Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతూనే ఉంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేతలకు ఈ స్కాంలో ఉన్నారనే ఆరోపణలు పెద్ద దుమారం రేపుతున్నాయి. అధికార పార్టీలకు చెందిన టీఆర్ఎస్, వైసీపీ నేతలతో పాటు ప్రతిపక్షాలకు చెందిన నేతల హస్తం కూడా ఇందులో ఉందనే ఆరోపణలు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతూనే ఉన్నాయి. ఈ స్కాంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఉన్నారనే ప్రచారం బీజేపీ నేతలు చేస్తుండగా.. ఈ స్కాంలో సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతితో పాటు వైసీసీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడి పాత్ర ఉందని ఏపీ ప్రతిపక్ష టీడీపీ నేతలు చేస్తున్నారు.
దీంతో ఢిల్లీ లిక్కర్ స్కాం తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కాక రేపుతోంది. తాజాగా ఏపీ మంత్రి పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. లిక్కర్ స్కాంలో భారతిని తీసుకురావడంపై మండిపడ్డారు. అసలు భారతికి, లిక్కర్ స్కాంకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంతో అసలు ఏపీ ప్రభుత్వానికి సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో రేవంత్ రెడ్డి బంధువుల పాత్ర ఉందని, దానిని సీఎం జగన్ కుటుంబసభ్యులకు అంటగడుతున్నారని పెద్దిరెడ్డి ఆరోపించారు. ఈ స్కాంలో భారతి ఉందని ముడిపెట్టి తప్పుడు ప్రచారం చేయడం సరికాదని వ్యాఖ్యానించారు.
Delhi Liquor Scam:
ఉద్దేశపూర్వకంగానే జగన్ కుటుంబసభ్యులను కుంభకోణంలోకి తీసుకొస్తున్నారని పెద్దిరెడ్డి విమర్శించారు. ఇంకోసారి భారతి పేరు ఇందులోకి లాగితే చూస్తూ ఊరుకబోమని హెచ్చరించారు. తమపై రాజకీయాల్లో చేస్తే ఎదుర్కొంటామని, కానీ కుటుంబ సభ్యులను లాగితే చూస్తూ కూర్చోమని పెద్దిరెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఎస్సీ,ఎస్టీ, మైనారిటీలకు షాదీ తోపా పథకం ప్రవేశపెట్టాలని ప్రకటించిందని, దానిపై మంచి పేరు వస్తున్నందుకే పక్కదారి పట్టించేందుకు భారతిపై తప్పుడు ప్రచారానికి టీడీపీ ఒడిగట్టిదని పెద్దిరెడ్డి విమర్శించారు. ఇకనైన నీచరాజకీయాలను మానుకోవాలని టీడీపీ నేతలకు ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వంపై పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఇసుక కేటాయింపు పారదర్శకంగా జరుగుతుందన్నారు. ఇసుక కాంట్రాక్టర్లు దక్కించుకున్నవారు సబ్ కాంట్రాక్ట్ ఇవ్వవచ్చని, దానితో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు.