సత్యను ఇబ్బంది పెడుతున్న విషయం తెలిసి దేవుడమ్మ ఆదిత్యకు క్లాస్ పీకుతుంది. సత్యని దగ్గరకు తీసుకుని ప్రేమగా మాట్లాడమని చెబుతుంది. దాంతో ఆదిత్య సత్యని బయటికి తీసుకెళ్లడానికి రెడీ అవుతాడు. మరోవైపు భాగ్యమ్మ రాధను నిలదీస్తుంది. చిన్మయిని వదిలిపెట్టి రాలేకపోతున్నానని అంటుంది రాధ. ఆ తర్వాత మాధవ్ ప్రవర్తనపై అనుమానం కలిగిన జానకి అతడిని నిలదీసే ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 16 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
పోటీలో గెలిచిన దేవిని అందరూ పొగడతారు. గెలిచినందుకు నీకేం కావాలో చెప్పు తల్లి అని అడుగుతాడు రామ్మూర్తి. మరోవైపు దేవుడమ్మ.. బీరువాలో ఉన్న సత్య చీరలన్నీ బయట పెడుతుంది. ఇన్ని చీరలు ఉండగా ఎందుకలా ఉంటున్నావ్ అని అడుగుతుంది. నా గురించి పట్టించుకోవల్సిన ఆదిత్యనే అలా దూరంగా ఉండిపోతే ఇక నేనేం పట్టించుకోవాలి అంటూ అసహనం వ్యక్తం చేస్తుంది. నాకు పిల్లలే అవసరం లేదంటే నేను కూడా అవసరం లేదనే కదా.. అంటూ బాధగా అంటుంది అత్తతో. ‘ఇదే.. మీ చదువుకున్న అమ్మాయిలతో ఉన్న బాధ’ అంటూ సత్యకు భర్తతో ఎలా ఉండాలో నేర్పిస్తుంది. అర్థం చేసుకుంటే హంతకుడి మీద కూడా జాలేస్తుంది అంటూ సత్య మనసుని మారుస్తుంది. భార్యాభర్తల మధ్య కాస్త దూరం పెరుగుతుందనగానే.. అయ్యో నేను తనని అశ్రద్ధ చేస్తున్నానే అనుకోవాలి.. అని మంచి మాటలు చెబుతుంది. ఇపుడే నీకు టైం దొరికిందని, మంచిగా మాట్లాడుకోండని, వాడు అన్న మాటలు మరిచిపోమని హితబోధ చేస్తుంది దేవుడమ్మ.
ఆ తరువాత సీన్‌లో చిన్మయి.. దేవిని రెడీ చేస్తుంది. రాధ వచ్చి ఏంటమ్మా ఇది అని అడగ్గా.. కరాటేలో గెలిచిన దేవిని దేవుడమ్మ నానమ్మ దగ్గరికి పంపిస్తున్నాని జవాబిస్తుంది. నువ్ రెడీ చేయడమేంటి? అని రాధ అనగా.. దేవి అక్కడికే కదమ్మా వెళ్లాల్సింది అంటుంది చిన్మయి. దేవితో వాళ్లు కూడా మనవాళ్లే.. అని చెబుతుంది. దాంతో అనుమానం వ్యక్తం చేస్తుంది దేవి. అపుడు అందరికీ నువ్వంటే చాలా ఇష్టమని, నిజానికి నువ్ అక్కడే ఉండాలని కవర్ చేస్తూ అంటుంది చిన్మయి. అంతలోనే మాధవ వచ్చి చిన్మయి ఏంటమ్మా.. దేవిని ఆ ఇంటికి నువ్ పంపడమేంటి? అని ప్రశ్నిస్తాడు చిన్మయిని. దేవి కరాటేలో గెలిస్తే మనం ఆనందపడ్డాం కదా. అలాగే ఆఫీసర్ వాళ్లు కూడా సంబరపడాలి కదా అంటుంది చిన్మయి. అంతేకాకుండా చిన్మయి మాట్లాడిన మాటలన్నీ విన్న మాధవకు తనపై అనుమానం కలుగుతుంది. దేవిని పంపే విషయంలో నువేం మాట్లాడకు నాన్నా అంటూ.. మాధవ నోరు మూయిస్తుంది చిన్మయి. దేవి నా బిడ్డ కాదని చిన్మయికి తెలిసిపోయిందా ఏంటి? అని ఆందోళన పడతాడు మాధవ్.
సీన్ కట్ చేస్తే.. కాఫీ తాగుతున్న రామ్మూర్తి దగ్గరకు వెళ్తుంది జానకి. మాధవ్ ప్రవర్తనలో మార్పు వచ్చిందని చెబుతూ బాధపడుతుంది. ‘వయసు మారే కొద్ది పద్ధతులు కూడా మారుతాయి కద జానకి’ అంటాడు రామ్మూర్తి. వాడి పద్ధతి ఇతరులను బాధపెట్టేలా ఉంది. తల్లిగా వాడు చేసే పనులను చెప్పలేను. మాధవకు మీరే బుద్ధి చెప్పాలని అడుగుతుంది జానకి. వాడిని అనుమానిస్తే మన పెంపకాన్ని మనమే అనుమానించికున్నట్టు జానకి అంటాడు రామ్మూర్తి. దాంతో కోపంగా అక్కడినుంచి వెళ్లిపోతుంది జానకి.
అక్కడ సత్య.. ఆదిత్యతో బయటికి వెళ్లేందుకు ముస్తాబవుతుంది. భార్యాభర్తలిద్దరూ కలిసి కాసేపు సరదాగా పోట్లాడుకుంటారు. సరిగ్గా వాళ్లు బయలుదేరే సమయానికే ఇంటికి వస్తుంది దేవి. దాంతో సత్యను వదిలేసి ఆదిత్య దేవిని చూసి తెగ సంబరపడిపోతాడు. ఏంటమ్మా ఇలా వచ్చావ్? అని అడగ్గా.. కరాటేలో నాకు డబుల్ ప్రమోషన్ ఇచ్చి గ్రీన్ బెల్ట్ ఇచ్చాడని చెబుతూ హ్యాపీగా ఫీలవుతుంది దేవి. దాంతో ఆదిత్య దేవిని ముద్దాడి పొగడతాడు. ఈ సందర్భంగా నీకు చాక్లెట్లు, కేక్ అన్నీ తీసుకొస్తానని చెప్పి బయటికి వెళ్తాడు. దేవిని చూసి ఆదిత్య ఎందుకిలా అవుతున్నాడు. మేం బయటికి వెళ్దామనుకున్న సంగతి కూడా మరిచిపోయాడు.. అంటూ మదనపడుతుంది.
ఆ తర్వాత సీన్‌లో రాధ గదిలో బట్టలు మడత చేస్తూ ఉంటుంది. అపుడు మాధవ్ దొంగచాటుగా రాధ నడుమును ఫొటో తీస్తాడు. అది జానకి కంట పడుతుంది. కోపంగా మాధవ్ చేతిలోనుంచి ఫోన్ లాక్కొని, పక్కకు తీసుకెళ్తుంది కొడుకుని. ఫోన్లో తీసిన ఫొటోలను చూసి మాధవ్‌ను లాగిపెట్టి కొడుతుంది. రాధని ఇలా చాటుగా ఫొటోలు తీయడమేంటి, ఇలాంటి దృష్టితో చూడడమేంటని చెడామడా వాయిస్తుంది. నీ పద్ధతి మారుతుందని, ఆ అమ్మాయి లేకపోతే నువ్, నీ బిడ్డలేరని తిడుతుంది. తన మెడలో తాళి కట్టింది ఎవరో మనకు తెలియకపోయినా.. దానిని గౌరవిస్తూ బతుకుతుంది. ఇంకోసారి ఇలాంటి తప్పు చేస్తే కొడుకువని కూడా చూడానంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది జానకి. కుక్క తోక వంకరలా ‘అమ్మా నువ్ ఎన్ని చెప్పినా సరే. రాధ ఎప్పటికీ నాదే. ఆ విషయంలో నేనెవ్వరి మాట వినను’ అని మనసులో అనుకుంటాడు మాధవ్. తర్వాత ఏం జరగనుందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..