Chikoti Praveen : ఒక్కసారిగా పెను సంచలనంగా మారిన క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ కేసును విచారిస్తున్నా కొద్దీ ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. చికోటి ప్రవీణ్ చీకటి జీవితంలో కనిపించే జీవాలు అన్నీ ఇన్నీ కావట. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం సాయిరెడ్డి గూడలో చీకోటికి 12 ఎకరాల ఫామ్‌హౌజ్ ఉంది. ఈ ఫామ్‌హౌజ్‌లో అటవీ అధికారులు తాజాగా తనిఖీలు నిర్వహించారు. అక్కడ కనిపించిన దృశ్యాలను చూసి అటవీ అధికారులే అవాక్కయ్యారు. ఆయన ఫామ్‌హౌసే ఒక మినీ జూ పార్క్ అనివారు చెబుతున్నారు. ఆ జీవాలను చూసి ఆఫ్రికాలో మాత్రమే కనిపించే అరుదైన చిలకలు, అరుదైన పాములు, ఉడుములు, ఊసరవెల్లులు.. ఇలా 24 రకాల పక్షులు, జంతువులు ఉన్నాయి. అన్ని జంతువులు కూడా ఆఫ్రికా, ఆస్ట్రేలియా, సింగపూర్ తదితర దేశాల నుంచి తెప్పించినవేనని సమాచారం.
Chikoti Praveen : తాజా పరిణామాలతో రంగంలోకి దిగారు..
ఇప్పటి వరకూ చికోటి ప్రవీణ్ ఫామ్‌హౌజ్‌లో ఉన్న జీవాల గురించి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నప్పటికీ అటవీ అధికారులు పట్టనట్టే వ్యవహరించారు. కానీ తాజా పరిణామాల నేపథ్యంలో రంగంలోకి దిగక తప్పలేదు. మొత్తానికి మూడు గంటలపాటు తనిఖీలు చేసి వివరాలు సేకరించారు. ఫామ్‌హౌజ్‌లో ఉన్న విదేశీ పక్షులు, పాములు, జంతువుల గురించి పూర్తి వివరాలను ఉన్నతాధికారులకు నివేదిస్తామని చెప్పారు. వన్యప్రాణుల పెంపకానికి సంబంధించి గతంలోనే చీకోటి అనుమతులు తీసుకున్నాడని.. అయితే, అనుమతి లేని జీవాలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో కూడా పరిశీలిస్తున్నామని, శనివారంనాటికి తమ విచారణ పూర్తవుతుందని తెలిపారు.
చికోటి ప్రవీణ్ ఫోన్, ల్యాప్‌ట్యాప్‌లను స్వాధీనం చేసుకున్న ఈడీ.. వాటిలో కీలకమైన వివరాలను సేకరించినట్టు సమాచారం. డిలీట్ చేసిన సమాచారాన్ని కూడా తిరిగి రప్పించి మరీ చెక్ చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రవీణ్ క్యాసినో కార్యకలాపాల వివరాలు.. సినీ, రాజకీయ ప్రముఖులతో చాటింగ్‌లు.. అన్నీ అతడి వాట్సాప్ ఖాతా నుంచి అధికారులు సేకరించారు. గోవాలోని బిగ్‌డాడీ క్యాసినోకు ప్రవీణ్ ఇక్కడి ప్రముఖులను తీసుకెళ్లేవాడని, జూదప్రియులను ఆకర్షించేందుకు సినీ తారలతో కూడిన ప్రచార ప్రోమోలను ప్రముఖుల వాట్సాప్‌లకు పంపేవాడని అధికారుల పరిశీలనలో వెల్లడైంది. ఈనేపథ్యంలో.. ప్రవీణ్‌తో సంబంధాలున్న పదిమంది సినీ, 20 మంది రాజకీయ నాయకులను విచారించేందుకు ఈడీ సిద్ధమైంది.