మాధవ్ ఇంట్లో నుంచి వెళ్లిపోయి అద్దె ఇంట్లో ఉండాలని ఫిక్స్ అవుతుంది రాధ. అదే విషయం జానకి, చిన్మయితో చెబుతుంది. అపుడు చిన్మయి ప్లీజ్ వెళ్లొద్దమ్మా.. అంటూ ఏడుస్తూ తల్లిని వేడుకుంటుంది. దాంతో రాధ నిర్ణయాన్ని మార్చుకుని ఎక్కడికీ వెళ్లకుండా ఇంట్లోనే ఉంటుంది. మరోవైపు ఆదిత్య తనలో ప్రవర్తించిన తీరును అత్తకు చెప్పుకుని బాధపడుతుంది సత్య. ఆదిత్యను మార్చాలన్న ప్రయత్నం చేస్తుంది దేవుడమ్మ. ఆ తర్వాత సెప్టెంబర్ 15 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
రాధని అద్దంలో దొంగచూపులు చూస్తూ షేవింగ్ చేసుకుంటాడు మాధవ్. అక్కడ చిన్మయేమో తల్లినే జాలిగా చూస్తూ ఉండిపోతుంది. అంతలోనే అక్కడికి వచ్చిన జానకికి.. మాధవ్ చేసే వెకిలి చేష్టలు కనిపిస్తాయి. అద్దంలో రాధను చూస్తూ ముద్దు పెడుతున్న మాధవ బుద్ధిని అసహ్యించుకుంటుంది జానకి. మరోవైపు ఆదిత్య.. చిన్మయికి దొరికిన ఫోటోనే దేవికి దొరికినా బాగుండేది అనుకుంటాడు. అదే ఆలోచిస్తుండగా అక్కడికి వస్తుంది దేవుడమ్మ. తననే తదేకంగా చూస్తున్న తల్లితో ఏమైందమ్మా.. అలా చూస్తున్నావ్ అని అడుగుతాడు. ‘నా బిడ్డలో వచ్చిన మార్పుకు కారణం ఏంటో అర్థం కావట్లేదు రా. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా మనల్ని అభిమానించే వాళ్లను బాధపెట్టకూడదు రా.. ఇంట్లో కూడా బయటలా ఉంటే ఇల్లెందుకు నాన్నా.. నిన్ను చూసి ఊరు సంతోష పడడం కాదు.. ఇంట్లో వాళ్లు సంతోషపడాలి. నీ వల్ల సత్య బాధపడుతుంది. అసలు పిల్లలు వద్దు అనే మాట ఏంటి రా.. ఆ మాట వింటే ఏ భార్యనైనా తట్టుకుంటుందా. నీ కోసమే బతుకుతున్న సత్యను బాధపెట్టకు ఆదిత్య. వెళ్లి సత్యతో ప్రేమగా మాట్లాడు’ అని హితబోధ చేస్తుంది దేవుడమ్మ.
ఆ తర్వాత సీన్‌లో దేవీని తీసుకుని రాధ, భాగ్యమ్మలు కరాటే పోటీకి వెళ్తారు. అక్కడ ‘బిడ్డా నువ్ ఏం చేస్తున్నావో నాకేం అర్థం కావట్లేదు. ఆ ఇంట్లో ఉండను. అద్దెకు ఉంటా అంటివి. ఇప్పుడేమో రానంటున్నావ్. ఎందుకు’ అని ప్రశ్నిస్తుంది భాగ్యమ్మ రాధని. చిన్మయిని వదిలిపెట్టి నేను రాలేకపోతున్నానని ఎమోషనల్ అవుతుంది రాధ. నా కడుపున కనకున్నా అది నా బిడ్డే అంటూ బాధపడుతుంది. ‘మరి ఆ ఇంట్లో నుంచి ఎలా వస్తావ్ బిడ్డ’ అని భాగ్యమ్మ అడగ్గా.. నాకేం సమజయితలేదు అంటుంది రాధ.
సీన్ కట్ చేస్తే.. ఒంటరిగా కూర్చుని కుమిలిపోతున్న సత్య దగ్గరికి వస్తాడు ఆదిత్య. ‘నన్ను కొట్టాలని ఉంటే కొట్టు. తిట్టాలని ఉంటే తిట్టు. నిన్ను బాధపెట్టినందకు సారీ సత్య. నాకున్న ప్రెజర్ వల్ల అలా చిరాకు పడ్డా. అపుడు నువ్ కూడా నన్ను కోప్పడొచ్చుకదా. ఎందుకు కామ్‌గా ఉన్నావ్’ అంటూ ఓదార్చుతాడు సత్యను. ‘నాకు నిన్ను ప్రేమించడం తప్ప కోప్పడడం తెలియదు. నువ్ ఆ మాట అన్న క్షణం నుంచి ఈ క్షణం వరకు నేను బాధపడుతూనే ఉన్నా. వారసుల కోసం అందరం కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాం. అమ్మ కావడం నాకు ఇష్టం ఆదిత్య’ అంటూ కంటతడి పెడుతుంది సత్య. అందరిలాగే నాకూ పిల్లలు కావాలి ఆదిత్య. ఇది మన కోసమే కాదు ఆంటీ, అంకుల్ కోసం కూడా. నువ్ అలా పరాయి పిల్లల మీద ప్రేమ చూపిస్తుంటే నేను తట్టుకోలేకపోయాను ఆదిత్య అంటూ ఎమోషనల్ అవుతుంది. ‘దేవి పరాయిది కాదని నీకెలా చెప్పాలి సత్య. నీకు నిజం తెలిసే రోజు త్వరగా రావాలని కోరుకుంటున్నా’ అని మనసులో అనుకుంటాడు ఆదిత్య.
నిన్ను బాధపెట్టినందుకు ఏం చేయాలో చెప్పు అని అడుగుతాడు ఆదిత్య. నీకు అది అర్థం అయింది కదా. అది చాలు అంటుంది సత్య. లేదు సత్యా.. నీకేం కావాలో చెప్పు. ఏం కావాలన్నా చేస్తా అంటూ బుజ్జగిస్తాడు ఆఫీసర్ భార్యని. అపుడు సత్య మనం బయటికి వెళ్లి చాలా రోజులు అయింది కద ఆదిత్య. ఇంట్లో దగ్గరగా ఉన్నా మన మధ్య చాలా దూరం ఉంది. కనీసం ఈ రోజైనా బయటికి వెళ్లి కలిసి తిరుగుదాం. కలిసి తిందాం’ అని కోరుకుంటుంది సత్య. సరే వెళ్లి రెడీ అవు అని అంటాడు భార్యతో. దాంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు కరిగి ప్రేమగా కౌగిలించుకుంటారు.
ఆ తర్వాత సీన్‌లో జానకి ‘మాధవా.. ఏంట్రా నీ అలవాట్లు మారిపోతున్నాయి. ఆ గిటారు వాయించడం ఏంటి ’ అని కోపంగా అంటుంది. ఆనందం కలిగినపుడు అలా చేస్తుంటా అని చెప్తాడు మాదవ్. రాధకు అద్దంలో ముద్దు పెట్టిన విషయాన్ని అడుగుతుండగానే దేవి వచ్చి నాయన, అవ్వ అంటుంది. తనకు ఇచ్చిన బెల్టుని చూపించి, తనకు ప్రమోషన్ వచ్చిందని చెబుతూ సంబరపడిపోతుంది దేవి. మాధవ తల్లికి అసలు విషయం చెప్తాడా? లేదా అన్నది తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..