తాగుబోతు తండ్రి చెప్పిన మాటలను తలుచుకుంటూ బాధపడుతుంది దేవి. ఆదిత్య వచ్చి ఏమైందమ్మా.. అని అడగ్గా మా నాయన వచ్చి వెళ్లిండని చెప్తూ ఏడుస్తుంది. ‘మా నాయనకి జ్వరం వచ్చింది. అయినాగానీ నన్ను చూడడానికి వచ్చిండు. నాయన్ని అలా చూస్తే నాకు మస్తు బాధైంది సారూ’ అని ఆదిత్యకు చెప్తూ ఎమోషనల్ అవుతుంది దేవి. ఇన్ని దినాలకు వచ్చినా మాయమ్మ మా నాయనతో మాట్లడతలేదు. మీరు చెప్పండి సారూ. మీరు చెప్తే మా అమ్మ వింటుంది. మా అమ్మని, నాయన్ని కలపండి అని వేడుకుంటుంది దేవి. నేనంటే ఎంత ప్రేమ ఉంటే అంత జ్వరం ఉన్నా వస్తాడు అని బాధపడుతుంది. ‘నిజం ఎదురుగా ఉన్నా.. అబద్ధాన్ని ఎంతగా ప్రేమిస్తున్నావమ్మా.. నాకు దక్కాల్సిన ప్రేమ మరెవరికో దక్కుతుంది’ అని మనసులో కుమిలిపోతాడు ఆదిత్య.
సీన్ కట్ చేస్తే.. రుక్కుతో మాట్లాడుకుంటూ.. ఊరికే చెంప దెబ్బ కొట్టి ఊరుకోవడం కాదు బిడ్డా.. మళ్లీ నీ జోలికి రాకుండా చేయాలి అంటుంది భాగ్యమ్మ. వాడిని చంపి నేను జైలుకు పోతా అంటూ కోపంతో ఊగిపోతుంది. నాకు చేతకాక మాధవ్‌ని వదిలిపెట్టట్లే. చిన్నప్పటినుంచి నా చేతుల్లో పెంచిన చిన్మయి ముఖం చూసి వదిలిపెడుతున్న. వాడిని చంపితే చిన్మయి తండ్రి లేని బిడ్డ అవుతుంది అంటూ ఎమోషనల్ అవుతుంది. మాధవ్‌సారు మీద కోపంతో చిన్మయిని బాధపెట్టనని అంటుంది రాధ. వాడి మనసు మార్చుతా. లేకపోతే వాడికి దూరంగా వెళ్లిపోదాం అంటుంది. నీ బాధ వదిలిపెట్టి ఎవరికోసమో ఆలోచించే నీకు ఎందుకు రుక్కవ్వా.. ఇన్ని కష్టాలు అంటూ ఏడుస్తుంది భాగ్యమ్మ.
మరోవైపు కమల బిడ్డని ఎత్తుకుని సత్య మురిసిపోతుంది. అది చూసి కమల నీకు కూడా ఇలాంటి బిడ్డ పుట్టాలి సత్య అంటుంది. ఆ బాధ తీర్చాలని అమెరికా వెళ్లాలనుకున్నా.. తీరా వెళ్లే టైంకు ఆదిత్య కుదరదని అన్నాడు.. అనుకుంటూ మదనపడుతుంది సత్య. ఈసారి అత్తమ్మకి చెప్పి ఎలాగైనా వెళ్లమని కమల సలహా ఇస్తుంది. నాకు మాత్రమే ఉంటే సరిపోదు కదక్కా.. ఆదిత్యకు కూడా ఉండాలి కదా అంటుంది. ఆదిత్య ఇంతకుముందులా ఇంట్లో ఉండడం లేదని, తనని పట్టించుకోవడం లేదని కమలకు చెప్తూ ఆందోళన చెందుతుంది సత్య. అంతలోనే దేవుడమ్మ వచ్చి ‘సత్యా.. మీరిద్దరూ అమెరికా వెళ్తారు. ఆ ఇంటికి వారసుడు వస్తాడు’ అని హామీ ఇస్తుంది.
ఆ తర్వాత రాధ స్కూల్‌కి వెళ్లి చిన్మయిని దేవి ఏది అని అడుగుతుంది. అక్క క్లాస్‌లో లేదమ్మా అని చెబుతుంది చిన్మయి. వేరే అమ్మాయిని అడగ్గా.. వాళ్ల నాయనతో వెళ్లిపోయిందని చెప్తుంది. వెంటనే రాధ ఆదిత్య దగ్గరకు పరుగెడతుంది. దేవి కనిపించట్లేదని చెప్పి కంగారు పడుతుంది. ‘అంటే నేను అనుకున్నట్టే జరిగిందన్నమాట’ అని ఆదిత్య అనగా.. అదేంటి పెనిమిటి అని ప్రశ్నిస్తుంది రాధ. ‘ఉదయం నేను స్కూల్‌కి వెళ్లినప్పుడు మా నాన్న వచ్చాడని చెప్పింది దేవి. అపుడు నేను దేవికి జీపీఎస్ ట్రాక్ ఉన్న వాచ్ ఇచ్చాను. దాంతో దేవి ఎక్కడుందో తెలిసిపోతుందని’ చెప్తాడు ఆదిత్య. నీ మీద నమ్మకంతో ఇంటికిపోతున్న పెనిమిటి. దేవి ఎక్కడుందో కనుక్కో..అంటుంది రాధ. వాడు దేవిని అడ్డుపెట్టుకుని మనల్ని భయపెట్టాలని చూస్తున్నాడు. వాడికి భయమెలా ఉంటుందో చూపిస్తే అప్పుడు దేవి జోలికి రాడని ధైర్యం చెబుతాడు ఆదిత్య.
రుక్మిణి ఫొటోలను చూసుకుంటూ బాధపడుతుంది దేవుడమ్మ. ‘ఏంటాంటి.. అక్క ఫోటోలని చూసి బాధపడుతున్నారు’ అని అనగా ‘బాధ కాక ఇంకేం మిగిలింది సత్య’ అంటూ ఎమోషనల్ అవుతుంది దేవుడమ్మ. రుక్మిణిని ఎప్పుడు చూస్తానా అని ఎదురుచూస్తున్నా. మనల్ని చూడాలని రుక్మిణికి అనిపించడం లేదా? ప్రతిరోజు రుక్మిణి ఈ రోజు కనిపిస్తుందా? అని ఆశపడుతున్నా.. అవును సత్యా ‘నాకు తెలియకుండా నేనెప్పుడైనా రుక్మిణిని బాధపెట్టానా? అని అడుగుతుంది. ‘మీరు అక్కని బాధపెట్టడడమేంటి’ అని సత్య అంటే ‘మరి ఎక్కడో ఒక దగ్గర ఉన్న రుక్మిణి మన దగ్గరికి ఎందుకు రావడం లేదు’ అంటూ కన్నీరు పెడుతుంది. అత్తమ్మా నువ్వైతే పరేషాన్ కాకు. మా రుక్కు ఏ జన్మల ఏ పుణ్యం చేసుకుందో నీ లాంటి అత్తమ్మ దొరికింది. ఇన్ని ఏళ్లయినా నా చెల్లిని మరిచిపోకుండా గుర్తుచేసుకుంటున్నారు అంటూ కమల ఎమోషనల్ అవుతుంది.
తండ్రిగా నటిస్తున్న తాగుబోతుకు సపరియలు చేస్తుంది దేవి. నేను వచ్చిన కదా.. నీకు త్వరగా నయమైపోతుంది. నువ్వేం పరేషాన్ కాకు అంటూ ధైర్యం చెబుతుంది. నువ్ ఎప్పుడూ నా దగ్గరే ఉండాలి. మనం ముగ్గురం కలిసే ఉండాలి అంటే నేనేం చేయాలి తల్లీ.. అంటూ యాక్షన్ చేస్తాడు ఆ వ్యక్తి. మరి దేవిని ఆదిత్య జీపీఎస్ ద్వారా వెతికి పట్టుకుంటాడా? లేకపోతే మాధవ్ కుట్రకు బలవుతాడా? అనేది తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..