Delhi liquor Scam: ఢిల్లీ మద్యం కుంభకోణం కొన్ని రోజులుగా అనేక మంది నేతల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఎప్పుడు ఎవరి మీదపడి దర్యాప్తు చేపడతారో, ఎప్పుడు ఎవరి ఇళ్లలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టేట్ అధికారులు దాడులు చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. తాజాగా దేశ వ్యాప్తంగా అనేక చోట్ల ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేసింది ఈడీ. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో పలువురు నేతల ఇళ్లు, ఆఫీసుల్లోనూ తనిఖీలు జరిగాయి. ఈ కేసులో ఇప్పటికే పలువురు అరెస్టయ్యారు.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక నేత, అధికార పార్టీ పార్లమెంటు సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి బంధువుకు ఈడీ ఝలక్ ఇచ్చింది. విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి సోదరుడు, అరబిందో ఫార్మా డైరెక్టర్ పి.శరత్ చంద్రారెడ్డిని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. దీంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముఖ్యంగా బీజేపీ కేంద్ర పెద్దలతో సఖ్యతగా మసలుకుంటున్న నేపథ్యంలోనూ ఇలా వైసీపీ నేత బంధువు అరెస్టు కావడం సంచలనంగా మారుతోంది.
మూడు రోజులపాటు విచారించిన ఈడీ.. శరత్ చంద్రారెడ్డి తోపాటు లిక్కర్ కంపెనీ పెర్నోడ్ రికార్డ్ ఇండియాకు చెందిన వినయ్ బాబును ఈడీ అరెస్టు చేసింది. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సహాయకుడు దినేష్ అరోరా అప్రూవర్ గా మారాడు. ఈ నేపథ్యంలో లిక్కర్ స్కామ్ లో మరింత మంది ప్రముఖుల పేర్లు బయటకొచ్చే చాన్స్ ఉంది.
Delhi liquor Scam: హైదరాబాద్ లోనూ మూలాలు..
ఇప్పటికే ఈ కుంభకోణంలో హైదరాబాద్ కు చెందిన వ్యాపారి బోయిన్ పల్లి అభిషేక్ రావు అరెస్టయ్యారు. అలాగే ముంబైకి చెందిన విజయ్ నాయర్, ఢిల్లీకి చెందిన సమీర్ మహేంద్రును అధికారులు అరెస్టు చేశారు. మద్యం పాలసీని మార్చడం ద్వారా మద్యం అమ్మకందారులకు లాభాలను భారీగా పెంచుకోవడం, ప్రభుత్వ ఆదాయాన్ని తగ్గించేశారనే ఆరోపణల నేపథ్యంలో ఈ స్కామ్ లో దర్యాప్తు జరుగుతోంది.