ఇంట్లోనుంచి వెళ్లిపోయిన దేవిని వెతికి పట్టుకుంటారు. నేను ఎలాగైనా మా నాయన్ని చూడాలని దేవి చెప్పగా.. నాలుగు రోజుల్లో వెతికి పెడతానని మాటిస్తాడు ఆదిత్య. మరో వైపు మాధవ్, ఆదిత్యల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. అక్కడేమో దేవి తండ్రి గురించి తెలిసే వరకు అన్నం తినని మారాం చేస్తుంది. మాధవ్‌కు ఎలా బుద్ధి చెప్పాలని ఆదిత్య ఆలోచిస్తుంటాడు. ఆ తర్వాత ఆగస్టు 13 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
రుక్కు ఆదిత్యకు ఫోన్ చేసి.. బిడ్డ ఇంకా మొండిగా అయింది. మా నాయన ఎక్కడున్నాడో చెప్పు.. చూపించే వరకు ఏమీ తినని లొల్లి చేస్తుంది. నాకేం చేయాలో తోచట్లేదు. ఆ మాధవ్ సార్ నువ్ దుర్మార్గుడివని బిడ్డకు చెప్పినంక నిను చూపించి మీ నాయన అని ఎట్లా చెప్పాలి.. అని ఆవేదనగా తన గోడు వెల్లబోసుకుంటుంది. కళ్ల ముందే ఉన్నా అగో మీ నాయన అని చెప్పలేకపోతున్నా అంటూ ఏడుస్తుంది. తనకి ఏదో ఒకటి నచ్చచెప్పి ముందు తినిపించు. ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దాం అంటాడు ఆదిత్య బాధగా.
మరునాడు ఉదయం నిద్రలేచిన ఆదిత్యకు దేవి మాటలు గుర్తుకువస్తాయి. ఏదో ఒకటి చేయాలనుకుంటాడు. వెంటనే మాధవ్‌కు ఫోన్ చేస్తాడు. ‘ఏంటి ఆఫీసర్ గారు. రాధకు ఫోన్ చేయబోయి నాకు చేశారా’ అంటాడు వెటకారంగా. నీతో మాట్లాడాలి. లొకేషన్ షేర్ చేస్తా. అక్కడికి రా.. అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు ఆదిత్య. వంటగదిలో ఉన్న రాధ దగ్గరికి వెళ్లి ‘ఆదిత్య.. నీ పెనిమిటి ఫోన్ చేశాడు. ఎందుకో తెలియదు. నాతో మాట్లాడాలి అన్నాడు. ఆ మాట చెప్పేటపుడు మాత్రం బాగా కోపంగా ఉన్నాడు. కానీ ‘రా’ అన్న తర్వాత నేను వెళ్లకపోతే బాగుండదు కద. అక్కడికి వెళ్లాక ఏమైనా జరగచ్చు. నీకోసం ఆ మాత్రం భరించలేనా? కానీ ఒక్కటి రాధ. నేను అనుకున్నదే జరగాలి. జరుగుతుంది. వెళ్లొస్తాను’ అంటూ బ్లాక్‌మెయిల్ చేస్తాడు.
మాధవ్, ఆదిత్యలు కలుసుకుంటే ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతుంది రాధ. వెంటనే ఆదిత్యకు ఫోన్ చేస్తుంది. తర్వాత సీన్‌లో వారిద్దరు కలుసుకుంటారు. ‘ఏంటి ఆఫీసర్ రమ్మని ఫోన్ చేశారు. మాటలో ఆవేశం, పిలుపులో అభిమానం కనిపించింది. అందుకే వచ్చాను అంటాడు’ మాధవ్. ‘ఎందుకు మాధవ్ ఇలా చేస్తున్నావ్. రామ్మూర్తి గారు ఎంత పెద్ద మనిషి. అలాంటి ఆయన పేరు నిలబెట్టాలి కానీ ఇలాంటి పనులు చేస్తావా?’ అంటాడు ఆదిత్య. ఇంత సీరియస్‌గా పిలిచి స్కూలు పిల్లలకు చెప్పినట్టు నీతి పాఠాలేంటి? అని పొగరుగా బదులిస్తాడు మాధవ్. దేవి నా కూతురని తెలిసి.. తన దృష్టిలో నన్ను ఎందుకు చెడ్డవాడిని చేశావ్? అయినా నీకు వచ్చే లాభం ఏంటని నిలదీస్తాడు ఆదిత్య. ఏంటి ఆఫీసర్.. రాగానే నన్ను తిడతావేమో, కొడతావేమో అని భయంతో వస్తే నువ్విలా ప్రశాంతంగా మాట్లాడుతున్నావ్ అంటాడు మాధవ్. ప్రతీసారి కొట్టుకోవడానికి మనం చిన్న పిల్లలం కాదు.. అందుకే అసలు నీ సమస్యేంటే తెలుసుకోవడానికి పిలిచాను అంటాడు ఆదిత్య.
‘దేవీకి నాన్నవి నువ్వే అని నాకు తెలుసు. నన్ను ఎందుకు చెప్పలేదని నన్నడుగుతున్నావ్.. మరి మీరెందుకు చెప్పట్లేదు?’ అంటాడు మాధవ్. నిజాన్ని దాచిపెట్టి దేవిని బాధపెట్టింది నువ్వు, రాధ అని తెలివిగా సమాధానమిస్తాడు. నేనొక ప్లాన్ చేశాను. వీటన్నింటికి సమాధానం అక్కడ దొరుకుతుంది అని చెప్పి వెళ్లిపోతాడు మాధవ్. మరోవైపు రాధ టెన్షన్ పడుతూ ఆదిత్యకు ఫోన్ చేస్తుంది. కానీ అతడు ఆఫీసు పనిమీద హడవుడిగా వెళ్తాడు. ఆదిత్య ఫోన్ తీయకపోవడంతో రాధకు టెన్షన్ మరింత ఎక్కువవుతుంది. అక్కడ ఏం జరుగుతుందోనని బాధపడుతుంటుంది.
ఆ తర్వాత సీన్‌లో ఆదిత్య ఆఫీసులో కనిపిస్తాడు. వరదల వల్ల ఆస్తి నష్టం జరగకపోయినా, ప్రాణ నష్టం జరగకూడదని ఫోన్‌లో చెప్తాడు. ఆ ప్రమాదం వల్ల కంగారుగా ఉంటాడు ఆదిత్య. మాధవ్ ఏదో చేస్తుండని రాధ చెప్పిన మాటలు గుర్తుకొచ్చి ఫోన్ చేస్తాడు. దేవి వాళ్ల స్కూల్‌కి రమ్మని చెప్తాడు. పెనిమిటి ఎందుకు రమ్మన్నాడని ఆలోచిస్తూ వెళ్తుంది రుక్క. మాధవ్ సారూ, పెనిమిటి మద్య ఏం జరిగిందో అర్థం కావట్లేదు అంటూ బయలుదేరుతుంది. తర్వాత సీన్‌లో ఆదిత్య, రుక్కు కలుస్తారు. ఏమైంది పెనిమిటి ఇంట్లో అందరూ బాగనే ఉన్నారా అంటుంది రుక్కు. అందరూ బాగున్నారు నువ్ టెన్షన్ పడకని అంటాడు. మాధవ్ గురించి రుక్కు అడుగుతుండగా.. ‘రుక్మిణి నువ్ క్లాస్‌కు వెళ్లి దేవిని తీసుకురా. మనం ఒకచోటుకు వెళ్లాలి’ అంటాడు ఆదిత్య. ఏడికి అని రుక్కు అడగ్గా ముందు వెళ్లి దేవిని తీసుకురమ్మంటాడు.
క్లాస్‌కు వెళ్లి వచ్చి.. సార్ పంపిస్తానన్నారు అని చెప్తుంది ఆదిత్యతో. ‘ఏంది పెనిమిటి. ఏమైంది. నువేంటి అట్లున్నావ్. మమ్మల్ని ఎక్కడికి తీసుకెల్తున్నావ్’ అంటూ ప్రశ్నలు వేస్తుంది. ‘దేవి కోరిక తీర్చడానికి తీసుకెళ్తున్నా. ఆ మాధవ్ గాడి అతి తెలివి తేటలు. ఇల్లు కదలని వాడికే అన్ని ఉంటే ఆఫీసర్‌ని నాకెన్ని తెలివితేటలు ఉంటాయి. వాడు తీసిన గోతిలో వాడే పడేలా చేస్తాను’ అంటాడు ఆదిత్య. అంతలోనే దేవి ఆఫీసర్ సారూ అంటూ వస్తుంది. పనుందమ్మా.. మనం ఒక చోటుకు వెళ్లాలి. వచ్చి కారు ఎక్కి అంటాడు ఆదిత్య. దేవిని ఎక్కడికి తీసుకెళ్తాడు. మాధవ్‌ని ఆదిత్య ఏం చేయనున్నాడో తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..