ఆదిత్య మీద సత్యకు అనుమానం రోజురోజుకూ పెరుగుతూనే ఉంటుంది. కానీ దేవుడమ్మ ఇద్దరినీ దగ్గర చేయాలనుకుంటుంది. మరోవైపు మాధవ్ ప్రవర్తనను కనిపెడుతూనే ఉంది జానకి. రాధను ఏం చేస్తాడో ఏమోనని భయపడిపోతుంది. అందుకే నగలు తీసి రాధకు ఇచ్చి ఇక్కడినుంచి వెళ్లిపోమ్మ అని చెబుతుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 24 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
ఇక నుంచి అయినా నీకు నచ్చినట్టు బతుకు. నాకు అంత తెలుసమ్మా.. ఆ ఆఫీసర్ నీ భర్త కాదు కదా అంటుంది జానకి. దాంతో రాధ ఒక్కసారిగా షాకవుతుంది. ఇన్నిరోజుల నుంచి ఎందుకు అన్ని బాధలుపడ్డావ్ అని అడుగుతుంది. మమ్మల్ని క్షమించమ్మా.. అని వేడుకుంటుంది జానకి. ‘మా గురించి నువ్వేం ఆలోచించకు. చిన్మయి గురించి కూడా ఆలోచించకు. దేవిని తీసుకుని వెళ్లి ఒక్కడో ఒక చోట ఆనందంగా ఉండమ్మా’ అంటుంది ఎమోషనల్‌గా జానకి. వెళ్లిపోతా కానీ నాకు నగలు వద్దు అంటుంది రాధ. డబ్బులు లేవు కదమ్మా తీసుకెళ్లు అని జానకి ఎంత చెప్పినా రాధ మాటవినదు. మళ్లీ జానకే.. దేవికి ఏం సమాధానం చెప్తావమ్మా.. నా కొడుకునే తన తండ్రి అనుకుంటుంది కదా అని అడగ్గా.. ఆ బాధేం అవసరం లేదు. మాధవ్ సార్ దేవికి తను అసలు తండ్రి కాదని చెప్పిన విషయం రాధ చెబుతుంది. ‘మీరు చిన్మయిని మంచిగ చూసుకుంటరు. నాకు ఇక ఏ బాధ లేదు. మీ బిడ్డ తప్పు చేసిండని తెలిసి నన్ను ఇంట్ల నుంచి పంపిస్తున్నారు చూడు. మీకంటే మంచివాళ్లు ఎవరుంటారు’ అని పొగడుతుంది రాధ. జానకిని గుండెలకు హత్తుకుని కంటతడి పెడుతుంది.
సీన్ కట్ చేస్తే.. మాధవ్ తప్పు చేస్తున్నాడని తెలిసి పాలల్లో మాత్రలు కలిపి ఇస్తుంది జానకి. అపుడు దేవిని, రాధని ఇంట్లో నుంచి పంపించాలని అనుకుంటుంది. మాధవ్ నుంచి రాధని కాపాడాలని అనుకుంటుంది. తల్లిగా బిడ్డకు ఇలాంటి పనిచేయాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు అంటూ బాధపడుతుంది మనసులో. మాధవకు పాలు ఇవ్వగా.. నువ్ తీసుకొచ్చావేంటమ్మా అని అడుగుతాడు మాధవ్. ప్రేమగా పాలు తీసుకొస్తే తప్పేంటి రా అంటుంది సర్దుకుంటూ జానకి. సరేనమ్మా అని నేను తాగుతా.. అని చెప్పి పంపిస్తాడు మాధవ్.
నిద్రమాత్రలు కలిపిన పాలను తాగకుండా పక్కకు పెడతాడు మాధవ్. నీ కొడుకు మీద అనుమానం వచ్చిందని నాకు తెలుసమ్మా.. కానీ రాధని ఎలాగైనా శ్రీశైలం తీసుకెళ్లి మెడలో తాళి కడతా అనుకుంటాడు మాదవ్. పాలు తాగి మత్తులో ఉన్నాడేమో చూసి వస్తానని వెళ్తుంది జానకి. కానీ పాల గ్లాసు అక్కడే కనిపిస్తుంది. వీడు పాలుతాగలేదు.. అయితే వచ్చేలోపు రాధని పంపించాలి అనుకుంటుంది జానకి. మాధవ్ డ్రెస్సు అల్మారిలో పెడుతుండగా తాళిబొట్టు, లగ్నపత్రిక జానకి కంటపడతాయి. అది చూసి షాకవుతుంది. మాధవ్ చేసిన వెకిలి చేష్టలు గుర్తుతెచ్చుకుని బాధపడుతుంది. తల్లిని చూసి చేతికర్రతో నటిస్తూ వస్తాడు మాధవ్. ఏంటమ్మా ఏం చేస్తున్నావ్ అని అడగ్గా.. నీలో ఇంకో మనిషి కూడా ఉన్నాడా. ఉన్నట్టుండి శ్రీశైలం ఎందుకు వెళ్తూన్నావ్ రా అని అడిగినా మాధవ్ అసలు విషయం చెప్పకపోగా దబాయిస్తాడు జానకిని. తాళిబొట్టు చూపించి ఇదేంటిరా అని అడగ్గా.. నీళ్లు నములుతాడు మాధవ్. ‘నీ మనసులో ఇంత దుర్మార్గమైన ఆలోచన ఉందా. రాధ నీ బిడ్డకు ప్రాణం పోసి నిన్ను మనిషిని చేసింది. రాధకు ఈ ఇంటితో ఏ సంబంధం లేకపోయినా తను ఈ ఇంటి గౌరవం. ఆ రోజు రాధ నీ గురించి ఆలోచించకపోతే నువ్, నీ బిడ్డ ఏమైపోయేవారు. రాధని శ్రీశైలం తీసుకెళ్లి ఏం చేద్దామనుకున్నావ్’ అని వార్నింగ్ ఇస్తుంది జానకి. ఈ విషయాన్ని ఇక్కడే మరచిపోమ్మా.. అంటాడు మాధవ్. ఇంకా ఊరుకునేది లేదు మీ నాన్నతో చెప్తానంటుంది జానకి. మా ముందు మంచిగా నటిస్తూ రాధని ఇన్ని రోజుల నుంచి ఇబ్బంది పెడుతున్నావా? అని నిలదీస్తుంది. అమ్మా అది నా కల. నాన్నకు చెప్పొద్దు అని జానకిని అడ్డుకుంటాడు మాదవ్. వద్దమ్మా అన్నా వినకుండా జానకి గదిలో నుంచి లగ్నపత్రిక, తాళి తీసుకుని వెళ్తుంది. దాంతో మాధవ్ కళ్లెర్రజేసి ఎలాగైనా విషయం రాధకు తెలియనివ్వద్దని అనుకుంటాడు. తల్లి అని కూడా చూడకుండా జానకి నోరు నొక్కి మెట్ల మీది నుంచి కిందకు తోసేస్తాడు. మరి జానకి ఎలాగైనా విషయం బయటికి చెబుతుందా? రాధ ఇంట్లో నుంచి వెళ్లనుందా? తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..