జానకి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్తుంది. రాధతో ఇంట్లో నుంచి వెళ్లిపోమని సైగలు చేసి చెబుతుంది. కానీ రాధ మాత్రం ఈ స్థితిలో ఉన్న మిమ్మల్ని విడిచి ఇంట్లో నుంచి కాలు బయట పెట్టేదే లేదంటుంది. మరోవైపు సత్యకు ఆదిత్య మీద అనుమానం పెరుగుతుంది. ఇంటికి త్వరగా వచ్చావేంటని భర్తతో వెటకారంగా మాట్లాడుతుంది. ఆ తరువాత సెప్టెంబర్ 28 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
దేవితో చిన్మయి ఆదిత్య ఫ్యామిలి గురించి మంచి మాటలు చెబుతుంది. నువ్ ఆఫీసర్ అంకుల్ వాళ్లతో మాట్లాడాలని, సరదాగా గడపాలని తన మీద ఒట్టు వేయించుకుంటుంది. దాంతో నువ్ పరేషాన్ కాకు అక్క.. నేను అందరితో మంచిగ ఉంటానని మాటిస్తుంది దేవి. దాంతో రాధ, చిన్మయిలు ఆనందంతో ఉబ్బితబ్బిబైపోతారు. ఇదంతా చాటుగా గమనిస్తున్న మాధవ్ ఒకింత షాక్‌కు గురవుతాడు. నేను దేవిని ఆఫీసర్ కుటుంబానికి దూరం చేయాలనుకుంటే చిన్మయి ఎందుకు ఇలా చేస్తుంది.. అని అనుకుంటాడు. ఆ తర్వాత సీన్‌లో సత్య రెడీ అయి బయటికి వస్తుంటే దేవుడమ్మ ఎక్కడికీ అని అడుగుతుంది. జానకమ్మని ఒకసారి పలకరించి వస్తానని సత్య చెప్పగా.. దేవిని దగ్గరికి తీసుకుని బుజ్జగించి ఓదార్చమని అంటుంది దేవుడమ్మ.
సీన్ కట్ చేస్తే.. రాధ జానకికి మందులు వేస్తూ.. బాధపడకండని ధైర్యం ఇస్తుంది. అంతలోనే అక్కడికి వస్తుంది సత్య. రాధ చూసి సత్యను పిలుస్తుంది. సత్య జానకితో ‘మిమ్మల్ని ఇలా చూడడం బాధగా ఉంది ఆంటీ.. సారీ ఆంటీ.. హాస్పిటల్‌కి రాలేకపోయాను’ అని అంటుంది. తర్వాత రాధతో మాట్లాడతానని చెప్పి వంటగదిలోకి వెళ్తుంది. ముభావంగా ఉన్న రాధతో ఏంటక్కా అలా ఉన్నావ్. దేవిని అలా అన్నానని బాధగా ఉందా? అంటు ప్రశ్నిస్తుంది సత్య. అంతలోనే రాధకు ఆదిత్య ఫోన్ చేస్తాడు. అది చూసి కంగారుపడుతుంది రాధ. ‘ఏదో డిప్రెషన్‌లో దేవిని అలా అన్నాను అక్క. ఆదిత్య ప్రవర్తన ఏం బాలేదు. ఎప్పుడూ ఎవరి గురించో ఆలోచిస్తాడు. నాకు పిల్లలు లేరు. నువే నా స్థానంలో ఉంటే ఏం చేస్తావ్ అక్క. ఆదిత్యని అమెరికా తీసుకెళ్లాలంటే ఏదో ఒక శక్తి అడ్డు పడుతుంది. నలుగురు నన్ను గొడ్రాలిలా చూస్తున్నారు అక్క’ అంటూ ఎమోషనల్ అవుతుంది సత్య. తన బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియక తనలో తానే కుమిలిపోతున్నట్టు వెల్లడిస్తుంది. ‘మా అక్క బతికుంటే నన్ను ఇలా చూస్తూ వదిలేసేది కాదు’ అంటుంది. అపుడు రాధ నేను మీ అక్కలాంటిదాన్నే. నువ్ నీ పెనిమిటితో ఆనందంగా ఉంటావ్. నేను నీ అక్కలా మాటిస్తున్నాను’ అంటూ చేతిలో చేయి వేస్తుంది రాధ. అపుడే అటుగా వెళ్తున్న పిల్లలు సత్యను చూసి పిన్ని అంటూ పిలుస్తారు. దేవి మాత్రం కోపంగా వెళ్లిపోతుంది. సత్య వెళ్లి దేవిని బుజ్జగించి సారీ చెబుతుంది. నువ్ అవన్నీ మర్చిపోయి ఎప్పటిలాగే మా ఇంటికి రావాలని బతిలాడుతుంది. పిన్నిని బాధపెట్టకు దేవి అని చిన్మయి చెప్పగా సత్యతో చేతు కలుపుతుంది దేవి. దాంతో అందరూ సంబరపడిపోతారు.
ఆ తర్వాత సీన్‌లో ఆదిత్య, రాధలు ఎప్పటిలాగే బయట కలుస్తారు. సత్య ఏం మాట్లాడింది రుక్మిణి అని అడగ్గా.. ‘నాకొకటి సమజ్ అయితలేదు పెనిమిటి. సత్యవ్వ నన్ను రాధ అనుకుంటుందా.. రుక్మిణి అనుకుంటుందా.. సొంత అక్క లాగనే ఇంట్లో ముచ్చట్లన్నీ చెబుతుంది. ఇప్పుడు ఏంటంటే నావల్ల నీకు, సత్యవ్వకు దూరం పెరుగుతుందని పరేషాన్ అవుతుంది. కానీ నేను తన అక్కనని తెలుసా చెప్పు పెనిమిటి’ అని అడుగుతుంది ఆదిత్యని. అప్పుడు ‘నువ్వే రుక్మిణివని తనకు తెలుసు. చాలారోజుల వరకు మేం ఒకరికొకరం తెలియనట్లుగా ఉన్నాం. కానీ తర్వాత తెలిసింది. నువ్ ఇంటికి రా రుక్మిణి. దేవితో వస్తే అన్నీ అవే సర్దుకుంటాయి’ అంటాడు ఆదిత్య. ‘లేదు పెనిమిటి. నేను సత్యవ్వకు మాటిచ్చిన. తన జిందగిలోకి రానని చెప్పిన. నాకోసం నువ్ సత్యవ్వని బాధపెట్టకు పెనిమిటి. తనని మంచిగ చూసుకో’ అని చెప్పి అక్కడినుంచి వెళ్లిపోతుంది రుక్క. మరి ఆదిత్య ఏం చేస్తాడో తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..