Megastar Vs Garikapati : ‘అక్కడ ఫొటోల సెషన్ ఆపితేనే నేను మాట్లాడతాను. లేకపోతే నేను వెళ్లిపోతాను. నాకేం మొహమాటం లేదు. చిరంజీవిగారు దయచేసి మీరు ఆ ఫొటోసెషన్ ఆపి ఈ పక్కకు రండి. చిరంజీవిగారికి ఇది నా విజ్ఞప్తి.. లేకపోతే నాకు సెలవు ఇప్పించండి’ అంటూ మహా సహస్రావధాని గరికపాటి నరసింహారావు మెగాస్టార్ చిరంజీవిపై నిన్న జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమంలో ఫైర్ అయిన విషయం తెలిసిందే. ఈ మాటలు మెగాస్టార్ అభిమానులకు ఎంత కోపం తెప్పించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ వ్యాఖ్యలు పెను సంచలనానికి దారి తీశాయి. మరి వీరిద్దరిలో తప్పెవరిది? అనే చర్చ కూడా మరోవైపు జరుగుతోంది.
నిజానికి తొలుత ఇదొక సరదా సన్నివేశంగానే జనాలకు కన్వే అయ్యింది. కానీ ఎప్పుడైతే మెగా బ్రదర్ నాగబాబు ట్విటర్ వేదికగా.. తన అన్న పాపులారిటీని చూసి భరించలేకపోతున్నారంటూ ట్వీటారో అప్పటి నుంచి అసలు రచ్చ మొదలైంది. ఆ తరువాత గరికపాటి వ్యాఖ్యలను నానా రచ్చ చేసేశారు. ఒకవైపు మహా సహస్రావధాని ప్రవచనలు చెబుతుంటే.. ఫోటో సెషన్ పెడితే ఎవరికైనా ఎలా ఉంటుంది? తన మాటలెవరూ పట్టించుకోనే పట్టించుకోకుంటే అంతటి మహా సహస్రావధానికి కోపం రాదా? ఇందులో గరికపాటి తప్పేముంది? అనేవారూ లేకపోలేదు.
అలాగని చిరంజీవిని కూడా తప్పుబట్టడం లేదు. ఆయన ఇదంతా ఊహించలేదు. అభిమానులు సెల్ఫీలు అడిగితే కాదనలేకపోయారు. అటు వైపు ప్రవచనాలు చెప్పేందుకు గరికపాటి వారు సమాయత్తమయ్యారన్న విషయాన్ని గ్రహించలేదు. లేదంటే.. అంత మహా సహస్రావధానిని ఇబ్బంది పెట్టే వ్యక్తిత్వం కాదు మెగాస్టార్‌ది. చాలా ఉన్నతంగా ఆలోచించే వ్యక్తి. గరికపాటికి కోపం వచ్చిందన్న విషయాన్ని గ్రహించిన వెంటనే చిరు కూడా చిన్న పిల్లవాడిలా వచ్చి కూర్చున్నారు తప్ప నొచ్చుకోలేదు. మధ్యలో ఉన్న వారికే వచ్చింది బాధంతా.. మీరు ఆ ఫొటోస్ ఆపాలమ్మా.. అది ఆపేస్తే ఆయన రావడానికి వీలవుతుంది.. ప్రోగ్రాం సవ్యంగా సాగిపోతుందని అక్కడవారికి చెబితే చాలా గౌరవంగా ఉండేది. చిరుకి కూడా ఏ ఇబ్బంది ఉండేది కాదు కదా అని కొందరు అంటున్నారు. అదీ నిజమే. కానీ గరికపాటి వారు ఇంత రచ్చ అవుతుందని గ్రహించి ఉండరు.