ఆదిత్య, రుక్మిణిలు ఎప్పటిలాగానే రహస్యంగా కలుస్తారు. ‘నా బిడ్డతో నాన్నా అని పిలిపించుకోవాలన్న ఆశ పెరిగిపోతుంది రుక్మిణి.. దేవి ఇంట్లో వాళ్లందర్నీ వరుసలతో పిలుస్తుంది కానీ కన్న తండ్రినైన నేనే నాన్నా అని పిలిపించుకోలేకపోతున్నా. నా బిడ్డ నోరారా నాన్నా అని పిలిచే రోజు ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూస్తున్నా’ అంటూ ఎమోషనల్ అవుతాడు ఆదిత్య. నీ బిడ్డని నీకు అప్పగిస్తానని మాటిస్తుంది రుక్కు. మరోవైపు మాధవ్.. రాధ మాటలను గుర్తు చేసుకుంటుండగా.. దేవి, చిన్మయిలు వచ్చి దేవుడమ్మ ఇచ్చిన గిఫ్ట్‌లను చూపిస్తూ పొగడుతుంటారు. అంతలోనే రాధ కనిపిస్తుంది. ఫంక్షన్‌కు ఎందుకు రాలేదంటూ అందరూ అడిగారని చెబుతుంది దేవి. పిల్లలిద్దరినీ పంపించి రాధ మాధవ్ దగ్గరకు వస్తుంది. ‘నువ్ ఏమో చేయలేని కతలు పడినా.. అయినా గానీ నా బిడ్డకు ఆ ఇంటి మీద ప్రేమ తగ్గలేదని..’ అంటూ క్లాస్ పీకుతుంది మాధవ్‌ని. దానికి మాధవ్ కూడా ఏమాత్రం జంకకుండా ఘూటుగానే రిప్లై ఇచ్చి అక్కడనుంచి వెళ్లిపోతాడు.
మరుసటి రోజు ఉదయం మాధవ్ భక్తి శ్రద్ధలతో పూజలు చేసి దేవుడికి హారతి ఇస్తాడు. అది చూసి జానకి ఆశ్చర్యపోతుంది. అందరినీ పిలిచి హారతి ఇస్తాడు మాధవ్. ‘మాధవా.. నువ్వేనా? ఎప్పుడూ లేనిది కొత్తగా పూజ చేశావ్?’ అని జానకి అడగ్గా.. నేను కొత్త జీవితం మొదలుపెట్టాలనుకుంటున్నాను. దానికి ఓ పరీక్ష రాయాలి. అందుకే ఇలా చేస్తున్నా అంటాడు. ఏం పరీక్ష.. ఏం చేయాలనుకుంటున్నావ్.. మాకు కూడా చెప్పురా అని జానకి అడగ్గా.. చెప్పేది అయితే చెప్తాం కానీ.. అంటూ ఏవో ఏవో మాట్లాడతాడు మాధవ్. పిల్లలు కూడా నిలదీయగా… సరిగ్గా సమాధానం చెప్పకుండా డొంక తిరుగుడు సమాధానమిస్తాడు. పిల్లలు టిఫిస్ చేస్తుండగా.. మాధవ్ కూడా తల్లిని టిఫిన్ తినిపించమని అడుగుతాడు. పరీక్ష రాసేది ఈ రోజేనంటూ మళ్లీ అందర్నీ తికమక పెడతాడు. రాధని ఈ రోజు ఏదో చేస్తానని బ్లాక్‌మెయిల్ చేస్తాడు మాధవ్.
సీన్‌కట్ చేస్తే.. టిఫిన్ చేస్తున్న ఆదిత్యతో సత్య మాట్లాడూతూ.. ‘నువ్వు నిన్న ఫంక్షన్‌లో ఎవరికోసమో ఎదురుచూస్తున్నావ్’ అని ప్రశ్నిస్తుంది. అదేం లేదు అని ఆదిత్య చెప్తుండగా.. ఫోన్ మోగుతుంది. ఇంపార్టెంట్ కాల్ అంటూ ఆదిత్య బయటికి వస్తాడు. దాంతో సత్య బాధపడుతుంది. ఫోన్ లిఫ్ట్ చేసిన ఆదిత్య చెప్పు రుక్మిణి అంటూ మాట్లాడతాడు. అప్పుడు రుక్కు ఉదయం నుంచి మాధవ్ పడిన కతలు అన్నీ వివరిస్తుంది. ‘అంటే వాడు మళ్లీ ఏదో ప్రయత్నం చేస్తున్నాడు. నువ్ జాగ్రత్తగా ఉండు రుక్మిణి’ అంటాడు ఆదిత్య. ‘సారూ సారూ.. అని పిలిచేదాన్ని. వాడు అనడానికి మనసు వస్తలేదు. కానీ ఆ సారు ఏం చేసినా నేను భయపడా. భయపడి నీకు ఫోన్ చేయలే పెనిమిటి. జరిగింది నీకు చెప్పడానికి ఫోన్ చేసిన’ అంటూ ధైర్యంగా చెబుతుంది రాధ. అది విని ఆదిత్య ‘నువ్ అలా ధైర్యంగా ఉంటేనే నాకు కూడా ధైర్యంగా ఉంటుంది. నేను ఓ నిర్ణయానికి వచ్చాను రుక్మిణి. దేవి మన ఇంటికి వచ్చి అమ్మ వాళ్లతో నాతో ఎంత ఆనందంగా ఉందో చూశావ్ కదా.. అలాంటపుడు ఇంకా పరాయి దానిలా ఉంచాల్సిన అవసరం ఏముంది. అందుకే దేవి నా కూతురని చెప్పేస్తాను. అందరి ప్రేమకు దేవి దూరం అవుతుంది. అందుకే దేవి నా కూతురన్న నిజం చెప్పేస్తా. ఒకటి రెండ్రోజుల్లో నిజం చెప్పేస్తా.. అంటాడు. దానికి రుక్కు కూడా సరేననడంతో ఫోన్ కట్ చేస్తాడు ఆదిత్య.
ఆ తర్వాత సీన్‌లో ఒంటరిగా ఉండి దిగులుపడుతున్న రాధ దగ్గరికి వెళ్తుంది జానకి. ‘నిన్న బారసాల వేడుక దేవుడమ్మ ఇంట్లో ఘనంగా జరిగాయి. నీ కోడలు రాలేదేంటి.. ఎందుకు మొహం చాటేస్తుంది అని అడిగిందమ్మా’ అంటూ రాధని అడుగుతుంది. నేను వాళ్లకే కాదు ప్రపంచానికే మొహం చాటేసుకుని బతుకుతున్నానని అంటుంది రాధ. నేను మాత్రం ఏం చేస్తా.. నాకు ఏడికి పోబుద్ధి కాదని బాధగా చెబుతుంది. మనల్ని అభిమానించే వాళ్ల దగ్గరికి వెళ్లాలమ్మా.. ఆమె అంతటి స్థాయిలో ఉండి కూడా నీ కోడలు రాలేదమ్మా.. అని గుర్తుచేస్తే నాకు కూడా బాధగా అనిపించిందని చెబుతుంది జానకి. అసలు నిజం చెప్పలేక తనలో తానే కుమిలి పోతుంది రాధ. ‘కానీ ఒక్కటి. ఎన్ని రోజులని ఇలా ఒంటరిగా ఉంటావ్. నలుగురిలో తిరగాలి. నలుగురితో మాట్లాడాలి’ అని హితవు చెబుతుంది.
నా అనుకునే వాళ్లను కాదనుకుని వచ్చాను. నలుగురిలో తిరగలేను అని రాధ చెబుతుండగా… జానకి ఎందుకు? ఏమైందమ్మా? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. దానికి రాధ.. ఎవరో ఏమో అనుకుంటారని నేనైతే ఏం చేయ. నాకు నలుగురిలోకి రావాలని లేదు. అందుకే ముందే చెప్పిన నన్ను ఇబ్బంది పెట్టకూడదని’ అంటుంది కోపంగా రాధ. ఇప్పుడు కూడా నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదమ్మా.. ఆఫీసర్ గారి తల్లి. ఆవిడ కూడా నిన్ను చూడాలని అంత తాపత్రయపడుతుంటే ఎందుకు అనిపించకూడదు అని గట్టిగానే అడుగుతుంది జానకి. మరి జానకి పదే పదే అడగడం వల్ల రాధ అసలు నిజం చెబుతుందా? అనేది తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..