ఏపీ రాజకీయాలలో మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే ప్రయత్నం చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ సొంతగా అధికారంలోకి రావడంపై కంటే జగన్ ని గద్దె దించాలనే కసితోనే ఎక్కువగా పని చేస్తున్నారనే విమర్శలు ఓ వర్గం నుంచి వినిపిస్తున్నాయి. ముఖ్యంగా జనసేన పార్టీని వీడుతున్న కాపు నేతలు చాలా మంది పవన్ కళ్యాణ్ సొంతగా ఎదగడం కంటే టీడీపీతో పొత్తు పెట్టుకొని రాజకీయం చేయడం, అలాగే వైసీపీని ఒంటరిగా ఎదుర్కొనే ప్రయత్నం చేయడం లేదనే విమర్శలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో తోట చంద్రశేఖర్ లాంటి కీలక నేతలు జనసేనని వీడి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ లో చేరుతున్నారు.
ఇక పవన్ కళ్యాణ్ ని అభిమానించే యువత అతనిని ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నారు. అయితే అలాంటి వారికి పవన్ కళ్యాణ్ తన సమావేశాలతో వ్యూహం తనకి వదిలేయాలని, వచ్చే ఎన్నికలలో అధికారంలోకి జనసేనని తీసుకొచ్చే వ్యూహాలు తనదగ్గర ఉన్నాయని చెబుతున్నారు. ఈ నేపధ్యంలో యువతరం అంతా కూడా పవన్ కళ్యాణ్ ని సింగిల్ అజెండాతో ఫాలో అయిపోతున్నారు. పవన్ కళ్యాణ్ ఏం చేసిన కరెక్ట్ అనే పంథాలో సాగిపోతున్నారు. అయితే ప్రభుత్వ ఉద్యోగాలు చేసి, వాటికి రాజీనామా చేసి జనసేనలో చేరిన మేధావులుగా తమని తాము అనుకునే వారు మాత్రం పవన్ కళ్యాణ్ నిర్ణయాలపై ఎందుకనో అనుమానంతోనే ఉంటున్నారు.
ఈ నేపధ్యంలోనే పార్టీని వీడుతున్నారని తెలుస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవి నుంచి కూడా సపోర్ట్ లేదని వైసీపీ నేతలు విమర్శలు చేస్తూ వస్తున్నారు. చిరంజీవిని పోగొడుతూ, పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా తిడుతూ విమర్శిస్తూ ఉంటారు. చిరంజీవి వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారని ఆ పార్టీ కాపు నేతలు ప్రాజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి తన మద్దతు ఎవరికి ఉంటుందనే దానిపై స్పష్టమైన క్లారిటీ ఇచ్చేశారు. పవన్ కళ్యాణ్ తన కొడుకు లాంటి తమ్ముడు అని, అతన్ని చేతులతో ఎత్తుకొని పెంచానని అన్నాడు.
పవన్ కళ్యాణ్ ని దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా అతని వ్యక్తిత్వం తెలిసిన వ్యక్తిగా చెబుతున్న అతని రాజకీయాలలో మురికిని శుభ్రం చేయడం కోసం దిగాడు. ఆ క్రమంలో తనకి కొంత మురికి అంటుకుంది అన్నారు. పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయాల్సిన అవసరం రాజకీయాలలో మార్పు కావాలనుకునే అందరికి ఉందని పేర్కొన్నారు. అలాగే కొంతమంది పవన్ ని బూతులు తిట్టి నా దగ్గరకి వచ్చి పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్ ని పిలుస్తూ ఉంటారు. బాధగా ఉన్న అలాంటి వారితో మాట్లాడాల్సి వస్తుంది అని వైసీపీ నాయకులపై పరోక్షంగా విమర్శలు చేశారు. ఇలా చిరంజీవి తన మనసులోని మాటని స్పష్టంగా ఈ సారి ఇంటర్వ్యూలో చెప్పేశారనే మాట వినిపిస్తుంది.