coronavirus : రెండు రోజుల క్రితం చైనా నుంచి తిరిగి వచ్చిన 40 ఏళ్ల వ్యక్తికి కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఈ వ్యక్తి తన ఇంట్లో క్వారంటైన్ లో ఉన్నాడని చీఫ్ మెడికల్ ఆఫీసర్ అరుణ్ శ్రీవాస్తవ తెలిపారు. అనంతరం సదరు వ్యక్తి సాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం లక్నోకు పంపనున్నట్లు ఆయన తెలిపారు.

యూపి కి చెందిన సదరు వ్యక్తిని అతని ఇంటి వద్ద ఒంటరిగా ఉంచామని , అతని కుటుంబ సభ్యులు , అతనితో పరిచయం ఉన్నవారికి పరీక్షలు నిర్వహించమని ఆరోగ్య శాఖ బృందాలను కోరామని శ్రీవాస్తవ తెలిపారు.
ఈ వ్యక్తి డిసెంబరు 23న చైనా నుంచి ఢిల్లీ మీదుగా ఆగ్రాకు తిరిగి వచ్చాడని , ఆ తర్వాత అతడిని ప్రైవేట్ ల్యాబ్‌లో పరీక్షించామన్నారు . రిపోర్టులో కోవిడ్ పాజిటివ్ వచ్చిందని ఆయన తెలిపారు.నవంబర్ 25 తర్వాత జిల్లాలో ఇదే తొలి కోవిడ్ పాజిటివ్ కేసు అని అధికారులు తెలిపారు.

చైనాతో సహా కొన్ని దేశాల్లో కోవిడ్ కేసుల పెరుగుదలతో కేంద్రం కరోనా వైరస్ వ్యతిరేక చర్యలను వేగవంతం చేసింది. చైనా, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్ ,థాయ్‌లాండ్ ప్రయాణీకులకు RT-PCR పరీక్ష తప్పనిసరి అని కేంద్రం తెలిపింది. ఈ క్రమంలో మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్‌లతో సహా ఆరోగ్య సౌకర్యాల సంసిద్ధతను నిర్ధారించడానికి డిసెంబర్ 27 న మాక్ డ్రిల్ నిర్వహించాలని రాష్ట్రాలను కోరింది.
ఆగ్రాలోని ఆరోగ్య శాఖ తాజ్ మహల్, ఆగ్రా ఫోర్ట్ , అక్బర్ సమాధి వద్ద విదేశీ పర్యాటకుల నమూనాలను పరీక్షించడం , సేకరించడం ప్రారంభించింది. అంతేకాకుండా, ఆగ్రా విమానాశ్రయం, రైల్వే స్టేషన్ , ఇంటర్ బస్ టెర్మినల్ వద్ద కూడా నమూనాలను సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

సరోజనీ నాయుడు వైద్య కళాశాల, జిల్లా హాస్పిటల్ , గ్రామీణ ఆగ్రాలోని ప్రాథమిక , కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలలో నమూనా సేకరణ ను ప్రారంభించింది. జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలు ఉన్నవారు కోవిడ్ పరీక్ష చేయించుకోవడానికి ఆరోగ్య కేంద్రాలను సందర్శించవచ్చు అని CMO తెలిపింది.