తాగుబోతుగా నటిస్తున్న వ్యక్తినే తండ్రని నమ్మి అతడి వెంట వెళ్తుంది దేవి. రాధేమో దేవి కనబడట్లేదని కంగారు పడుతుంది. మరోవైపు కోడలు రుక్మిణిని తలుచుకుంటూ బాధపడుతుంది దేవుడమ్మ. ఆదిత్యని ఎలాగైనా అమెరికా పంపిస్తానని మాటిస్తుంది సత్యకు. ఆ తర్వాత సెప్టెంబరు 1 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం.
జ్వరం వచ్చిందంటే నమ్మి తండ్రితో వెళ్లి అతడికి సేవలు చేస్తుంది దేవి. మనం అందరం కలిసి ఉండాలి. మీరు నాతోనే ఉండాలంటే ఏం చేయాలని అడుగుతాడు ఆ వ్యక్తి. అది చూసి దేవి బాధపడుతుంది. మరోవైపు దేవిని కిడ్నాప్ చేయించానని.. ఆదిత్య, రాధ వెతుకుతుంటారని మనసులో సంతోషంగా ఫీల్ అవుతాడు మాధవ. దేవి కనబడట్లేదంటూ జానకి కంగారుగా వచ్చి చెప్పినా మాధవ్ పట్టించుకోడు. దేవుడమ్మ ఇంటికి ఏమైనా వెళ్లిందేమోనని అక్కడికి ఫోన్ చేస్తుంది జానకి. ‘మా దేవి మీ ఇంటికి ఏమైనా వచ్చిందా? అని అడుగుతుంది’. లేదు రాలేదని దేవుడమ్మ చెబుతుంది. దాంతో ఇద్దరూ కంగారు పడుతారు. కనిపించగానే తనకి ఫోన్ చేయమని అంటుంది దేవుడమ్మ.
సత్య దగ్గరికి వెళ్లి మాధవ్ గురించి అడుగుతుంది దేవుడమ్మ. దేవి కనిపించట్లేదని చెప్పడంతో సత్య కూడా ఆందోళన చెందుతుంది. దేవిని తలుచుకుంటూ ఏమై ఉంటుందోనని బాధపడిపోతారు అత్తా, కోడళ్లు. ‘పాపం.. ఇంట్లో అక్క కంగారు పడుతుందేమో’ అని సత్య అనగా.. ఆ రాధకి అంత అజాగ్రత్త ఏంటో అంటుంది దేవుడమ్మ. వెంటనే ఆదిత్యకు ఫోన్ చేసి విషయం చెబుతుంది దేవుడమ్మ. మరోవైపు దేవితో ఆ తాగుబోతు వ్యక్తి కట్టుకథలన్నీ చెబుతూ నటిస్తుంటాడు. అంతలోనే డోర్ పగలగొట్టి అక్కడకు వస్తారు ఆదిత్య, రాధ. ఆ తాగుబోతు వ్యక్తిని చెడమడా కొట్టి నిజం చెప్పమంటాడు ఆదిత్య. నీతో ఇలా చేయిస్తున్నది ఎవరూ అని అడగ్గా.. అసలు నిజం చెప్తాడు కానీ తెలివిగా మాధవ్ పేరు బయటపెట్టడు ఆ తాగుబోతు. డబ్బుకు ఆశపడి నేనే ఆ బిడ్డకు దగ్గరయ్యానని చెప్తాడు. అది విని షాక్ అవుతుంది దేవి. మరి మా నాయన ఎవరో చెప్పమని మళ్లీ నిలదీస్తుంది దేవి. ముందు ముందు తెలుస్తుంది మీ నాయన ఎవరో అని రాధ చెప్పగా.. అసలు మా నాయన ఉన్నాడా? పోయాడా? అంటుంది దేవి బాధపడుతూ. దానికి దేవి మీదకు కోపంగా చేతు ఎత్తుతుంది రాధ. అంతలోనే ఆదిత్య అమ్మా దేవి.. మీ నాన్నని.. అని అంటుండగానే దేవి కళ్లు తిరిగి పడిపోతుంది.
సీన్ కట్ చేస్తే.. దేవుడమ్మ, సత్య దేవి గురించి బాధపడుతుండగా ఆదిత్య వస్తాడు ఇంటికి. దేవి కనిపించిందా? ఎక్కడుంది? ఎలా ఉంది? అని ప్రశ్నల వర్షం కురిపిస్తుంది దేవుడమ్మ. ‘అమ్మా.. దేవి గురించి కంగారుపడనవసరం లేదు. ఇంట్లోనే ఉంది ’ అని చెబుతాడు ఆదిత్య. దాంతో సత్యతోపాటు దేవుడమ్మ కూడా హ్యాపీగా ఫీలవుతారు. మాధవ్ పిల్లల విషయంలో అలా అజాగ్రత్తగా ఎలా ఉంటాడని కోప్పడుతుంది. మరోవైపు దేవి జ్వరంతో ఉంటుంది. రాధ బిడ్డకి మాత్రలు వేసి పడుకోబెడుతుంది. దేవిని అలా చూసి మనసులోనే కుంగిపోతుంది రాధ. ‘నా వల్లనే నీకు ఇన్ని బాధలు. మీ నాయన ఎవరో చెప్తే నీకు బాగనే ఉంటది కానీ ఆ తర్వాత నుంచి నాకే మస్తు కష్టాలు మొదలువుతాయి.. నువ్ అడిగే ప్రశ్నలకు నా దగ్గర సమాధానాలు ఉండవు. అందుకే ధైర్యం చేసి నీకు చెప్పకుండా ఇట్ల ఆగమవుతున్నా. అట్లని చెప్పకుండా ఉండను బిడ్డ. నువ్ ఇట్ల ఆగమవుతుంటే ఎన్ని దినాలని చూస్తూ ఉంటా’ అని దేవిని ఉద్దేశించి ఎమోషనల్ అవుతుంది రాధ. మరి అసలు నిజం దేవికి చెప్తేస్తారా? అన్న సస్పెన్స్‌కు తెర పడాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..