పోటీలో గెలిచిన దేవిని రెడీ చేస్తుంది చిన్మయి. ఎందుకుని అడగ్గా.. దేవుడమ్మ ఇంటికి పంపిస్తున్నానని చెబుతుంది. దాంతో మాధవకు షాక్ తగులుతుంది. మరోవైపు సత్యని బయటికి తీసుకెళ్లడానికి రెడీ అవుతాడు ఆదిత్య. అంతలోనే అక్కడికి వెళ్తుంది దేవి. మాధవ్ చేస్తున్న పాడుపనులు జానకి కంటపడతాయి. దాంతో కొడుకుని లాగి పెట్టి కొడుతుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 17 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
కరాటేలో గెలిచిన దేవిని అభినందిస్తాడు ఆదిత్య. సత్యతో షికారుకు వెళ్లే విషయం కూడా మరిచిపోయి దేవికోసం బయటికెళ్లి కేక్ తీసుకొస్తాడు. అందర్నీ పిలిచి ఆ హ్యీపీ మూమెంట్‌ని సెలెబ్రెట్ చేసుకుంటారు. రాజమ్మ, కమల అందరూ దేవిని పొగడతారు. ‘నువ్ కప్పు గెలిస్తే నీకు పెద్ద పార్టీ ఇస్తా’ అంటాడు ఆదిత్య. చాక్లెట్లు, కేక్ ఇచ్చి ఇంకేం కావాలమ్మా అంటాడు. ‘ఆదిత్యా.. మనం బయటికి వెళ్దామనుకున్నాం కదా.. ఇప్పుడైనా వెళ్దామా?’ అని అడుగుతుంది సత్య. ఇప్పుడెలా వెళ్తాం సత్య. దేవికి డబుల్ ప్రమోషన్ వచ్చింది. అందరం కలిసి ఇక్కడే భోజనం చేద్దాం. నీకేం కావాలో చెప్పు అంటాడు. ‘నాకేం వద్దు’ అంటూ అరుస్తుంది సత్య. ఇపుడేమైందని అందరూ అడగ్గా.. ‘చాలా రోజుల తర్వాత ఆదిత్య బయటికి వెళ్దాం అన్నాడు. తీరా వెళ్లే టైంకి ఇది వచ్చేసింది. మా ఇద్దరి సంతోషానికి ప్రతిసారి అడ్డు వస్తుంది. ఎన్ని రోజులని భరించాలి. దాన్ని చూస్తే ఆదిత్య అన్నీ మరిచిపోతాడు’ అంటూ కోపంతో ఊగిపోతుంది సత్య. ఏం మాట్లాడుతున్నావ్ సత్య అనగా నిజమే మాట్లాడుతున్నాని అంటుంది సత్య. అంతేకాకుండా దేవి వల్ల తను పడ్డ బాధనంతా వెల్లడిస్తుంది. ఎవరి బిడ్డ కోసమో ఎన్నాళ్లు నా భర్తకు దూరంగా ఉండాలి అని నిలదీస్తుంది ఆదిత్యని. దాంతో ‘నోరు మూయి’ సత్య. అర్థం పర్థం లేకుండా మాట్లాడకు.. అని కోపంగా అరుస్తాడు ఆదిత్య. నీతో మాట్లాడాలని దానికి ఉండదా అంటుంది కమల, రాజమ్మలు. దేవి వచ్చిందంటేం నువ్ సత్యనే కాదు. మీ అమ్మ, నాయనలనే మర్చిపోతున్నావ్ అని చెబుతుంది కమల. నా బాధ ఆదిత్యకు ఎప్పటికీ అర్థం కాదనీ, అంతా కర్మ అనీ ఏడుస్తూ వెళ్తుంది సత్య.
ఆ తర్వాత సీన్‌లో రాధను జాలిగా చూస్తుంది జానకి. దగ్గరికి వెళ్లి నువ్ ఇంతకాలం ఎందుకు ముభావంగా ఉంటున్నావో నాకు అర్థం కాలేదు. నా బిడ్డ వల్లనే బాధపడతున్నావని నాకు ఈ రోజే అర్థమైంది అంటూ ఎమోషనల్ అవుతుంది జానకి. ఇపుడు అర్థమైనా ఏం చేయలేమని అంటుంది రాధ. నన్ను క్షమించు రాధ. ఇప్పటివరకు నేనేం చేయలేకపోయాను. కానీ వదిలిపెట్టను. తప్పు చేసింది నా బిడ్డే అయినా క్షమించను. పరాయి ఆడపిల్లను సాధించి, వేధించే వాడు నా కన్న బిడ్డ అయినా సరే చూస్తూ ఊరుకోను. ఈ ఇంటి కోసం నువ్ చాలా చేశావ్. అలాంటిది నీతో ఇంత నీచంగా ప్రవర్తిస్తాడు. నీకు ఇష్టం లేకుండా ఒక్క క్షణం కూడా ఉండకు. కానీ వెళ్లేముందు ఒక్క నిమిషం ఆలోచించు వాడు చేసిన తప్పుకు చిన్మయికి శిక్ష వేస్తావా? ఇంత జరిగాక కూడా ఈ ఇంట్లో ఎలా ఉండమంటావ్? అని అంటావా. ఎవరి గురించి ఆలోచించక పోయినా చిన్మయి గురించి ఆలోచించమ్మా.. అని ఎమోషనల్ అవుతుంది జానకి. ఇదంతా దొంగచాటుగా వింటాడు మాధవ. పరిస్థితి చేజారిపోయిందని.. ఇంట్లో కూడా రాధకు సపోర్ట్ మొదలైందని ఆందోళన చెందుతాడు.
సీన్ కట్ చేస్తే.. సత్య మాటలకు హర్ట్ అయిన దేవి ఇంట్లో నుంచి ఏడుస్తూ వచ్చేస్తుంది. దేవిని బతిలాడుతూ వెంట వస్తాడు ఆదిత్య. ఇక నుంచి నేను రాను ఈ ఇంటికి. ఇదే ఆఖరి సారి అని చెప్పేస్తుంది దేవి. నేను నీ దగ్గరికి రాను, నువ్ నా దగ్గరికి రాకు అంటుంది. మీ పిన్నమ్మ కోపం నా మీద కానీ నీ మీద కాదమ్మా.. అని నచ్చచెప్పే ప్రయత్నం చేస్తాడు ఆదిత్య. అయినా దేవి వినదు. అంతలోనే మాధవ్ వస్తాడు అక్కడికి. నాయనా.. అంటూ వెళ్లి మన ఇంటికి పోదాం పద. ఇక్కడ నేను ఒక్క నిమిషం కూడా ఉండను అంటుంది దేవి. ‘ఏంటి ఆఫీసర్ నన్ను కాదనుకుని ఇక్కడికే వచ్చే దేవిని ఏం చేశారేంటి’ అంటాడు మాధవ్. అంతలోనే సత్యవచ్చి ‘ఒక్క నిమిషం. ఎందుకు బావగారు మీకు పిల్లలంటే అంత ఇష్టం. అయినా దేవిని ఎందుకు పదేపదే మా ఇంటికి పంపిస్తున్నారు’ అంటుంది మాధవతో. నేనేం పంపట్లేదు. ఈ ఆఫీసరే స్కూల్‌కు వస్తాడు. ఇంటికి వస్తాడు. వద్దంటే అక్కడ మీ అక్క బాధపడుతుంది అంటాడు. ‘నేను చెప్తున్న బావగారు. ఇంకెప్పుడు దేవి ఈ ఇంటికి రాకూడదు. తన వల్ల నా సంతోషం నాకు దూరమవుతుంది. దేవి ఈ ఇంటికి రావడం ఇదే ఆఖరిసారి అవాలి’ అని తెగేసి చెప్తుంది సత్య. ఆ తర్వాత ఏం జరగనుందో తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..