Munugode : మునుగోడు ఉప ఎన్నిక దాదాపు ఖరారై పోయింది. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ఈ ఉపఎన్నిక కీలకం కావడంతో పార్టీలన్నీ విజయం కోసం తీవ్ర స్థాయిలో శ్రమిస్తున్నాయి. అయితే ప్రచారంలో టీఆర్‌ఎస్, బీజేపీలు దూసుకుపోతుండగా.. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. ప్రచారంలో తాము వెనుకబడ్డామనే భావన ఆ పార్టీ వర్గాల్లో సైతం వ్యక్తమవుతోంది. మిగతా రెండు పార్టీలు నియోజకవర్గం, మండల స్థాయిల నుంచి గ్రామ స్థాయి వరకు వెళుతుండగా, కాంగ్రెస్ నేతలు మాత్రం అడుగు ముందుకు వేయడం లేదు. నిజానికి టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పేరు ప్రకటించగానే.. ఇక కాంగ్రెస్ పార్టీకి పూర్వమున్న జవసత్వాలు వచ్చినట్టేనని అంతా భావించారు. కానీ ఇప్పుడు అభిప్రాయం పూర్తిగా మారిపోయింది.
కాంగ్రెస్ పార్టీలో ఆశావహులు ఎక్కువ. ఎవరికి టికెట్ ఇస్తే.. ఎవరు ఎదురుతిరుగుతారోనన్న భయం. వెరసి ఇంకా పార్టీ కీలక నేతలంతా సందిగ్ధంలోనే ఉండిపోయారనే టాక్ నడుస్తోంది. నిజానికి మునుగోడు కాంగ్రెస్‌కు సిట్టింగ్ స్థానం. అంతేకాదు.. అక్కడ ఆ పార్టీకి కేడర్ కూడా బాగానే ఉంది. కానీ ఇతర పార్టీలు దూకుడుగా వెళుతున్న నేపథ్యంలో ఉన్న కేడర్ నిస్తేజంలో మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇదే అదనుగా టీఆర్‌ఎస్, బీజేపీలు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు గాలం వేసి తమ శిబిరాల్లో చేర్చుకుంటున్నాయి. మరోవైపు వలసలు సైతం కాంగ్రెస్ పార్టీని ఊపిరి సలపనివ్వడం లేదు. వార్డు సభ్యుల నుంచి మండల పార్టీ అధ్యక్షులు, మండల స్థాయి ప్రజాప్రతినిధులు, మున్సిపల్ పరిధిలోని నాయకులు టీఆర్‌ఎస్, బీజేపీల్లో ఏదో ఒక పార్టీలో చేరిపోతున్నారు.
Munugode : దూసుకుపోతున్న కారు.. రోజుకో గ్రామానికి రాజగోపాల్
ప్రస్తుత పరిస్థితిలో వీలైనంత త్వరగా మార్పు వస్తేనే ఫలితం దక్కే అవకాశం ఉంటుందనే చర్చ ఇటు గాంధీభవన్ వర్గాల్లో.. అటు మునుగోడు పార్టీ కేడర్‌లో జరుగుతోంది. ఈనెల 20న రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా నియోజకవర్గంలో హడావుడి చేసిన కాంగ్రెస్ నేతలు.. ఆ తర్వాత క్షేత్రస్థాయిలోకి వెళ్లలేకపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది తేలితే కానీ ప్రచారం ముందుకు సాగే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు కారు మాత్రం దూసుకుపోతోంది. ఇప్పటికే పార్టీ సింబల్, కేసీఆర్ బొమ్మలున్న గోడ గడియారాలు, గొడుగులు నియోజకవర్గానికి చేరిపోయాయి. మరోవైపు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సైతం రోజుకో గ్రామంలో పర్యటిస్తూ ఉత్సాహం పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తక్షణమే కళ్లు తెరవకుంటే మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.