తన అక్క రాధ గురించి సత్యకు చెడుగా చెప్తూ ఎమోషనల్ అవుతాడు మాధవ్. అక్కడ ఆదిత్య, ఇక్కడ అక్క.. ఇద్దరి పరిస్థితి ఒకలాగే ఉంది అని ఆలోచిస్తూ బాధపడుతుంది సత్య. మాధవ్ చేస్తున్న బ్లాక్‌మెయిల్ గురించి ఆదిత్యకు చెబుతూ కంటతడి పెడుతుంది రుక్మిణి. తన నిస్సహాయతను తలుచుకొని ఆదిత్య బాధపడతాడు. మరోవైపు మాధవ్ రాధని సతాయిస్తూనే ఉంటాడు. తను ఇచ్చిన ఆఫర్ నచ్చట్లేదా? అని అడుగుతాడు రాధని. ఆ తర్వాత ఆగస్టు 10 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
‘అయినా నన్ను ఆ విధంగా రోడ్డు మీద వదిలేసి వచ్చావేంటి రాధ. నేనిచ్చిన ఆఫర్ నచ్చలేదా..’ అని ప్రశ్నిస్తాడు మాధవ్. నాతో కాదు సారూ అని రాధ చెప్పగా.. ‘దేవి సంతోషంగా ఉండాలనే నీ కోరిక తీర్చాలనే కదా నా ఆరాటం. దానికే నా మీద కారు ఎక్కించాలనుకున్నవా’ అంటాడు మాధవ్ తెలివిగా. ఎక్కించనందుకు సంతోషించు. మీ అమ్మా, నాన్న ముఖం చూసి.. చిన్మయి బాధపడుతుందని నిన్ను ఏం చేయకుండా వదిలేసిన అంటుంది రాధ కోపంగా. ఆ తర్వాత రాధ, మాధవ్‌ల మధ్య వాగ్వాదం జరుగుతుంది. ‘కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నువ్ ఎన్ని ప్రయత్నాలు చేసి ఎవరిని ఎవరికి దూరం చేసినా.. నా పెనిమిటి కట్టిన తాళి మీద ఒట్టేసి చెబుతున్నా. నా బతుకు నా పెనిమిటి కోసమే. ఎప్పటికీ నా పెనిమిటి ఆఫీసర్ సారే’ అని గట్టిగానే హెచ్చరిస్తుంది మాధవ్‌ని. అలా ఎంత ఛీ.. కొట్టినా మాధవ్ రాధని వదలకుండా.. తన మనసు మార్చాలని ప్రయత్నిస్తాడు. ‘నువ్ నా భార్య అన్న ముద్ర ఎప్పటికీ పోదు’ అని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు మాధవ్.
మరోవైపు తన తండ్రి గురించి మాధవ్ చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ బాధపడుతుంది దేవి. తర్వాత సీన్‌లో దేవి, చిన్మయి కలిసి స్కూల్‌లో లంచ్ చేస్తుంటారు. పక్కనే కూర్చున్న కొందరు విద్యార్థుల మాటలను వింటుంది దేవి. అందులో ఒకరు ‘నిన్న పేరేంట్స్ మీటింగ్‌లో మీ మమ్మీతో వచ్చింది మీ డాడీ కాదట కదా అనగా ఇంకో స్టూడెంట్ అవును మా డాడీ మంచోడు కాదని అంకుల్ వాళ్లింట్లో ఉంటున్నాం’ అని చెప్తుంది. అలా అంకుల్ వాళ్లింట్లో ఉంటే తప్పుతప్పుగా అనుకుంటారు అని మరొక విద్యార్థి అంటుంది. తినడం మానేసి ఆ మాటలు వింటూ అటు వైపే చూస్తుంది దేవి. క్లాస్‌కు టైం అవుతుంది త్వరగా తినమని చెబుతుంది చిన్మయి.
తన తండ్రి గురించి కూడా స్కూళ్లో తెలిస్తే అలానే చెడుగా మాట్లాడుకుంటారని.. ఎలాగైనా నాయనను వెతికి పట్టుకోవాలని గట్టిగా ఫిక్స్ అయిపోతుంది దేవి. రాధ దగ్గరున్న ఫోన్ గురించి, మాధవ్ చెప్పిన మాటలను గుర్తుచేసుకుంటూ దుప్పటి, దిండు తీసుకుని బెడ్రూం నుంచి బయటికి వెళ్తుంది సత్య. అంతలోనే ఎదురుగా వచ్చిన ఆదిత్య ఎక్కడికెళ్తున్నావ్ అని అడగ్గా బయట పడుకుంటాను అంటుంది బాధగా. ఆదిత్య తనకు అబద్ధాలు చెప్పి మోసం చేస్తున్నాడని బాధపడుతూ.. ‘ఒకమాట అడుగుతాను నిజం చెప్పు ఆదిత్య. అసలు నీ మనసులో నా స్థానం ఏంటి?’ అంటుంది. ఆ మాట విని ఒకింత షాకయిన ఆదిత్య వెంటనే తేరుకుని ‘నీ స్థానం భార్య స్థానమని కొత్తగా చెప్పాలా?’ అంటాడు. తనకలా అనిపించలేదని, తనకు ఆదిత్యపై ఉన్న ప్రేమని, మనసులో ఉన్న బాధని వెళ్లబోస్తుంది సత్య. ‘నీ కష్ట, సుఖాలు భార్యగా నాతో కాక ఇంకెవరితో పంచుకుంటావ్ ఆదిత్య. నేనూ మనిషినే ఆదిత్య నాకు ఎమోషన్స్ ఉంటాయి’ అంటూ కన్నీరు పెట్టుకుంటు బయటికి వెళ్తుంది సత్య. దేవి తన కూతురుగా ఇంటికి వచ్చేదాకా ఎవరికి ఏం చెప్పుకోలేను అని సత్యను ఉద్దేశించి అనుకుంటాడు ఆదిత్య.
అటు నిద్రపోతూ కూడా దేవి తండ్రిని వెతికిపట్టుకోవాలని కలలు కంటుంది. ‘నాయనా’ అంటూ నిద్రలేచి ఉలిక్కి పడుతుంది. రాధ పరుగున వచ్చి ఏమైందమ్మా.. గట్ల అరిచినవ్ అంటుంది. బదులుగా దేవి.. కళ్లు మూసినా తెరిచినా నాయనే గుర్తుకొస్తుండు. నాయన ఎలా ఉంటాడు? ఎక్కడ ఉంటాడు? అని వరుస ప్రశ్నలు వేస్తూ ఇబ్బంది పెడుతుంది రాధని. మీ నాయన ఏడున్నాడో నాకు తెలియదు. తెలిస్తే నీకు చెప్పనా? ఇలా పదే పదే అడిగి నన్ను బాధపెట్టకు బిడ్డా.. అని కంటతడి పెడుతూ చెప్తుంది రాధ. దేవి పడుకోగానే చిన్మయి కూడా వచ్చి పడుకుంటుంది. దేవి మనసులో విషం నింపిన మాధవ్‌ని తిట్టుకుంటూ ఏడుస్తుంది రాధ.
సీన్ కట్ చేస్తే.. దేవుడమ్మ పిల్లల బొమ్మలు, బట్టలు చూస్తూ తెగ మురిసిపోతుంటుంది. ఏంటి దేవుడమ్మా.. ఎవరికోసం ఇవన్నీ అంటాడు భర్త. దేవిని చూడగానే రుక్మిణి బిడ్డ గుర్తొచ్చింది. మన రుక్మిణికి పాపో,బాబో తెలియదు. అందుకే ఈ బిడ్డలన్నీ తీసుకొచ్చిన అని సంబరపడుతూ చెబుతుంది దేవుడమ్మా. ఓ వైపు అమెరికా ప్రయాణం విరమించుకుందని సత్య బాధపడుతుంటే.. ఓదార్చాల్సింది పోయి ఇదేంటి దేవుడమ్మా అని ప్రశ్నిస్తాడు భర్త. ఈ ఇంటి వారసత్వం రుక్మిణి దగ్గర ఉంది కదండీ అంటుంది దేవుడమ్మా. ఏంటి దేవుడమ్మా ఇది.. కనిపించని రుక్మిణి, బిడ్డ గురించి ఆలోచిస్తున్నావ్. నువ్ పట్టించుకోకుండా, ఆదిత్య పట్టించుకోకుండా ఉంటే ఆ అమ్మాయి పరిస్థితేం కావాలో ఆలోచించు అంటాడు దేవుడమ్మతో భర్త. సత్య కోసం దేవుడమ్మ ఆదిత్యను ఒప్పించి అమెరికా పంపిస్తుందా.. లేదా? అనేది తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..