస్తే.. దేవుడమ్మతో సహా అందరూ కలిసి వినాయకుడి పూజలో పాల్గొంటారు. దేవి చేతుల మీదుగా పూజ చేయమని పంతులుకు చెబుతుంది దేవుడమ్మ. చిట్టి రుక్మిణిని మీద పడుకోబెట్టుకొని పూజ మొదలుపెడుతుంది దేవి. అందరూ కలిసి సరదాగా కాసేపు ముచ్చటిస్తారు. ఆ తర్వాత పంతులు పూజా మంత్రాలు చదవడం స్టార్ట్ చేస్తాడు. ‘వినాయకుడిని చూసి చంద్రుడు నవ్విండని గట్ల దేవునికి కోపం రావచ్చునా’ అని అయ్యోరని ప్రశ్నిస్తుంది దేవి. ‘దేవుడు చేసే పనులకు కారణాలుంటాయమ్మా.. మంచి చెప్పడానికే దేవుడు చెడు కూడా పుట్టిస్తాడు. చెడు ద్వారా ఏం చేయకూడాదో చేయించి మరీ చూపిస్తాడు. చివరికి చెడును చంపి ముగింపు ఇదేనని మనకు నేర్పిస్తాడు..’ అంటూ దేవుడి సందేశాన్ని వివరిస్తుంది దేవుడమ్మ.
మరోవైపు రామ్మూర్తి కుటుంబం అంతా పొలంలో విత్తనాలు చల్లుతారు. రాధ ఎప్పటికీ తనతోనే ఉంటే సంతోషంగా ఉంటామని కలలు కంటాడు మాధవ. చేనులో కూలీ పనులు చేస్తున్న కొందరు రాధని పొగడుతారు. నీలాంటి మంచి మనసున్న అమ్మాయి రామ్మూర్తికి కోడలుగా, మాధవకు భార్యగా దొరకడం అదృష్టమని కొనియాడుతారు. వాళ్ల మాటల్ని అక్కడితే ఆపాలని.. ‘చాలు చాలు. మా రాధకి మీ దిష్టే తగిలేలా ఉంది. ఇక పని చేసుకోండి’ అంటూ దబాయిస్తుంది జానకి. రాధని ఇంటికి వెళ్లి పిండి వంటలు చేయమంటాడు రామ్మూర్తి. మాధవతో కలిసి వెళ్లడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతుంటుంది రాధ. అది గమనించి పదమ్మా.. అంటూ పిలుస్తుంది భాగ్యమ్మ. నువ్ రాకూడదంటూ భాగ్యమ్మను భయపెడతాడు మాధవ్.
ఆ తర్వాత సీన్‌లో దేవుడమ్మ కుటుంబమంతా భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు ముగిస్తారు. అయ్యోరు దగ్గర అందరూ ఆశీర్వాదం తీసుకుంటారు. కమలా.. రుక్మిణికి కూడా పూజారి దగ్గర ఆశీర్వాదం తీసుకో అంటూ హితబోధ చేస్తుంది రాజమ్మ. అపుడు దేవీ.. పెద్దమ్మా ఆగూ అంటుంది. ఏంది దేవమ్మ.. చెల్లి కూడా ఆశీర్వాదం తీసుకోవాలి కదా అంటాడు భాషా. ‘చిన్న బిడ్డ దేవుడితో సమానం అంటారు కదా. అలాంటపుడు దేవునికి అయ్యోరు ఆశీర్వాదం ఇచ్చుడేంది’ అంటూ తన నిర్ణయాన్ని వెల్లడిస్తుంది దేవి. ‘ఈ పాపకి మంచి భవిష్యత్తుంది అమ్మా’ అంటూ దేవి మాటలు విని పొగడతాడు పూజారి. ఆ మాటలు విని అందరూ సంబరపడిపోతారు.
ఆ తర్వాత దేవీ.. ఇంట్లోని వారందరికీ ప్రసాదం పంచుతుంది. చీత అంటూ సూరిని ఆటపట్టిస్తుంది. అందరితో సరదాగా గడుపుతుంది. ‘రుక్మిణి కూడా నడిపి మామా’ అంటూ తనని పిలిచేదని గుర్తుచేసుకుంటాడు సూరి. అలాగే దేవి కూడా అందర్నీ వరుసలు పెట్టి పిలుస్తుంది అది చూసి ‘అందర్నీ వరుసలు పెట్టి పిలవడం ఇది అక్క అలవాటు. దేవీ అదే అలవాటుతో పిలుస్తుందా? లేదంటే అక్కే దేవీతో ఇలా మాట్లాడిస్తుందా? ఏం జరుగుతుంది..’ అన్న సందిగ్ధంలో పడుతుంది సత్య. ఇంట్లో ఒంటరిగా ఉన్న రాధని దొంగబుద్ధితో చూస్తాడు మాధవ్. మరి రాధని ఏవిధంగా ఇబ్బంది పెడతాడో చూడాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..