ఎప్పటిలాగే రాధని ఇబ్బందిపెడతాడు మాధవ. అదంతా ఆదిత్యకి తెలిసి కారులో వెళ్లి రహస్యంగా రాధని కలుస్తాడు. అయితే.. తన భర్త రోజు అక్కని కలుస్తున్నాడేమోనని సత్యకి అనుమానం వస్తుంది. బాషాకూడా అదే అంటాడు. కమల అదేం లేదని అంటుంది. అనంతరం కమలకు పురిటి నొప్పులు రాగా ఆసుపత్రిలో చేరుస్తారు. ఆమెకి పండంటి కూతురు పుడుతుంది. దాంతో ఆదిత్య, సత్య, దేవుడమ్మతో పాటు అందరూ అక్కడి వెళ్లి మురిసిపోతారు. ఆ విషయం రాధకి తెలిసి తల్లితో కలిసి వెళుతుంది. కానీ.. అత్త మామా ఉండడంతో చాటు కిటికిలోంచి అక్క కూతురుని చూస్తుంటుంది. ఆ తర్వాత ఆగస్టు 19 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
అక్క కూతురిని ఎత్తుకున్నట్లు కలగంటూ ఉంటుంది రాధ. అప్పుడు..’చూశారా.. పిన్నమ్మ దగ్గరికి వెళ్లగానే ఏడుపు ఆపేసింది. అంటే.. ఈ పాప అప్పుడే పిన్నమ్మ పార్టీలో చేరిపోయిందన్న మాట’ అంటుంది దేవుడమ్మ. అది నిజమేనని వత్తాసు పలుకుతాడు ఆమె భర్త. ఆదిత్య, సత్య నవ్వుతూ అది చూస్తుంటారు. అప్పుడే ఇమేజినేషన్ నుంచి బయటికి వస్తుంది. అప్పుడు భాగ్యమ్మ చేతిలో తన మనవరాలుని ఎత్తుకుని లాలిస్తూ ఉంటుంది. అప్పుడే.. ‘అత్తమ్మ.. నీ కూతురిని వదిలేసి యాడికి పోయినావు. కమల ఎన్ని సార్లు అడిగిందో తెలుసా. అయినా మేము ఎవ్వరం చెప్పకుండా నీకేలా తెలిసింది. షిదా దవాఖానాకు వచ్చేశావు’ అని అడుగుతాడు బాషా. దాంతో తత్తరపాడుతుంది భాగ్యమ్మ. అది గమనించిన.. ఊర్లో మాట్లాడుకుంటుంటే తెలిసి ఉంటుందిలే అని కవర్ చేస్తాడు ఆదిత్య. దాంతో అవును.. అదే నిజం.. అందుకే సీదా ఇక్కడికే వచ్చినా అని అంటుంది భాగ్యమ్మ. ఇదంతా కిటికీలోంచి చూస్తూనే ఉంటుంది రాధ. అనంతరం అందరూ మాటల్లో ఉండగా.. పాపని రాధకి చూపించడానికి మెల్లగా కిటికీ దగ్గరకి తీసుకెళుతుంది భాగ్యమ్మ. రాధ ప్రేమగా అక్క కూతురిని ముట్టుకోబోతుండగా.. అందరూ ఒక్కసారిగా అటు చూడడంతో పక్కకు దాచుకుంటుంది. ఇప్పుడే పుట్టిన బిడ్డమీద ఎండపడితే ఎలాగా అని అంటుంది దేవుడమ్మ. ఏం లేదమ్మా పాపకి ప్రపంచం చూపిద్దామని తీసుకొచ్చిన అని ఏదో కవర్ చేస్తుంది భాగ్యమ్మా.
అనంతరం రాధ పాలు తీసుకుని తన గదికి వెళుతుంటుంది. అప్పుడే హాలు కూర్చుని ఉన్న మాధవని పట్టించుకోకుండా వెళుతుంది. అది చూసి.. ‘నేను ఇక్కడ చెక్ డ్యామ్‌లాగా ఉంటే.. పట్టించుకోకుండా వెళ్లిపోతున్నావేంటి’ అని వెటకారంగా మాట్లాడుతాడు. అప్పుడు.. ‘వరదొస్తే నదులు పొంగి డ్యామ్‌లే మునిగిపోతాయి. చెక్ డ్యామ్‌లేంతా’ అని రాధ కౌంటర్ ఇస్తుంది. నీకు నేనంటే కొంచెం కూడా భయం లేదా అని అడుగుతాడు మాధవ. దానికి.. ‘నేనేందుకు భయపడాలే. నేను ఏం తప్పు చేయలేదు కదా.. అయినా ఎవరి సపోర్టు లేకుండా బతికిదాన్ని.. ఊరంతా దేవతలా కొలిచే దేవుడమ్మ కోడలిని.. ఆఫిసర్ సార్ ఆదిత్య పెళ్లాన్ని.. నీలాంటోళ్లకి నేను భయపడను’ అని అదే స్థాయిలో రిప్లై ఇస్తుంది రాధ. దాంతో.. ‘మొన్న నేను ఇచ్చిన షాక్‌కి రిటర్న్‌గా ఏం చేయట్లేదా. అదే చాలారోజులు గడిచిపోయాయి కదా.. దేవమ్మని వాళ్ల నాన్న దగ్గరకి పంపడానికి ఏర్పాట్లు చేయట్లేదా’ అని అడుగుతాడు. దాంతో.. రాధ కోపంగా.. ‘ఏం చేయాలో.. ఎప్పుడు చేయాలో నాకు, నా పెనిమిటికి తెలుసు. నువ్వేన్ని చేసిన దేవమ్మకి నా పెనిమిటే నాన్న అని దేవుడెప్పుడో రాసిపెట్టిండు’ అని కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
అనంతరం కమల కూతురిని ఆడిస్తూ సంతోషపడుతుంటుంది సత్య. అది ఓ పక్కగా నిలుచుని చూస్తూ.. కమల కూతురికి మనమే బారసాల చేయాలని తన భర్తతో అంటూ ఉంటుంది దేవుడమ్మ. ఆయన కూడా సరేనంటాడు. సత్యని అలా చూస్తూ బాధపడుతుంది దేవుడమ్మ. పెళ్లై ఇన్నేళైన పిల్లలు లేకపోతే ఎవరికైనా ఎలా ఉంటుంది కదా అని తల్లడిల్లిపోతారు అత్తమామ ఇద్దరూ..
ఆ తర్వాత దేవి తన తండ్రి గురించి ఇంతకుముందు అన్న మాటల గురించి తలచుకుని బాధపడిపోతుంటుంది రాధ. అది చూసిన భాగ్యమ్మ కూతురి పక్కన కూర్చుని ఏం సోచాయిస్తున్నావ్ రుక్కవ్వా అని అడుగుతుంది. దేవమ్మ, ఆదిత్య గురించి ఆలోచిస్తున్నానని చెబుతుంది రాధ. ‘నీ బాధ నీ బిడ్డా గురించి అయితే.. నా బాధ నా బిడ్డల గురించి. రేపు కమల పాపకి బారసాల చేస్తున్నారు. అందరూ ఉంటారు కానీ.. నువ్వు ఉండవు కదా.. మీ ముగ్గురిని ఒక్క చోట చూసి చాలా ఏండ్లు అయ్యింది. నువ్వు కూడా రావొచ్చు కదా బిడ్డా. నువ్వు రావానుకుంటే ఎలాగైనా వస్తావు. సోచాయించు బిడ్డా’ అని బ్రతిమిలాడుతుంది భాగ్యమ్మ.
తెల్లారగానే.. జానకి మనవరాళ్లు ఇద్దరికీ తినిపిస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన మాధవ.. నాకు గోరుముద్దలు తినిపించు అని అడుగుతాడు. దాంతో నీకెందుకురా అని అడుగుతుంది జానకి. దాంతో.. ‘నీ గోరుముద్ద నన్ను ప్రతిసారి గెలిపించింది. ఇప్పుడు కూడా నాకో పరీక్ష ఉంది. దాంట్లో గెలవాలనుకుంటున్నా’ అని చెబుతాడు. నీకేం పరీక్షలున్నాయ్ నాయనా అని అమాయకంగా అడగుతుంది దేవి. దానికి.. మీకు పుస్తకాల గురించి పరీక్షలు ఉంటాయి. కానీ మాకు మాత్రం జీవితానికి సంబంధించి పరీక్షలు ఉంటాయని చెబుతాడు మాధవ. దాంతో నాయనా ఆశపడుతున్నాడు కదా.. పాసవ్వాలని ఆశీర్వాదించి ఓ ముద్ద పెట్టామని అంటుంది దేవి. ఇదంతా పక్కనే ఉండి చూస్తున్న రాధ.. ఈ మాధవసారు ఏం కతలు పడుతుండో ఏమోనని టెన్షన్ పడుతుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.