Chiranjeevi : తాను రాజకీయాలకు దూరమైనా.. రాజకీయాలు తన నుంచి ఇంకా దూరం కాలేదంటూ చిరంజీవి ఇటీవల చేసిన ఓ ట్వీట్ పెను సంచలనం సృష్టించింది. గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్ కోసమే చిరంజీవి ఈ డైలాగ్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారని తొలుత టాక్ నడిచింది. ఆ తరువాత.. దీని వెనుక మరో అర్థం ఏదైనా ఉందేమో అని మరో చర్చ నడిచింది. జనసేన తరపున చిరంజీవి మళ్లీ రాజకీయాల్లో రీ-ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని పలువురు విశ్లేషించారు. ఇక వైసీపీ తరపున చిరంజీవికి రాజ్యసభ ఆఫర్ ఉందనే వాదనలు కూడా వినిపించాయి.
కానీ ట్విస్ట్ ఏంటంటే.. తాజాగా చిరంజీవి పేరుతో పీసీసీ ఐడీకార్డు ఒకటి విడుదల కావడంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ఇప్పుడు సరికొత్త చర్చకు తెరలేపింది. కోవూరు నుంచి పీసీసీ ప్రతినిధిగా చిరంజీవిని పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఓ ఐడీకార్డును జారీ చేసింది. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పరిశీలకుడిగా ఉన్న మధుసూదన్ మిస్త్రీ సంతకం కూడా దీని మీద ఉంది. త్వరలో జరగబోయే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేసేందుకు వీలుగా ఈ ఐడీ కార్డు జారీ చేసినట్టు తెలుస్తోంది.
Chiranjeevi : ఆడియో ట్వీట్‌కు ఈ ఐడీ కార్డుకు ఏమైనా లింక్ ఉందా ?
ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో చిరంజీవి విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఆయన రాజ్యసభ సభ్యుడు అయ్యారు. ఈ క్రమంలోనే కేంద్రమంత్రిగానూ బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత రాజకీయాలకు దూరమయ్యారు. తనకు రాజకీయాలు కలిసి రాలేదనుకున్నారో ఏమో కానీ ఆ ఊసే లేదు. సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి చాలా బిజీ అయిపోయారు. అలా రాజకీయాలకు దూరంగా ఉంటున్న చిరంజీవికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఐడీ కార్డు విడుదల చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనికి ఒక్కరోజు ముందే తాను రాజకీయాలకు దూరమైనా.. తన నుంచి రాజకీయం దూరం కాలేదంటూ చిరంజీవి రిలీజ్ చేసి ఓ ఆడియో ట్వీట్‌కు ఈ ఐడీ కార్డుకు ఏమైనా లింక్ ఉందా ? అనే చర్చ కూడా సాగుతోంది. మొత్తానికి ఈ డైలాగ్ మూవీకి సంబంధించిందా?లేదంటే నిజంగానే తిరిగి రాజకీయాల్లో కీలకంగా మారబోతున్నారా? అనేది తెలియాల్సి ఉంది.